ACB Court: లింగమనేని రమేష్ ఇల్లు జప్తుపై నిర్ణయానికి అనిశా కోర్టు నిరాకరణ
వ్యాపారవేత్త లింగమనేని రమేష్ ఇంటి జప్తునకు అనుమతిచ్చే.. లేదా తిరస్కరించే విషయంలో ప్రస్తుతం నిర్ణయం తీసుకోవడానికి విజయవాడ అనిశా కోర్టు నిరాకరించింది.
ప్రాథమిక ఆధారాలను పరిశీలించాలని వెల్లడి
సీఐడీ అదనపు ఎస్పీని విచారించేందుకు నిర్ణయం
16న రికార్డులతో హాజరుకావాలని స్పష్టీకరణ

ఈనాడు, అమరావతి: వ్యాపారవేత్త లింగమనేని రమేష్ ఇంటి జప్తునకు అనుమతిచ్చే.. లేదా తిరస్కరించే విషయంలో ప్రస్తుతం నిర్ణయం తీసుకోవడానికి విజయవాడ అనిశా కోర్టు నిరాకరించింది. నిర్ణయం తీసుకునేందుకు ప్రాథమిక ఆధారాలను పరిశీలించాలని అభిప్రాయపడింది. జప్తునకు విజ్ఞప్తి చేస్తూ అఫిడవిట్ దాఖలుచేసిన తాడేపల్లి సీఐడీ అదనపు ఎస్పీని విచారించాలని పేర్కొంది. అఫిడవిట్‌తో పొందుపరిచిన వివరాలతో పాటు కేసు రికార్డులతో ఈ నెల 16న తమ ముందు హాజరుకావాలని అదనపు ఎస్పీని ఆదేశించింది. మరోవైపు జప్తు అనుమతి కోసం సీఐడీ వేసిన పిటిషన్లో తమకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని లింగమనేని రమేష్ తరఫు న్యాయవాది దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ప్రాథమిక ఆధారాలపై తేల్చే విషయంలో కోర్టు ఇంకా ఓ నిర్ణయానికి రానందున వాదనలు వినిపించే వెసులుబాటు లింగమనేనికి ఇవ్వలేమని పేర్కొంది. మే 18న ఇన్‌ఛార్జి కోర్టు.. ప్రతివాదులకు ఇచ్చిన నోటీసు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని సీఐడీ తరఫున ప్రత్యేక పీపీ చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు దస్త్రాలను వెంటనే వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌కు అందజేయాలని సీఐడీని ఆదేశించింది. మే 18న ఇన్‌ఛార్జి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ‘ఫార్మల్ ఉత్తర్వులు’గా భావించాలని, అవి జప్తు విషయంలో జారీచేసిన ఉత్తర్వులు కావని తెలిపింది. విజయవాడ అనిశా కోర్టు న్యాయాధికారి హిమబిందు మంగళవారం ఈమేరకు ఉత్తర్వులు జారీచేశారు.
* గుంటూరు జిల్లా ఉండవల్లిలో తెదేపా అధినేత చంద్రబాబు నివసిస్తున్న వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌కు చెందిన ఇంటి జప్తునకు అనుమతి ఇవ్వాలంటూ విజయవాడ అనిశా కోర్టులో ఏపీ సీఐడీ దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 2న జరిగిన విచారణలో.. సీఐడీ తరఫున ప్రత్యేక పీపీ వైఎన్ వివేకానంద వాదనలు వినిపిస్తూ.. క్రిమినల్ లా సవరణ ఆర్డినెన్స్-1944 నిబంధన ప్రకారం ఎటాచ్‌మెంట్‌కు మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడానికి ముందే ప్రతివాదులకు నోటీసు ఇచ్చి వాదనలు వినాల్సిన అవసరం లేదన్నారు. లింగమనేని తరఫున ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. ఇన్‌ఛార్జి కోర్టు మే 18న తమకు నోటీసులు జారీచేసిందని, జప్తు పిటిషన్‌పై వాదనలు చెప్పుకొనే అవకాశం కల్పించాలని కోరారు.
* రాజధాని నగర బృహత్ ప్రణాళిక, ఇన్నర్ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్ మార్పులో అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణతో గతేడాది మే నెలలో సీఐడీ పలువురిపై కేసు నమోదుచేసింది. తెదేపా అధినేత చంద్రబాబు నివసిస్తున్న లింగమనేని రమేష్ ఇంటిని, మాజీమంత్రి నారాయణ సంబంధీకులకు చెందిన ఆస్తులను ఎటాచ్ చేసేందుకు సీఐడీకి అనుమతిస్తూ హోంశాఖ ఈ ఏడాది మే 12న ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో కోర్టు నుంచి అనుమతి పొందేందుకు సీఐడీ విజయవాడ అనిశా కోర్టులో రెండు వేర్వేరు దరఖాస్తులు దాఖలు చేసింది. మంగళవారం జరిగిన విచారణలో.. మాజీ మంత్రి నారాయణకూ దస్త్రాలు అందజేయాలని సీఐడీ తరఫు న్యాయవాదికి న్యాయాధికారి స్పష్టంచేశారు. ఇవ్వబోమంటే కుదరదని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
China: సముద్ర ఉచ్చులో చైనా అణు జలాంతర్గామి.. 55 మంది సబ్‌మెరైనర్ల మృతి..!
-
KTR: దిల్లీ బాస్‌ల అనుమతి లేకుండానే లక్ష్మణ్ అలా మాట్లాడారా?: కేటీఆర్
-
Rajinikanth: ‘తలైవా 170’ గురించి ఆసక్తికర విషయం పంచుకున్న రజనీకాంత్..
-
MS Dhoni: ప్రపంచ కప్‌లో మాహీ... ఎందుకంత స్పెషల్ అంటే!
-
US Speaker: అమెరికా చరిత్రలో తొలిసారి.. స్పీకర్‌కు ఉద్వాసన
-
Delhi Liquor Scam: ఆప్ నేత సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు