సెక్షన్‌ సామర్థ్యానికి మించి రైళ్ల పరుగులు

కొత్త లైన్లు లేకుండానే.. ఉన్న లైన్లలోనే రైల్వే శాఖ ఎడాపెడా రైళ్లు పెంచేస్తోంది. ఎక్స్‌ప్రెస్‌లు, ప్యాసింజర్‌ స్పెషల్స్‌, ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఇంకొన్ని స్పెషల్స్‌.. ఇలా వరుసగా అనేక రైళ్లను రోజురోజుకూ పెంచుతూ పోవడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

Published : 05 Jun 2023 04:48 IST

రెగ్యులర్‌ రైళ్లకంటే దాదాపు 50 శాతం అదనం
వీటితో అన్ని విధాలా సమస్యలే అంటున్న రైల్వే వర్గాలు

ఈనాడు, అమరావతి: కొత్త లైన్లు లేకుండానే.. ఉన్న లైన్లలోనే రైల్వే శాఖ ఎడాపెడా రైళ్లు పెంచేస్తోంది. ఎక్స్‌ప్రెస్‌లు, ప్యాసింజర్‌ స్పెషల్స్‌, ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఇంకొన్ని స్పెషల్స్‌.. ఇలా వరుసగా అనేక రైళ్లను రోజురోజుకూ పెంచుతూ పోవడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఉన్న లైన్లలోనే వీటిని నడపటం పెద్ద సవాలుగా మారుతోంది. రైళ్లు ఆలస్యంగా నడవడానికి కూడా ఇది కారణమవుతోందని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. దీనివల్ల మరమ్మతుకూ తక్కువ సమయమే ఉంటోందని చెబుతున్నాయి. విజయవాడ డివిజన్‌లోని ప్రధానంగా విజయవాడ జంక్షన్‌కు చేరుకునేవి, ఇక్కడినుంచి బయలుదేరేవి, దీని మీదుగా వెళ్లే రైళ్లు నిత్యం సగటున 260 వరకు ఉంటున్నాయి. ఇందులో ఎక్స్‌ప్రెస్‌లు 165, ప్యాసింజర్‌ స్పెషల్స్‌ 85, ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు నడిపేవి 10 వరకు ఉంటున్నాయి. ఇది సెక్షన్‌ సామర్థ్యంకంటే 50 శాతం వరకు అదనం. ఈ డివిజన్‌కు వచ్చే గూడ్స్‌ రైళ్లు 100 వరకు ఉండగా, ఇతర డివిజన్లనుంచి వచ్చే గూడ్స్‌ మరో 100 ఉంటున్నాయి. ఇవి సామర్థ్యంకంటే ఎక్కువని అధికారులు చెబుతున్నారు. డివిజన్‌ వ్యాగన్‌ బ్యాలెన్స్‌ సామర్థ్యం 6వేల వ్యాగన్లు కాగా, నిత్యం సుమారు 3 వేల వ్యాగన్ల వరకు ఎక్కువగా నడుపుతున్నారు.

సగటున 20, 30 నిమిషాల జాప్యం

విజయవాడ నుంచి గూడూరు వైపు మూడో లైన్‌ పనులు జరుగుతున్నాయి. అటు రాజమండ్రి, విశాఖవైపు ఇంకా సర్వే, డీపీఆర్‌ తయారీ దశలోనే ఉంది. దీంతో ప్రధానంగా విజయవాడనుంచి రాజమండ్రి వైపు నడిచే ప్రయాణికుల రైళ్లలో నాలుగింట ఒక వంతు సగటున 20-30 నిమిషాలు ఆలస్యంగా గమ్యస్థానాలకు చేరుతున్నాయి. కేవలం రెండు లైన్లు మాత్రమే ఉండటం, ప్రయాణికుల రైళ్లు, గూడ్స్‌ రైళ్లు పెరగడమే ఈ జాప్యానికి ఒక కారణమవుతోంది. ప్రయాణికుల రైలు విజయవాడనుంచి సకాలంలో బయలుదేరినప్పటికీ రాజమండ్రి దాటి సామర్లకోట చేరేసరికి 30 నిమిషాల జాప్యం ఉంటోందని పేర్కొంటున్నారు.

మరమ్మతుకు తగిన సమయమేదీ?

ట్రాక్‌పైగానీ, సిగ్నలింగ్‌లోగానీ ఏవైనా సమస్యలు వచ్చినపుడు వాటి మరమ్మతుకు తగిన సమయం ఉండటం లేదని ఆశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎక్కడైనా ఇంజినీరింగ్‌, సిగ్నల్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఎలక్ట్రికల్‌ వంటి పనులు చేయాల్సి వచ్చినపుడు తక్కువ సమయం ఇస్తుంటారని పేర్కొంటున్నారు. మరమ్మతుకు రెండు గంటలు సమయం కావాలని చెబితే, కేవలం గంటలో చేయాలంటూ ఆపరేషన్స్‌ విభాగం నుంచి ఒత్తిళ్లు ఉంటాయని చెబుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని