ఒప్పంద ఉద్యోగులకూ మోసం
రాష్ట్రంలో క్రమబద్ధీకరించాల్సిన ఒప్పంద ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకే ప్రభుత్వం మెలిక పెడుతోంది. ఎన్నికలకు ముందు ఎక్కువ మందిని క్రమబద్ధీకరిస్తామని జగన్ హామీలు గుప్పించారు.
2014 జూన్ 2నాటికి ఐదేళ్ల సర్వీసు ఉండాలనే నిబంధన
క్రమబద్ధీకరణ సంఖ్యను తగ్గించేందుకు వింత ఆంక్షలు
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో క్రమబద్ధీకరించాల్సిన ఒప్పంద ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకే ప్రభుత్వం మెలిక పెడుతోంది. ఎన్నికలకు ముందు ఎక్కువ మందిని క్రమబద్ధీకరిస్తామని జగన్ హామీలు గుప్పించారు. ఇప్పుడు ఈ సంఖ్యను వడపోసేందుకు కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చారు. ఉద్యోగ సంఘాల నాయకులతో సోమవారం సచివాలయంలో జరిగిన చర్చల్లో 2014 జూన్ 2నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారిని మాత్రమే క్రమబద్ధీకరిస్తామని మంత్రుల కమిటీ ప్రకటించింది. తెలంగాణలో 2014 జూన్ 2నాటికి పనిచేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్ చేయగా, ఇక్కడ మాత్రం ఉమ్మడి ప్రభుత్వంలో నియామకాలు పొందినవారినే రెగ్యులరైజ్ చేస్తామనే నిబంధన పెట్టింది. తెలంగాణలో అమలుచేసిన విధానాన్నే అమలుచేయాలని ఒప్పంద ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర విభజన సమయానికి ఎంతమంది పని చేస్తున్నారో అందరినీ క్రమబద్ధీకరించాలని విన్నవిస్తున్నారు. ఒక పక్క నిబంధనలతో సంఖ్య తగ్గిస్తుండగా, మరోవైపు ఒప్పంద ఉద్యోగులు పని చేస్తున్న స్థానాలను ఖాళీగా చూపి కొత్త నియామకాలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అన్ని విభాగాల్లో కలిపి ఒప్పంద ఉద్యోగులు సుమారు 60వేల మంది వరకు పని చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లోని వారినే పరిగణనలోకి తీసుకుంటున్న నేపథ్యంలో 20,079 మంది ఒప్పంద ఉద్యోగులే ప్రభుత్వ లెక్కల్లోకి వస్తున్నారు. కొత్త నిబంధన ప్రకారం వీరిలో ఏడు వేలలోపు ఉద్యోగులే రెగ్యులరైజ్ అయ్యే పరిస్థితి ఉంది. ప్రాజెక్టులు, కార్పొరేషన్లు, సొసైటీల్లోని వారి జాబితాను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదు. అత్యధికంగా వైద్య, ఆరోగ్యశాఖ, జాతీయ ఆరోగ్య మిషన్‌లో కలిపి 19వేల మంది వరకు ఒప్పంద ఉద్యోగులున్నారు. ఆ తర్వాత విద్యాశాఖలో ఎక్కువగా ఉన్నారు.
వీరి పరిస్థితేంటి?
* జూనియర్ కళాశాలల్లో ఒప్పంద అధ్యాపకుల నియామకాలు ఎక్కువగా 2000 నుంచి 2013 వరకు జరిగాయి. ఇంటర్మీడియట్‌లో 3,618 మంది ఒప్పంద లెక్చరర్లు ఉంటే వీరిలో 2014కు ముందు ఐదేళ్లు పూర్తి చేసుకున్నవారు సుమారు 1700 వరకు ఉంటారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్, మెరిట్‌ను అమలుచేస్తే ఈ సంఖ్య ఇంకా తగ్గింది.
* పాలిటెక్నిక్ కళాశాలల్లో ఒప్పంద లెక్చరర్ల నియామకం 2005నుంచి కొనసాగింది. ఇక్కడ 316 మంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారమైతే వంద మందికి మాత్రమే అర్హత లభిస్తుంది.
* డిగ్రీ కళాశాలల్లో ఒప్పంద అధ్యాపకుల నియామకాలు 2000 నవంబరు నుంచి జరిగాయి. ప్రస్తుతం 720 మంది వరకు పని చేస్తుంటే ప్రభుత్వం నిబంధనల ప్రకారం 500 మందిని క్రమబద్ధీకరించే అవకాశముంది.
* సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న వారు 1,964మంది ఉన్నారు. ఏపీ గురుకులాల్లో 166 మంది సేవలందిస్తున్నారు.
* జాతీయ ఆరోగ్య మిషన్‌లో 15వేలు, సమగ్ర శిక్ష అభియాన్‌లో 10,500 మంది ఉన్నారు. వీరు కాకుండా నైపుణ్యాభివృద్ధి సంస్థలాంటి కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాల్లో 18వేల మంది వరకు ఒప్పంద ఉద్యోగులున్నారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇలా..
* 2014 జూన్ 2నాటికి 15ఏళ్లు సర్వీసు పూర్తి చేసిన వారు: 36
* 10-15 ఏళ్ల మధ్యలోనివారు: 3,018
* ఐదేళ్లపైన పదేళ్ల లోపువారు: 3,847
మేం అధికారంలోకి రాగానే అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు, విద్యార్హతలను పరిగణనలోకి తీసుకుంటాం. కాంట్రాక్టు ఉద్యోగులను వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తామని హామీనిస్తున్నాం.
సాధారణ ఎన్నికల ముందు పలు సభల్లో ప్రతిపక్ష నేతగా జగన్ హామీ
అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగులను వారి అర్హత, సర్వీసు ఆధారంగా వీలైనంత మందిని రెగ్యులరైజ్ చేస్తాం.
వైకాపా మేనిఫెస్టోలో హామీ
ఎన్నికలకు వెళ్లేటప్పుడు ప్రతి రాజకీయ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తుంది. అందులోని ప్రతి మాటను నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోలేకపోతే ఆ నాయకుడు పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి తీసుకురావాలి.
ప్రతిపక్ష నేతగా జగన్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vijay Antony: కుమార్తె లేదన్న దుఃఖాన్ని దిగమింగుకుని.. సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొని!
-
MS Swaminathan: అధికార లాంఛనాలతో ఎంఎస్ స్వామినాథన్ అంత్యక్రియలు: స్టాలిన్
-
Team India: వన్డే వరల్డ్ కప్.. అక్షర్ పటేల్ ఔట్.. అశ్విన్‌కు చోటు
-
Congress: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి, వేముల వీరేశం
-
Siddharth: సిద్ధార్థ్‌కు చేదు అనుభవం.. ప్రెస్‌మీట్ నుంచి వెళ్లిపోయిన హీరో
-
Nitin Gadkari: ఏడాది చివరికల్లా గుంతలు లేని జాతీయ రహదారులు: నితిన్ గడ్కరీ