Ponguleti: విజయనగరం సీనరేజి టెండరూ ‘పొంగులేటి’ సంస్థకే

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని చిన్నతరహా ఖనిజాలకు సీనరేజి, కన్సిడరేషన్‌ మొత్తం వసూళ్ల టెండరును ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (2014లో వైకాపా తరఫున గెలిచారు) కుటుంబానికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ దక్కించుకుంది.

Updated : 07 Jun 2023 08:44 IST

ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలూ వాళ్లకే
7 జిల్లాలకు బిడ్లు వేసేందుకు 20 వరకు గడువు

ఈనాడు, అమరావతి: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని చిన్నతరహా ఖనిజాలకు సీనరేజి, కన్సిడరేషన్‌ మొత్తం వసూళ్ల టెండరును ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (2014లో వైకాపా తరఫున గెలిచారు) కుటుంబానికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ దక్కించుకుంది. నెలకు రూ.9 కోట్ల వరకు గనులశాఖకు చెల్లించేలా బిడ్‌ దాఖలుచేసి టెండరు దక్కించుకున్నట్లు తెలిసింది. అయితే ఎన్ని సంస్థలు పోటీపడ్డాయన్న వివరాలను గనులశాఖ అధికారులు వెల్లడించట్లేదు. టెండరులో పేర్కొన్న బ్యాంకు గ్యారంటీ మొత్తాన్ని, మొదటి నెల సొమ్మును గనులశాఖకు చెల్లిస్తే.. ఆ సంస్థతో విజయనగరం గనులశాఖ ఉప సంచాలకులు ఒప్పందం చేసుకోనున్నారు. దీంతో ఆ ఉమ్మడి జిల్లా అంతటా చిన్నతరహా ఖనిజాల లీజుదారుల నుంచి ఆ సంస్థే సీనరేజి వసూలు చేయనుంది. పర్మిట్లను కూడా అదే జారీచేస్తుంది.

రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లాల్లో రెండేళ్ల కాల వ్యవధికి సీనరేజి, ప్రీమియం వసూళ్లకు టెండర్లు పిలవగా అందులో చిత్తూరు, కడప, అనంతపురం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల బిడ్లను ఈ ఏడాది ఆరంభంలో ఖరారు చేశారు. చిత్తూరు, కడప జిల్లా బిడ్లను పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబసంస్థలే సొంతం చేసుకున్నాయి. చిత్తూరు జిల్లాలో రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌, కడప జిల్లా బిడ్‌ను హిల్‌సైడ్‌ ఎస్టేట్స్‌ లిమిటెడ్‌ దక్కించుకున్నాయి. ఇందులో చిత్తూరు జిల్లాలోని సీనరేజి వసూళ్లను ‘పెద్దాయన’ అనుయాయులు చూస్తున్నారు. కడప జిల్లాలో మాత్రం హిల్‌సైడ్‌ ఎస్టేల్స్‌ లిమిటెడ్‌ ప్రతినిధులే పర్యవేక్షిస్తున్నారు. అంటే మొత్తంగా ఆరు జిల్లాల్లో సీనరేజి వసూళ్లకు టెండర్లు పూర్తికాగా, అందులో మూడు జిల్లాల్లో పొంగులేటి కుటుంబసంస్థలే సొంతం చేసుకున్నాయి.

మిగిలిన జిల్లాలకు బిడ్ల గడువు పెంపు

ఉమ్మడి విశాఖపట్నం, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో సీనరేజి వసూళ్ల టెండర్లలో ఎవరూ బిడ్లు దాఖలు చేయలేదు. గతంలో రెండు దఫాలు టెండర్లు పిలిచినప్పుడు ఎవరూ ముందుకురాలేదు. గతనెలలో మళ్లీ టెండర్లు పిలిచినా, స్పందన లేకపోవడంతో బిడ్ల దాఖలు గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్లు గనులశాఖ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు