Viveka Murder Case: ‘భాస్కరరెడ్డి బయట ఉంటే సాక్షులెవరూ ముందుకు రారు’

వై.ఎస్‌.వివేకా హత్య కేసులో నిందితుడైన వై.ఎస్‌.భాస్కరరెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ కోర్టు నిర్ణయాన్ని ఈనెల 9కి వాయిదా వేసింది.

Updated : 07 Jun 2023 07:35 IST

కోర్టులో సీబీఐ వాదనలు..
నిర్ణయం 9కి వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: వై.ఎస్‌.వివేకా హత్య కేసులో నిందితుడైన వై.ఎస్‌.భాస్కరరెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ కోర్టు నిర్ణయాన్ని ఈనెల 9కి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రధాన న్యాయమూర్తి సీహెచ్‌.రమేశ్‌బాబు విచారణ జరిపారు. భాస్కరరెడ్డి తరఫు న్యాయవాది ఇ.ఉమామహేశ్వరరావు వాదనలు వినిపిస్తూ వివేకా హత్య విషయం తెలుసుకుని జనం లోపలికి వెళుతుండగా భాస్కరరెడ్డి వారిని నియంత్రిస్తూ వచ్చారన్నారు. అంతేగానీ రక్తపు మరకలను తుడిచివేయాలని చెప్పలేదన్నారు. ఇనయ్‌తుల్లా ఫొటోలు, వీడియోలు తీసి సునీతారెడ్డికి పంపారన్నారు. అందువల్ల సంఘటనా స్థలంలో ఆధారాలు చెరిపివేశారన్న ప్రశ్నే తలెత్తదని వివరించారు. సాక్ష్యాలను చెరిపివేయించారనడానికి ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరని తెలిపారు. ఆయనను నిరాధారంగా అరెస్ట్‌ చేశారన్నారు.

ఈ సందర్భంగా అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు లేవనెత్తిన పలు అభ్యంతరాలను సీబీఐ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ వివేకా హత్య కుట్రలో భాస్కరరెడ్డి పాత్ర కీలకంగా ఉందని తెలిపారు. ఆయన సూచనల మేరకే రక్తపు మరకలను తుడిచివేశానని పనిమనిషి వెల్లడించినట్లు తెలిపారు. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మేరకు భాస్కరరెడ్డి కుట్రలో భాగస్వామిగా ఉన్నారన్నారు. ఈనెల 30లోగా దర్యాప్తును పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గడువు విధించిందని, ఈ సమయంలో బెయిల్‌ ఇస్తే దర్యాప్తునకు ఆటంకాలు సృష్టిస్తారన్నారు. భాస్కరరెడ్డి బయట ఉంటే సాక్ష్యమివ్వడానికి ఎవరూ ముందుకు రారని తెలిపారు. బెయిల్‌ పిటిషన్‌లో తమ వాదన కూడా వినాలన్న సునీతారెడ్డి తరఫు న్యాయవాది అభ్యర్థనను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకుంటూ వాదనలు రాతపూర్వకంగా సమర్పించాలని సూచించారు. ఇరుపక్షాల వాదనలను విన్న ఆయన నిర్ణయాన్ని ఈనెల 9కి వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని