ఆస్తుల కోసం అడ్డదారులు
మానవత్వం మంటగలుస్తోంది. బతికున్న వారిని వారసులే కాగితాలపై ఆస్తుల కోసం చంపేస్తున్నారు. మరణ ధ్రువీకరణ పత్రాలను సృష్టించి ఆస్తులను విక్రయిస్తున్నారు.
బతికున్నవారిని కాగితాలపై చంపేస్తున్నారు
విశాఖలో ఈ అక్రమాలు అధికం
ఇతర ప్రాంతాల్లోనూ అక్రమార్కుల దందా
* విశాఖ మిథిలాపురి కాలనీలో 355 గజాల స్థలాన్ని కాజేయడానికి కొందరు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించారు. బహిరంగ మార్కెట్‌లో ఈ స్థలం విలువ రూ.3 కోట్లు. దిల్లీలో ఉన్న స్థల యజమాని మరణించినట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. ఇద్దరు మహిళలను ఆయన కుమార్తెలుగా చూపి విభజన దస్తావేజులు తయారుచేయించి అమ్మే క్రమంలో దొరికిపోయారు.
* నంద్యాలలో తండ్రికి చెందిన ఐదు సెంట్ల భూమి విక్రయానికి ఆయన కుమార్తె పన్నాగం పన్నారు. రెవెన్యూ సిబ్బందితో కలిసి ఆయన చనిపోయినట్లు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొందారు. భూమికి వారసురాలినంటూ స్థలాన్ని విక్రయించారు. తాను బతికే ఉన్నానని, మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఎలా ఇస్తారని తహసీల్దార్ వద్దకెళ్లి తండ్రి కన్నీటిపర్యంతమయ్యారు.
* సౌదీ అరేబియాకు వెళ్లిన మహబూబ్‌సాబ్ 13 ఏళ్ల నుంచి ఇక్కడికి రాకపోవడంతో ఆయన సొంత అన్న కుమారులు సదరు వ్యక్తి 2006 ఆగస్టు 1న చనిపోయినట్లు శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల పంచాయతీ కార్యాలయం నుంచి మరణ ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు. చనిపోయిన వ్యక్తి అసలు పేరు మహబూబ్‌సాబ్. ఇక్కడ నమోదైన పేరు మాబూసాబ్. చనిపోయినట్టు చూపుతున్న వ్యక్తి ఆయనేనా? అన్న అనుమానాన్ని పక్కనపెట్టి.. సమర్పించిన మరణ ధ్రువీకరణ పత్రం ఆధారంగా ఏకంగా 16 ఎకరాల పొలాన్ని విక్రయించేశారు. ప్రస్తుత ధరల ప్రకారం ఈ భూమి విలువ రూ.3 కోట్ల నుంచి 4 కోట్ల వరకుంటుంది.
* నంద్యాలలో 50 సెంట్ల ఖాళీ స్థలం యజమాని మరణించగా.. వారసులు లేరని అక్రమార్కులు గుర్తించారు. దీనికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీని నంద్యాల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి పొందారు. మరణ ధ్రువీకరణ, వారసత్వ పత్రాలు నకిలీవి తయారు చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఓ డాక్యుమెంట్ రైటర్ ఇందులో సూత్రధారుడు. అక్రమంలో ఒక రౌడీషీటర్ ప్రమేయమూ ఉంది.
ఈనాడు, అమరావతి, విశాఖపట్నం: మానవత్వం మంటగలుస్తోంది. బతికున్న వారిని వారసులే కాగితాలపై ఆస్తుల కోసం చంపేస్తున్నారు. మరణ ధ్రువీకరణ పత్రాలను సృష్టించి ఆస్తులను విక్రయిస్తున్నారు. బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లినవారు చనిపోయినట్లు బోగస్ పత్రాలు సృష్టించి మరికొందరు ఆస్తులను కొల్లగొడుతున్నారు. ఇలాంటి రిజిస్ట్రేషన్ల కోసం చాలాచోట్ల ప్రత్యేక ముఠాలు పనిచేస్తున్నాయి. వీరితో సబ్‌రిజిస్ట్రార్లు, డాక్యుమెంట్ రైటర్లు చేతులు కలుపుతున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖలోని లొసుగులను అనుకూలంగా మలుచుకుంటున్నారు. కక్షిదారులు కచ్చితంగా వారేనా? అన్నది నిర్ధారించుకోవడంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. విదేశాల్లో స్థిరపడిన, స్థానికంగా లేనివారి ఖాళీ స్థలాలపై కన్నేసి అక్రమార్కులు అన్ని వివరాలను సేకరించి నకిలీ డాక్యుమెంట్లను తయారుచేస్తున్నారు.
విదేశాల నుంచి కొరియర్ వచ్చినట్లు చూపి..
భూయజమాని విదేశాల్లో ఉంటే తప్పుడు జనరల్ పవరాఫ్ అటార్నీ (జీపీఏ) సృష్టించి ఆస్తులను ఇతరులకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏడాది కిందట విశాఖ నగర పరిధి కొమ్మాదిలో రూ.కోట్ల విలువ స్థలానికి ఈ తరహాలో రిజిస్ట్రేషన్ చేసేందుకు మధురవాడ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి డాక్యుమెంటు వచ్చింది. విషయం బాధితులకు తెలియడంతో అక్రమ వ్యవహారం బయటపడి పోలీసుల వరకు వెళ్లింది. ఈ వ్యవహారంలో భూమి అమ్ముతున్నట్లు ప్రకటన సైతం ఇచ్చారు. తప్పుడు జీపీఏ చేయడమే కాకుండా స్థల యజమాని పేరిట దొరికిన ఆధారాలతో ఓ ప్రైవేటు బ్యాంకులో సంబంధిత వ్యక్తి లేకుండానే ఖాతా తెరిచారు. స్థల యజమాని సంతకాలు ఫోర్జరీ చేయడమే కాకుండా తప్పుడు నోటరీని, దానిపై సీల్‌ను వేశారు. భూయజమాని అనుమతితోనే విక్రయ ప్రక్రియ కొనసాగినట్లు పకడ్బందీ ప్రణాళిక రచించారు.
