‘సేఫ్’ కాదు.. అక్రమాలకు అడ్డా!
నరసరావుపేటలోని ‘సేఫ్ ఫార్ములేషన్స్ సంస్థ’ ట్రెమడాల్ హైడ్రోక్లోరైడ్ మాత్రల తయారీలో అడుగడుగునా అక్రమాలకు పాల్పడింది.
అధిక మొత్తంలో ట్రెమడాల్ మాత్రల తయారీ
ఎగుమతి ఆర్డర్ లేని ‘ఐరిస్ సంస్థ’కు సరఫరా
ఈనాడు-అమరావతి: నరసరావుపేటలోని ‘సేఫ్ ఫార్ములేషన్స్ సంస్థ’ ట్రెమడాల్ హైడ్రోక్లోరైడ్ మాత్రల తయారీలో అడుగడుగునా అక్రమాలకు పాల్పడింది. ఆర్డర్ కంటే ఎక్కువ మొత్తంలో మాత్రలను తయారు చేసింది. జనరిక్ పేరుతో అడిగితే.. ఏకంగా బ్రాండెడ్ పేర్లతో వాటిని సిద్ధం చేసింది. బెంగళూరులోని ఫస్ట్ హెల్త్ సొల్యూషన్ సంస్థ ద్వారా 2021 నవంబరు నుంచి 2022 డిసెంబరు అయిదో తేదీ మధ్య మూడు విడతలుగా 1,62,500 ప్యాక్‌లు (పది షీట్లు-వంద మాత్రలు) తయారీకి ఆర్డర్ రాగా.. 1,77,061 మాత్రలు ఉత్పత్తి చేసింది. అంటే 14,561 ప్యాకెట్లను అధికంగా తయారు చేసింది. జనరిక్ పేరుతో కావాలని బెంగళూరు సంస్థ కోరగా.. సుమారు లక్ష ప్యాకెట్లను బ్రాండెడ్ పేరుతో సిద్ధం చేసింది.
బెంగళూరుకు చెందిన ఐరీస్ హెల్త్ గ్లోబల్ వెల్‌నెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 54,750 ప్యాకెట్ల ట్రెమడాల్ 225 ఎంజీ మాత్రలు తయారు చేసింది. ఐరీస్ సంస్థ ఎగుమతి కోసం అనుమతులు పొందనప్పటికీ.. మాత్రల తయారీ చేపట్టడం గమనార్హం. ట్రెమడాల్ మాత్రలను కేంద్ర ప్రభుత్వం 2018లో మాదక ద్రవ్యాల నిరోధక చట్టం(ఎన్‌డీపీఎస్) పరిధిలోకి తెచ్చింది. వీటి తయారీ, నిల్వ, ఎగుమతులపై ఆంక్షలు విధించింది. విదేశాలకు వాటిని ఎగుమతి చేయాలంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్(సీబీఎన్) నుంచి అనుమతి తప్పనిసరి. ఇవేమీ లేకుండానే. సేఫ్ సంస్థ బెంగళూరులోని ఐరిస్ సంస్థ నుంచి వచ్చిన ఆర్డర్ల మేరకు మాత్రలను తయారు చేయడం గమనార్హం.
మూడు పరిమాణాల్లో..
నొప్పుల నివారణకు వాడే ట్రెమడాల్‌ను అధిక మోతాదులో తీసుకుంటే దుష్పరిణామాలు సంభవిస్తాయి. ఐసిస్ వంటి సంస్థల్లో పనిచేసే ఉగ్రవాదులు తీవ్రమైన నొప్పుల నుంచి ఉపశమనానికి, తక్షణ శక్తికి, ఎక్కువ సమయం మేల్కొని ఉండేందుకు వీటిని వాడుతుంటారు. అటువంటి మాత్రలను నిర్దేశించిన పరిణామంలో కంటే.. సేఫ్ ఫార్ములేషన్స్ సంస్థ అధిక సంఖ్యలో.. అదీ కూడా జనరిక్‌లో కాకుండా బ్రాండెడ్ పేర్ల(పాల్‌మెక్స్, న్యూ రాయల్)తో తయారు చేయడం వెనుక.. పెద్ద కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయి. సేఫ్ సంస్థ ఆవరణలో 225 ఎంజీ, 250 ఎంజీ మాత్రలు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మరో ప్రైవేట్ సంస్థ ఆవరణలో 100 ఎంజీ ట్రెమడాల్ హైడ్రోక్లోరైడ్ మాత్రల తయారీ జరిగింది. తనిఖీల సందర్భంగా 68 రకాల మందులు/పత్రాలను ఔషధ నియంత్రణ పరిపాలనా శాఖ సీజ్ చేసింది. ఇందులో 51 ట్రెమడాల్ మాత్రలకు సంబంధించినవే కావడం గమనార్హం.
స్ట్రిప్‌ల రూపంలో ఉన్న మాత్రలను అట్టెపెట్టెల్లో ఉంచారు. షీట్‌పై బ్యాచ్ నంబరు, వాడకం గడువు, ఇతరత్రా ఉన్నా.. తయారీకి వినియోగించిన మిశ్రమాల వివరాలు మాత్రం లేవు. సేఫ్ సంస్థ ఎటువంటి అనుమతులు లేకుండానే మూడు కేజీల ఆక్సికొడోన్ (oxycodone Hcl Bp)ను కొనుగోలు చేసింది. ఆరు కేజీల మేర విక్రయించింది. వీటికి సంబంధించిన కొనుగోలు బిల్లులు కూడా ఆ సంస్థ వద్ద లభించలేదు. ఆయా ఉల్లంఘనలపై యాజమాన్యాన్ని వివరణ కోరినప్పుడు.. తెలియదు.. పొరపాటు జరిగిందన్న సమాచారం వచ్చింది. దీంతో ‘సేఫ్’లో ఉత్పత్తి ప్రక్రియను నెల పాటు ఔషధ నియంత్రణ పరిపాలనా శాఖ సస్పెండ్ చేసింది. ప్రధానంగా ఈ మందుల తయారీకి ముడి సరకు చెన్నై నుంచి వచ్చింది. బెంగళూరు నుంచి ఆర్డర్లు వచ్చాయి. వీటికి సంబంధించి ప్రత్యేక అధికారిక బృందాలు చెన్నై, బెంగళూరు సంస్థల నుంచి వివరాలు సేకరించాయి. ప్రధాన వ్యక్తులు కేంద్ర నిఘా సంస్థల కస్టడీలో ఉన్నారు.
రాష్ట్రాల వారీగా ‘కోటా’
కేంద్రం ‘సైకో సబ్‌స్టాన్స్’ (మాదక ద్రవ్యాల) జాబితాలో ఉన్న మందుల తయారీపై కఠిన ఆంక్షలు విధించింది. ఆయా రాష్ట్రాల్లోని మందుల తయారీ సంస్థలకు పెద్ద మొత్తంలో ఆర్డర్లు వచ్చినప్పటికీ.. తయారీకి వీల్లేదని వెల్లడించింది. ఈ మేరకు ఏడాది ప్రాతిపదికన రాష్ట్రాల వారీగా తయారీ కోటాలు విధించింది. 2023 సంవత్సరానికి రాష్ట్రంలో అల్ప్రాజోలమ్ మందును 200 కిలోలు, క్లార్డియాజెపోక్సైడ్-3,000, క్లొబాజమ్-1,500, డయాజెపమ్ మందును 700 కిలోలకుమించి తయారు కాకుండా చూడాలని ఔషధ నియంత్రణ శాఖను కేంద్రం ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ayyannapatrudu: వైకాపా ప్రభుత్వ అక్రమాలు కనిపించడం లేదా ఉండవల్లీ?: అయ్యన్న
-
కాంగ్రెస్‌కు మల్లన్న సినిమా చూపిస్తా: మంత్రి మల్లారెడ్డి
-
Nizamabad: అపహరించిన కారులో వచ్చి.. ఏటీఎం లూటీ
-
బాంబులా పేలిన ఫోను.. కిటికీలు, సామాన్లు ధ్వంసం
-
ఐఏఎస్ కొలువుకు ఎసరు తెచ్చిన ‘కుక్క వాకింగ్’
-
పసిప్రాణాన్ని కాపాడిన వృద్ధులు