నిధుల సమస్య లేదు
‘పోలవరం ప్రాజెక్టు తొలిదశకు అవసరమైన నిధులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించడం శుభపరిణామం. తాజాగా రూ. 12,911.15 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
పోలవరం పనులు వేగవంతం చేయండి
అధికారులకు సీఎం జగన్ ఆదేశం
ప్రాజెక్టు పనుల పురోగతిపై పరిశీలన, సమీక్ష
ఈనాడు, ఏలూరు: ‘పోలవరం ప్రాజెక్టు తొలిదశకు అవసరమైన నిధులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించడం శుభపరిణామం. తాజాగా రూ. 12,911.15 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. నిధుల సమస్య ఉండదు కాబట్టి వేగంగా పనులు పూర్తి చేయాలి’ అని సీఎం జగన్ అన్నారు. ముందుగా డయాఫ్రం వాల్ నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేస్తే మెయిన్ డ్యాం పనులు చురుగ్గా సాగడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. త్వరలో పోలవరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. ముందుగా విహంగ వీక్షణం చేశారు. అనంతరం స్పిల్‌వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పరిశీలించారు. ఈ మూడు ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిని ఛాయాచిత్ర ప్రదర్శన ద్వారా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
డయాఫ్రంవాల్‌ను పరిశీలించిన అనంతరం దాని నిర్మాణం గురించి సీఎం తెలుసుకున్నారు. పునరావాస కాలనీలను త్వరితగతిన పూర్తి చేయాలని, వాటితో ఆయా కాలనీల్లో సమాంతరంగా మౌలిక సదుపాయాలు కల్పించడంపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. ఇప్పటికే తరలించిన 12,658 కుటుంబాలతో పాటు షెడ్యూల్ ప్రకారం నిర్వాసిత కుటుంబాలను వేగంగా తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. ‘ప్రాజెక్టు నిర్మాణాల్లో సహజంగా చిన్న చిన్న సమస్యలు వస్తాయి. వాటిని గమనించుకుంటూ ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుని ముందుకు సాగుతాం. పోలవరం ప్రాజెక్టు ఆకృతితో ఎలాంటి సంబంధం లేని గైడ్‌వాల్ వంటి చిన్న సమస్యను పెద్ద విపత్తులా చూపిస్తున్నారు. అయినా దీన్ని సానుకూల దృక్పథంతో ఆలోచించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి’ అని సీఎం అన్నారు.
ప్రాజెక్టు ప్రగతిని వివరించిన అధికారులు
అనంతరం ప్రాజెక్టు హిల్ వ్యూ దగ్గర సంబంధిత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. గైడ్‌వాల్ సమస్య పరిష్కారం, పునరావాస కాలనీల నిర్మాణం, నిర్వాసితుల తరలింపు, కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన, డయాఫ్రం వాల్ నిర్మాణంపై సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు 2025 జూన్‌కు పూర్తి చేయనున్నట్లు ఈ సందర్భంగా అధికారులు పేర్కొనగా, ఇంకాముందు పూర్తి చేయలేమా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. డయాఫ్రం వాల్ నిర్మాణానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? ఇతర నిర్మాణాలకు ఎన్ని రోజుల సమయం పడుతుంది.. తదితర వివరాలను ఆయన అడిగారు. అధికారులు ప్రాజెక్టు నిర్మాణంలో ప్రగతిని వివరించారు.
‘స్పిల్‌వే కాంక్రీట్ పూర్తి చేసి, 48 రేడియల్, రివర్ స్లూయిజ్ గేట్లు పూర్తిస్థాయిలో పెట్టామని తెలిపారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు, పవర్ హౌస్‌లో సొరంగాల తవ్వకాలు పూర్తి చేశాం.. అప్రోచ్ ఛానల్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి’ అని వివరించారు. విడతలవారీగా బిల్లుల చెల్లింపులతో ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతున్న విషయం కేంద్రం పరిగణనలోకి తీసుకుని మినహాయింపు ఇచ్చిందని తెలిపారు. గైడ్‌వాల్ సమస్యను సరిదిద్దడం పెద్ద సమస్య కాదని, సీడబ్ల్యూసీ పరిశీలన కాగానే వారి సూచన మేరకు వెంటనే మరమ్మతులు చేస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 12,658 కుటుంబాలను తరలించామన్నారు.
జాప్యానికి తెదేపా కారణం: సీఎం
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వ హయాంలో ఎగువ కాఫర్‌డ్యాంలో ఖాళీలను వదిలేశారు. వాటి గుండా వరద నీరు ప్రవహించడంతో డయాఫ్రం వాల్ తీవ్రంగా దెబ్బతింది. దీనివల్ల ప్రాజెక్టు ఆలస్యం కావడమే కాకుండా రూ.2 వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ విషయం ఎవరికీ కనిపించదు కానీ.. ప్రాజెక్టు ఆకృతితో సంబంధం లేని గైడ్‌వాల్ గురించి మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. సీఎం వెంట మంత్రులు అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్, కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు.
మీడియాకు పోలీసు కాపలా
సీఎం పర్యటన నేపథ్యంలో మీడియాపై పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించారు. కార్యక్రమం కవర్ చేసేందుకు అవకాశం లేకుండా నియంత్రించారు. ఫొటోగ్రాఫర్లకు పాసులు కూడా జారీ చేయలేదు. కవరేజ్ కోసం వెళ్లిన వారందరికీ ఒక ప్రాంతంలో గుడారాలు వేసి సీఎం సమీక్ష సమావేశానికి వెళ్లే వరకూ అక్కడే నిర్బంధించారు. ఎవరూ బయటకు వెళ్లకుండా భారీగా పోలీసులను కాపలా పెట్టారు. సీఎం సమీక్షకు కూడా అనుమతించకుండా బలవంతంగా ప్రాజెక్టు దగ్గర నుంచి పోలవరం చెక్‌పోస్ట్ దగ్గరకు తీసుకు వచ్చారు. మీడియాను తీసుకొచ్చిన బస్సు వచ్చినప్పటి నుంచి ఓ సీఐ, నలుగురు కానిస్టేబుళ్లు వారు ఎక్కడికి వెళ్లకుండా నియంత్రించారు. సీఎం వెళ్లకుండానే ఏలూరు వెళ్లిపోవాలని ఒత్తిడి చేశారు. కార్యక్రమం కవర్ చేసే అవకాశం లేనప్పుడు పాసులు ఇచ్చి తీసుకురావడం ఎందుకని మీడియా ప్రతినిధులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మంగళవారం ఉదయం నుంచి సాధారణ ప్రజలను సైతం ప్రాజెక్టు పరిసరాల్లోకి కూడా రాకుండా నియంత్రించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
iPhone: ఐఫోన్ డెలివరీ ఆలస్యం.. కోపంతో షాపు ఉద్యోగులనే చితకబాదారు
-
Defamation: కాంగ్రెస్ ఎంపీపై.. అస్సాం సీఎం సతీమణి రూ.10 కోట్లకు దావా!
-
Revanth Reddy: కాంగ్రెస్‌లోకి మరిన్ని చేరికలు ఉంటాయి: రేవంత్‌రెడ్డి
-
Suryakumar Yadav: ఇన్నాళ్లూ తికమక పడ్డా.. నా కొత్త పాత్రను ఇష్టపడుతున్నా: సూర్యకుమార్