అక్రమార్కుల లీలలెన్నో..
స్థల యజమాని రక్తసంబంధీకుడని రిజిస్టర్ కాని వీలునామాను కొందరు సృష్టిస్తారు. ఈ డాక్యుమెంటు రిజిస్ట్రేషన్ కోసం స్థల యజమాని పేరుతో మరణ ధ్రువీకరణ పత్రం సంపాదిస్తారు. ఒరిజినల్ డాక్యుమెంట్లు పోయినట్లు పత్రికలో ప్రకటన ఇచ్చి కోర్టు నుంచి అఫిడవిట్ తీసుకుంటారు. అధికారులతో కుదిరిన ‘ఒప్పందం’ మేరకు పని కానిచ్చేస్తారు. పలు జిల్లాల్లో ఇలాంటి రిజిస్ట్రేషన్లపై ఫిర్యాదులున్నాయి.
* స్థలాలు కొని విదేశాల్లో స్థిరపడ్డవారి వివరాలను కొన్ని ముఠాలు ఆరా తీస్తున్నాయి. తదనుగుణంగా మోసాలకు ప్రణాళిక రూపొందిస్తున్నాయి. కొద్దికాలం కిందట విజయవాడ శివారు తాడేపల్లి పరిధిలో 2.73 ఎకరాలపై కన్నేసిన ఒకడు.. ఫోర్జరీ సంతకంతో విక్రయ ఒప్పందాన్ని రూపొందించుకుని రిజిస్ట్రేషన్‌కు రావాలంటూ ఏకంగా భూయజమానికి నోటీసు పంపాడు.
* అప్పు కోసం ఆస్తిపత్రాలను రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వడాన్నీ రుణదాతలు కొందరు అక్రమాలకు మార్గంగా మలుచుకుంటున్నారు. పత్రాలను కుదువ పెట్టుకున్న వ్యక్తి పేరుపైనే రెవెన్యూ ఎంకబరెన్స్ పత్రాలుంటాయి. వారు ఈసీలు పొంది భూయజమానికి తెలియకుండా విక్రయిస్తున్నారు.
* 1980 నుంచి 1988 మధ్యకాలంలో విజయవాడ గాంధీనగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు వంగవీటి రంగా హత్య సందర్భంగా జరిగిన అల్లర్లలో దగ్ధమయ్యాయి. వాటి ఆధారాలనుబట్టి కొందరు నకిలీ ఆస్తి పత్రాలు సృష్టించారు.
* విశాఖ సుజాతనగర్‌లో ఆక్రమణదారులు ఓ ప్లాట్‌ను ఇతరులకు విక్రయించేశారు. తన భార్య చికిత్స కోసం నిజమైన యజమాని ప్లాటును విక్రయించాలని ప్రయత్నించగా, ఈసీలో వేరే వ్యక్తి పేరు కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
* ఆనందపురం మండలం గొట్టిపల్లిలోని 4.68 ఎకరాల ఆక్రమణకు తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ అయినట్లు పత్రాలను సృష్టించారు. బయోమెట్రిక్ వేలిముద్రలు, అధికారుల డిజిటల్ సంతకాలతో నిజమైన డాక్యుమెంట్ల మాదిరి ముద్రించారు.
ఒకేరోజు క్రయవిక్రయాలు
నెల్లూరులోని స్టోన్‌హౌస్‌పేట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అడంగల్‌లో ఒకరి పేరుండగా.. మరొకరి పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. అదే రోజు ఈ భూమిలోని కొంత భాగాన్ని ఇద్దరు మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. దీని గురించి ఫిర్యాదు అందడంతో ఈ రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. తరువాత అదే భూమిని మరో నలుగురికి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ భూమి కొన్నట్లు చూపించిన వ్యక్తి నుంచి మరో నలుగురు కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నెల్లూరు జాతీయ రహదారి పక్కనున్న ఈ భూవిలువ రూ.30 కోట్ల వరకుంది. దీనిపై పోలీసు కేసు నమోదైంది.
ఏం చేయాలంటే..
తప్పుడు రిజిస్ట్రేషన్ల గుర్తింపునకు కొనుగోలుదారులు జాగ్రత్తలు తీసుకోవాలి. కొనుగోలు చేసే ఆస్తి వివరాలను పక్కాగా తెలుసుకోవాలి. ఈసీలూ తనిఖీ చేసుకోవాలి. మార్కెట్ ధరకన్నా తక్కువ ధరకు విక్రయిస్తామంటే మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి వివరాలు తెలుసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jagan-adani: సీఎం జగన్‌తో గౌతమ్ అదానీ భేటీ
-
రోజుకు నాలుగు గంటలు ఫోన్లోనే.. పిల్లల్లో పెరుగుతున్న మొబైల్ వాడకం
-
Hyderabad: వర్షంలోనూ కొనసాగుతోన్న గణేశ్ నిమజ్జనాలు
-
ISRO Chief: సోమనాథ్ ఆలయంలో ఇస్రో ఛైర్మన్ పూజలు
-
Chandramukhi 2 Review: రివ్యూ: చంద్రముఖి-2
-
Rahul Gandhi: రంపం పట్టిన రాహుల్.. వడ్రంగి పనివారితో చిట్‌చాట్