Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్‌లో కుంగిన గైడ్‌బండ్‌

పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌వే ఎగువన ఎడమ వైపున నిర్మిస్తున్న గైడ్‌బండ్‌ కుంగిపోయింది. దాదాపు 500 మీటర్ల పొడవున దిగువ నుంచి సుమారు 26 మీటర్ల ఎత్తున దీని నిర్మాణం చేపట్టారు.

Updated : 06 Jun 2023 09:31 IST

దాదాపు నిర్మాణం కొలిక్కి వచ్చిన వేళ  ఘటన
స్పిల్‌వే ఎడమ వైపు సుడిగుండాల నిరోధానికి ఏర్పాటు
సమీక్షించిన కేంద్ర జలసంఘం ఛైర్మన్‌
ఈనాడు - అమరావతి

పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌వే ఎగువన ఎడమ వైపున నిర్మిస్తున్న గైడ్‌బండ్‌ కుంగిపోయింది. దాదాపు 500 మీటర్ల పొడవున దిగువ నుంచి సుమారు 26 మీటర్ల ఎత్తున దీని నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్టు పనుల గుత్తేదారయిన మేఘా ఇంజినీరింగు కంపెనీయే ఈ పనులూ చేస్తోంది. ఏడాది కిందట చేపట్టిన నిర్మాణం దాదాపు కొలిక్కి వచ్చిన సమయంలో గైడ్‌బండ్‌ మధ్యలో పగులులా ఏర్పడి అప్రోచ్‌ ఛానల్‌ వైపునకు కుంగిపోయింది. గైడ్‌బండ్‌లో భాగంగా నిర్మించిన కట్ట, అందులోని రాళ్లు దిగువకు జారిపోయాయి. దీంతో ఇందులోని రిటైనింగ్‌ వాల్‌ కుంగింది. ఇందులో కటాఫ్‌ సరిగా లేకపోవడం వల్లే గైడ్‌బండ్‌ కుంగిపోయి ఉంటుందని కొందరు ఇంజినీర్లు అనుమానిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ఈ విషయం తెలియజేశారు. గైడ్‌బండ్‌ ఎందుకు కుంగింది, కారణాలేమిటి, ఎలా సరిదిద్దాలనే అంశాలపై పోలవరం అథారిటీ అధికారులు, డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ సభ్యులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. శుక్ర, శనివారాల్లో కొన్ని పగుళ్లు వచ్చాయని, ఆదివారం నాటికి పూర్తిగా కుంగిపోయిందని చెబుతున్నారు.

కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ సమీక్ష

గైడ్‌బండ్‌ కుంగినట్లు తెలియగానే సోమవారం కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ ఖుష్విందర్‌ వోహ్రా.. ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డి, చీఫ్‌ ఇంజినీరు సుధాకర్‌బాబు, ఎస్‌ఈ నరసింహమూర్తి, ఇతర నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఆకృతుల సంస్థ నిపుణులు పోలవరాన్ని సందర్శించి, గైడ్‌బండ్‌ కుంగడానికి కారణాలు గుర్తించి, విశ్లేషించాలని ఆయన సూచించారు. తక్షణ చర్యలు ఏం తీసుకోవాలో తేల్చాలన్నారు. ఇంజినీర్లు పరిశీలించి ఈ సమస్య పరిష్కారానికి మార్గం కనుగొని తక్షణమే కేంద్ర జలసంఘానికి నివేదించాలని ఆదేశించారు. ఈ అంశంపై చర్చించేందుకు పోలవరం ప్రాజెక్టు ఇంజినీరు కేంద్ర జలసంఘం పెద్దలను కలిసేందుకు మంగళవారం వెళుతున్నారు.  


ఏమిటీ గైడ్‌బండ్‌?

పోలవరం ప్రాజెక్టులో తొలుత ఈ గైడ్‌బండ్‌ నిర్మాణ ప్రతిపాదన లేదు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గోదావరి సహజ ప్రవాహాన్ని మార్చారు. అప్రోచ్‌ ఛానల్‌ తవ్వి, ఆ మార్గంలో స్పిల్‌వే మీదుగా నదిని మళ్లించారు. ఆ గణాంకాల ఆధారంగా పుణెలోని కేంద్ర జల విద్యుత్తు పరిశోధన కేంద్రంలో పోలవరం ప్రాజెక్టు నమూనా రూపొందించి అక్కడి ప్రవాహం, తదితర అంశాలపై నమూనా అధ్యయనం నిర్వహించారు. ఈ క్రమంలో పోలవరం స్పిల్‌వే ఎడమ వైపున గోదావరి ప్రవాహ వేగం వడి ఎక్కువగా ఉంటోందని తేలింది. దీనివల్ల పోలవరం ఎడమ వైపున స్పిల్‌వే సమీపంలో పెద్ద పెద్ద సుడిగుండాలు ఏర్పడతాయని గుర్తించారు. ఇది స్పిల్‌వేకు కొంత ఇబ్బంది కలిగిస్తుందని భావించారు. ఈ 3డీ నమూనా అధ్యయనాల ఆధారంగా పోలవరం ప్రాజెక్టు డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌, కేంద్ర జలసంఘం నిపుణులు చర్చించారు. సమస్యను పరిష్కరించేందుకు స్పిల్‌వేకు ఎగువన గైడ్‌బండ్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. స్పిల్‌వే వద్ద ఈ గైడ్‌బండ్‌ నిర్మాణం లేకపోవడం, అప్రోచ్‌ ఛానల్‌ ముఖద్వారం వద్ద వెడల్పు పెంచకపోతే గోదావరి ప్రవాహం ఎడమ వైపున సెకనుకు 13.6 మీటర్ల వేగంతో, స్పిల్‌వే మధ్యలో సెకనుకు 9.2 మీటర్ల వేగంతో, కుడి వైపు 2.5 మీటర్ల వేగంతో ఉంటుందని లెక్కించారు. గైడ్‌బండ్‌ నిర్మాణంతో పాటు అప్రోచ్‌ ఛానల్‌ ముఖద్వారం వెడల్పు చేయడం, ఇతరత్రా కొన్ని చర్యలు తీసుకుంటే నదీ ప్రవాహ వేగం ఎడమ వైపున సెకనుకు 4 మీటర్లకు, మధ్యలో 5.5 మీటర్లకు తగ్గుతుందని, కుడి వైపున సెకనుకు 4 మీటర్లకు పెరుగుతుందని లెక్కించారు. అంటే గోదావరి ప్రవాహ వేగం స్పిల్‌వే పొడవునా దాదాపు ఒకేలా ఉండేలా ఈ గైడ్‌బండ్‌ నిర్మాణంతో సరిదిద్దవచ్చని తేల్చి, దీని నిర్మాణం చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని