కాలుష్య పరిశ్రమలు మాకొద్దు

‘కాలుష్య కారక పరిశ్రమలు మాకొద్దు.. భూములిచ్చిన మాకు న్యాయం కావాలి’.. అంటూ స్థానికులు నినాదాలతో హోరెత్తించారు.

Updated : 07 Jun 2023 06:08 IST

కాకినాడ సెజ్‌ ప్రజాభిప్రాయ సేకరణ సభలో తీవ్ర నిరసన

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, తొండంగి, తుని పట్టణం: ‘కాలుష్య కారక పరిశ్రమలు మాకొద్దు.. భూములిచ్చిన మాకు న్యాయం కావాలి’.. అంటూ స్థానికులు నినాదాలతో హోరెత్తించారు. నల్ల రిబ్బన్లు కట్టుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. బారికేడ్లు దాటి ముందుకొచ్చే ప్రయత్నాలు చేశారు. ఓవైపు నిరసన కొనసాగుతుండగానే ప్రజాభిప్రాయసేకరణ కొనసాగింది. కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలిలో బహుళ ఉత్పత్తుల పారిశ్రామిక పార్కు(ఎంఐపీ) ఏర్పాటుకు తొండంగి మండలం కె.పెరుమాళ్లపురం వద్ద కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పర్యావరణ కన్సల్టెంట్‌ పర్యావరణ అంచనా నివేదిక వివరాలు వెల్లడిస్తున్న క్రమంలో స్థానికులు ఒక్కసారిగా లేచి నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఇవి ఏర్పాటైతే తీరంలో మత్స్యకారుల జీవనోపాధి కరవవుతుందని, భూములు పాడవుతాయని, ఆరోగ్యం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్‌ వెనక ఉండి ప్రోత్సహిస్తున్నారు

దివీస్‌ను బంగాళాఖాతంలో కలిపేస్తానని ప్రతిపక్ష నేతగా చెప్పిన జగన్‌ ఇప్పుడు వెనక ఉండి ప్రోత్సహిస్తున్నారని పలువురు ఆరోపించారు. ఏ ప్రభుత్వం వచ్చినా తమకు ఒరిగేదేమీలేదని ఆక్రోశం వెళ్లగక్కారు. కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటుచేస్తే అంతా సహకరిస్తామని కొందరు చెప్పారు. కాలుష్యకారక రసాయనాలను పైపు లైను ద్వారా తీరానికి దూరంగా తీసుకువెళ్లి శుద్ధి చేసి వదలాలని మరికొందరు కోరారు. ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. హేచరీస్‌ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆక్వారంగం దెబ్బతింటే వేలాది మంది రోడ్డునపడే ప్రమాదం ఉందన్నారు. ప్రజాసంఘాలు, ప్రజాప్రతినిధులు, స్థానికులు తమ వాదన వినిపించారు. పలువురి అనుమానాలను సెజ్‌ ప్రతినిధులు నివృత్తి చేశారు.

మాజీ ఎమ్మెల్యే వర్మ గృహ నిర్బంధం

ప్రజాభిప్రాయ సేకరణకు హాజరైన తొండంగి మండలం పెరుమళ్లాపురం, ఎ.వి.నగరం.. యు.కొత్తపల్లి మండలం పొన్నాడ, రమణక్కపేట గ్రామస్థులను పోలీసులు తనిఖీలు చేశాక ప్రాంగణంలోకి అనుమతించారు. మాజీ ఎమ్మెల్యే ఎస్‌.వి.ఎస్‌.ఎన్‌.వర్మ, ఇతర తెదేపా నాయకులను పోలీసులు మూలపేటలో అడ్డుకుని స్థానిక తెదేపా నాయకుడి ఇంటి వద్ద మధ్యాహ్నం వరకు గృహ నిర్బంధం చేశారు. అభిప్రాయ సేకరణ పూర్తయ్యాక కాకినాడలోని ఆయన నివాసానికి తరలించారు.

ప్రజాభిప్రాయాన్ని కేంద్రానికి పంపిస్తాం: కలెక్టర్‌ కృతికాశుక్లా

కలెక్టర్‌ కృతికాశుక్లా మాట్లాడుతూ 36 మంది అభిప్రాయాలను వెల్లడిస్తే.. 60 మంది తమ సూచనలు, అభ్యంతరాలపై వినతులు అందించారని చెప్పారు. ప్రజాభిప్రాయాలను కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖకు పంపుతామన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని