విశ్వ విద్యకు చెద

వైకాపా పాలనలో రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల పరిస్థితి తీసికట్టుగా తయారైంది. జాతీయ, అంతర్జాతీయ ర్యాంకుల్లో రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉండాలంటూ పదేపదే వల్లించే సీఎం జగన్‌ హయాంలో ప్రతిష్ఠాత్మక వర్సిటీలు ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. 

Updated : 07 Jun 2023 09:37 IST

జాతీయ స్థాయిలో దిగజారుతున్న రాష్ట్ర యూనివర్సిటీల ర్యాంకులు
పోస్టుల భర్తీ ఊసే లేదు
వైకాపా భజనలో వీసీలు
వర్సిటీల నిధులు సర్కారుకు రివర్స్‌
నాలుగేళ్లలో అధ్వానంగా ఉన్నత విద్య
ఈనాడు - అమరావతి


ఏపీకి ఆంధ్ర విశ్వవిద్యాలయం గర్వకారణం. విశిష్ట మేధావుల్ని అందించిన ఈ మహోన్నత వర్సిటీ దేశంలో 14వ స్థానంలో ఉండడం కాస్త అసంతృప్తి కలిగిస్తోంది. వర్సిటీకి కొన్నేళ్లుగా ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం కరవైందన్న విషయం గుర్తించాం. బోధనా సిబ్బంది ఖాళీలు 459 వరకు ఉన్నాయని ఉపకులపతి చెబుతున్నారంటే ప్రభుత్వం తలదించుకునే దుస్థితి.

2019 డిసెంబరు 13న పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో సీఎం జగన్‌


వైకాపా అధికారంలోకి వచ్చాక ఏపీకి గర్వకారణమైన ఆంధ్ర యూనివర్సిటీ జాతీయ స్థాయిలో 14వ స్థానం నుంచి 43కు దిగజారిపోయింది. 14వ స్థానంలో ఉంటేనే అసంతృప్తికి గురైన సీఎం జగన్‌ నేడు 43 ర్యాంకుకు పడిపోతే సంతృప్తిగా ఉన్నారా? 936 పోస్టులకు 216మందే రెగ్యులర్‌ ఆచార్యులున్నారు. ఇన్ని ఖాళీలుంటే ప్రభుత్వం తలదించుకున్నట్లు కాదా? ఏయూను రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చేసి, వర్సిటీ ప్రాభవాన్ని సముద్రంలో కలిపిందెవరు?


వైకాపా పాలనలో రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల పరిస్థితి తీసికట్టుగా తయారైంది. జాతీయ, అంతర్జాతీయ ర్యాంకుల్లో రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉండాలంటూ పదేపదే వల్లించే సీఎం జగన్‌ హయాంలో ప్రతిష్ఠాత్మక వర్సిటీలు ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. విద్యా ప్రమాణాలు, నాణ్యత కొరవడి ర్యాంకుల్లో దిగజారుతున్నాయి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) ర్యాంకుల్లో మొదటి 10స్థానాల్లో రాష్ట్రం నుంచి ఒక్క విద్యా సంస్థ, వర్సిటీ కూడా లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఓవరాల్‌ ర్యాంకుల్లో 29వ స్థానంలో ఉన్న విశాఖ ఏయూ నేడు 76వ స్థానానికి పడిపోయింది. మరో గొప్ప వర్సిటీ శ్రీవేంకటేశ్వరకు మొదటి 100 ర్యాంకుల్లో చోటు దక్కలేదు. 101-150 స్థానాల కేటగిరీలో నిలిచింది. విశ్వవిద్యాలయాల విభాగంలోనూ ఏయూ ర్యాంకు 36నుంచి 43కు దిగజారింది. ఇంజినీరింగ్‌ కోసం ప్రత్యేకంగా నెలకొల్పిన జేఎన్‌టీయూలకు మొదటి వందలో స్థానమే దక్కలేదు. విశ్వవిద్యాలయాల దశ, దిశ మారుస్తామని, ఖాళీలు భర్తీ చేస్తామని నాలుగేళ్లుగా సీఎం జగన్‌ ప్రకటనలు చేయడమే తప్ప అమలవుతున్న దాఖలాలు లేవు.

అన్నింటిలోనూ దిగదుడుపే..

కేంద్ర ప్రభుత్వం ఐదు అంశాల్లో మదింపు చేసి, ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకులను కేటాయించింది. బోధన, అభ్యసన, వనరులు విభాగంలో విద్యార్థుల సంఖ్య, అధ్యాపకులు-విద్యార్థుల నిష్పత్తి, పీహెచ్‌డీ ఉన్న అధ్యాపకులు, ఆర్థిక వనరులు, వినియోగం, ఆన్‌లైన్‌ విద్యను పరిశీలించింది. అన్నింటా రాష్ట్ర వర్సిటీలు వెనుకబడ్డాయి. కొన్ని పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పడిపోతుంటే.. మరికొన్ని కోర్సుల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకుల్లేరు. కొత్త కోర్సులు, మౌలిక సదుపాయాలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు వంటి కార్యకలాపాలు మృగ్యమైపోతున్నాయి.

* వర్సిటీల నుంచి పరిశోధనల ప్రచురణ ఆశించిన మేర లేదు. పేటెంట్లు, పరిశోధన ప్రాజెక్టులు లభిస్తున్న దాఖలాల్లేవు. ఉన్నత విద్య పూర్తిచేస్తున్న వారికి ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగ అవకాశాలు మితంగా లభిస్తున్నాయి. పీజీ తర్వాత ఉన్నత విద్యకు వెళ్తున్న వారి సంఖ్య పడిపోతోంది.

*పరీక్షల విధానంలోనూ లోపాలున్నాయి. ఫెయిల్‌ అయిన విద్యార్థుల్లో 30-40 శాతం మంది పునర్‌ మూల్యాంకనంలో ఉత్తీర్ణులవుతున్నారు. ఇటీవల అంబేడ్కర్‌ వర్సిటీలో బీఈడీలో 52మంది పునర్‌మూల్యాంకనానికి దరఖాస్తు చేస్తే 30మందికి మార్కులు మారిపోవడం గమనార్హం. చాలా వర్సిటీల్లో పరీక్షల విభాగంలో ఆన్‌లైన్‌ విధానమే లేదు.

రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో కలిపి మంజూరైన పోస్టులు 3,864 కాగా, ఇప్పుడున్న రెగ్యులర్‌ ఆచార్యులు 1,123 మంది మాత్రమే. నాలుగేళ్లుగా పోస్టుల భర్తీపై ప్రకటనలే తప్ప ఒక్క అడుగూ ముందుకు పడలేదు. కాంట్రాక్టు సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. 2వేల సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి 2022 ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ ఇస్తామని చెప్పి, ఇప్పటికీ ఇవ్వలేదు. ఒకట్రెండు ఏళ్లలో రిటైర్‌ అయ్యేవారు భారీగా ఉన్నారు.

నిధులు లాగేసుకోవడమా?

విశ్వవిద్యాలయాలకు నిధులు ఇవ్వకపోగా, వాటి నిధులనే ప్రభుత్వం లాగేసుకుంటోంది. రాష్ట్ర వర్సిటీలకు చెందిన రూ.150 కోట్లను రాష్ట్ర పైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌లో డిపాజిట్‌ చేయించుకుంది. ఇవి వెనక్కి వచ్చే పరిస్థితి లేదని విద్యావర్గాలు గగ్గోలు పెడుతున్నాయి.

ఏయూలో సుమారు 4వేల మంది పింఛనర్లకు చెల్లించేందుకు ఏటా రూ.210కోట్లు కావాలి. ప్రభుత్వం అన్నింటికీ కలిపి రూ.200 కోట్లు ఇస్తోంది. ఫీజులు, ఇతర రూపాల్లో వస్తున్న ఆదాయం నుంచే ఏటా రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఏఎన్‌యూలో బోధనేతర సిబ్బంది పదవీ విరమణ చేస్తే వర్సిటీ నిధుల్లోంచే చెల్లిస్తున్నారు.

అనంతపురం జేఎన్‌టీయూ ఇప్పటికే కార్పొరేషన్‌లో రూ.50 కోట్లు,  కాకినాడ జేఎన్‌టీయూరూ.70కోట్లు డిపాజిట్‌ చేసింది. ఇలా వర్సిటీ నిధులు ప్రభుత్వం లాగేసుకుంటే.. ఇక వాటి ఆర్థిక పరిపుష్టి ఎలా సాధ్యమన్నది ప్రశ్న.

వైకాపా కార్యకలాపాల్లో వీసీలు

ఈ ప్రభుత్వం వచ్చాక నియమించిన వీసీల పనితీరు, ప్రవర్తన వివాదాస్పదమవుతోంది. వీసీ ప్రసాదరెడ్డి ఏయూను రాజకీయాలకు కేంద్రంగా మార్చేశారనే విమర్శలున్నాయి. ప్రసాదరెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి ఓ సందర్భంగా భేటీ కాగా, ‘పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిశారు’ అని ఎంపీ ట్వీట్‌ చేశారు. వీసీని ఎలా గుర్తిస్తున్నారనడానికి ఇదే ఉదాహరణ. ఎన్నికల కోడ్‌ అమలు ఉన్నప్పుడు తన ఛాంబర్‌లో సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఓ హోటల్‌లో వైకాపా నిర్వహించిన సమావేశానికి ప్రసాదరెడ్డి హాజరయ్యారు. ఏఎన్‌యూ వీసీగా బాధ్యతలు చేపట్టిన సమయంలో సీఎం జగన్‌ ఫొటోకు క్షీరాభిషేకం చేసిన రాజశేఖర్‌.. మాజీ సీఎం వైఎస్సార్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. కుప్పం మున్సిపల్‌ ఎన్నికల సమయంలో ద్రవిడ వర్సిటీ రిజిస్ట్రార్‌పై ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి. ఎస్కేయూలో మృత్యుంజయ హోమం నిర్వహణకు సిబ్బంది నుంచి చందాలు వసూలు చేసి, విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు.

మాకొద్దీ వీసీ పోస్టు

వీసీల పోస్టుకు జాతీయ స్థాయిలో నోటిఫికేషన్‌ ఇచ్చినా.. దరఖాస్తు చేసేందుకు విద్యావంతులు ముందుకు రాకపోవడం రాష్ట్రంలో వర్సిటీల పరిస్థితి అద్దం పడుతుంది. రాజకీయ అండదండలు లేని వారికి వీసీ పదవి దక్కదనే ఉద్దేశంతో కొందరు మెరిట్‌ ఉన్నా దరఖాస్తు చేయడం లేదు. గతంలో జేఎన్‌టీయూ వీసీ పోస్టుకు ప్రకటన ఇస్తే 30, వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌, ఫైన్‌ఆర్ట్స్‌కు 15, ఆంధ్ర కేసరికి 20 దరఖాస్తులు వచ్చాయి. వీసీ పోస్టు ఖాళీ కాకుండానే వేరేవారికి రిజర్వ్‌ అయిపోయిందని, ఫలానా ప్రజాప్రతినిధి హామీ ఇచ్చారని జరుగుతున్న ప్రచారంతోనూ అభ్యర్థులు రావడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని