కుళాయి కనెక్షన్ల నిగ్గుతేల్చే పనిలో కేంద్రం

జల్‌జీవన్‌ మిషన్‌ (జేజేఎం) పనులకు కేంద్రప్రభుత్వ వాటాతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఏటా సరిగా విడుదల చేయట్లేదు.

Updated : 05 Jun 2023 05:15 IST

జేజేఎం పనులపై రాష్ట్రంలో కేంద్ర బృందాల పర్యటన
రాష్ట్రానికి రానున్న కేంద్ర తాగునీటి, ప్రజారోగ్యాభివృద్ధి అదనపు కార్యదర్శి
కేంద్ర బృందాల వివరాలు గోప్యంగా ఉంచుతున్న అధికారులు

ఈనాడు, అమరావతి: జల్‌జీవన్‌ మిషన్‌ (జేజేఎం) పనులకు కేంద్రప్రభుత్వ వాటాతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఏటా సరిగా విడుదల చేయట్లేదు. అయినా మూడున్నరేళ్లలో ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో 35,96,004 ఇళ్లకు కుళాయి  కనెక్షన్లు జారీచేశామని ప్రభుత్వం చెబుతోంది. దీని నిగ్గు తేల్చేందుకు కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నివేదికల ప్రకారం ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చారా? కనెక్షన్లు ఇచ్చినచోట నీటి సరఫరా జరుగుతుందా.. లేదా అనే విషయాలను పరిశీలించనున్నాయి. క్షేత్రస్థాయిలోని పరిస్థితులపై బృందాలు ఇచ్చే నివేదికలపై కేంద్ర తాగునీరు, ప్రజారోగ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి వినీ మహాజన్‌ సమీక్షించనున్నారు. ఈ మేరకు ఆమె రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలైతే అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్‌ అందించి ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 15న జలజీవన్‌ మిషన్‌ను ప్రారంభించింది. కార్యక్రమం ప్రారంభించే నాటికి రాష్ట్రంలోని 95,54,759 ఇళ్లలో 30,74,310 కనెక్షన్లు ఉన్నాయి. మిగిలిన 64,80,449 ఇళ్లకు 2024 మార్చి నాటికి ఇవ్వాలన్నది లక్ష్యం.

ఇందుకోసం రూ.18,902 కోట్ల అంచనాలతో రూపొందించిన ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50% చొప్పున నిధులు సమకూర్చాలన్నది ఒప్పందం. కేంద్రప్రభుత్వ వాటా నిధులు ఏటా విడుదలవుతున్నా... రాష్ట్రప్రభుత్వం తన వాటా సరిగా విడుదల చేయట్లేదు. 2021-22లో కేంద్రం రూ.791 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ (బీఆర్వో) జారీచేసి, నిధులు విడుదల చేయలేదు. 2022-23లోనూ రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు కేటాయించలేదు. ఇదే ప్రాజెక్టు పనుల కోసం నాబార్డు నుంచి రాష్ట్రప్రభుత్వం తీసుకున్న రుణం రూ.839.20 కోట్లు వేరే అవసరాలకు వాడుకుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయినా ఏపీలో భారీగా కుళాయి కనెక్షన్లు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నివేదికలపై కేంద్రం ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటించనున్నాయని తెలుస్తోంది. జేజేఎం పనులు రాష్ట్రంలో అసంపూర్తిగా, అస్తవ్యస్తంగా తయారయ్యాయి. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో కొన్ని జిల్లాల్లో పనులు నిలిపివేశారు. ఇంకొన్ని జిల్లాల్లో టెండర్లు పిలుస్తున్నా గుత్తేదారులు ముందుకు రావట్లేదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు