ప్రణాళికాలోపం, సమన్వయలేమితో పోలవరం ఆలస్యం

పోలవరం నిర్మాణంలో జాప్యానికి ఏపీ ప్రభుత్వ వైఖరే కారణమని దీనిపై అధ్యయనం చేసిన హైదరాబాద్‌ ఐఐటీ నివేదించినట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Published : 07 Jun 2023 03:21 IST

ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి 14 కారణాలు
హైదరాబాద్‌ ఐఐటీ నివేదికలో వేళ్లన్నీ ఏపీ ప్రభుత్వం వైపే
సహ దరఖాస్తుకు కేంద్ర జలశక్తి శాఖ సమాధానాలు

ఈనాడు, దిల్లీ: పోలవరం నిర్మాణంలో జాప్యానికి ఏపీ ప్రభుత్వ వైఖరే కారణమని దీనిపై అధ్యయనం చేసిన హైదరాబాద్‌ ఐఐటీ నివేదించినట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యానికి కారణాలపై సమాచార హక్కు కార్యకర్త ఇనగంటి రవికుమార్‌ సహ చట్టం కింద అడిగిన ప్రశ్నలకు ఈ వివరాలు అందించింది. పోలవరం ప్రాజెక్టుపై థర్డ్‌ పార్టీ మదింపు కోసం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ హైదరాబాద్‌ ఐఐటీని నియమించింది. ఆ సంస్థ 2021 నవంబర్‌లో ఇచ్చిన నివేదికలో ప్రాజెక్టు జాప్యానికి గల 14 కారణాలను విశ్లేషించినట్లు తెలిపింది. 2022 ఏప్రిల్‌ 29నాటి పీపీఏ కమిటీ తాజా నివేదిక ప్రకారం హెడ్‌వర్క్స్‌, ప్రధాన కాల్వలు, భూసేకరణ, సహాయ, పునరావస పనులు 2024 మార్చి నాటికి, పంపిణీ కాల్వలు 2024 చివరినాటికి పూర్తి కావొచ్చని పేర్కొంది. ఇంకా ఏమందంటే.. ‘రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సమర్పించిన బిల్లుల వివరాలు మా వద్ద అందుబాటులో లేవు. 2023 మార్చి 31నాటికి రూ.14,418.39 కోట్లు రీయింబర్స్‌ చేయాలని సిఫార్సు చేశాం. అంతకుమించి పెండింగ్‌ బిల్లులేమీ లేవు. కేంద్ర జలమండలి (సీడబ్ల్యూసీ)లోని సాంకేతిక సలహా కమిటీ 2017-18 నాటి ధరల ప్రకారం రూ.55,548 కోట్ల సవరించిన అంచనాలకు ఆమోదముద్ర వేసింది. అయితే 2010-11 నాటి ధరలతో రూపొందించిన సవరించిన అంచనాలతో పోలిస్తే.. 2017-18నాటి ధరలతో రూపొందించిన అంచనాల్లో 20%కి మించి తేడా ఉంది. దీంతో 2016 ఆగస్టు 5న ఆర్థిక శాఖ జారీచేసిన ఆఫీస్‌ మెమోరండంలోని నిబంధనల ప్రకారం సవరించిన అంచనాలు ఖరారు చేయడానికి జలవనరుల శాఖ సంయుక్త కార్యదర్శి, ఆర్థిక సలహాదారు ఆధ్వర్యంలో రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీని ఏర్పాటుచేశాం. ఈ కమిటీ 2020 మార్చిలో ఇచ్చిన నివేదికలో ప్రాజెక్టు నిర్మాణానికి 2013-14 ధరల ప్రకారం రూ.29,027.95 కోట్లు, 2017-18నాటి ధరల ప్రకారం రూ.47,725.74 కోట్లు అవుతుందని అంచనా వేసింది’ అని వివరించింది.

ఐఐటీహెచ్‌ నివేదికలో ఏముందంటే?

‘నిర్మాణ షెడ్యూలుతో పోలిస్తే స్పిల్‌ వే, కాఫర్‌ డ్యాం, కుడి వైపు అనుసంధాన పనులు తొలుత ఆలస్యమైనా ఇప్పుడు పూర్తి కావొస్తున్నాయి. మిగిలిన పనుల్లో ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ గ్యాప్స్‌-1, 2, ఎడమ అనుసంధానాలు, ఎడమ ప్రధాన కాల్వ, ఉప కాల్వల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది.

2022 ఏప్రిల్‌ కల్లా ప్రాజెక్టు పూర్తిచేయాలన్న తాజా ఆమోదిత లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యం. అధికారుల సూచనలను గుత్తేదారు సంస్థ పట్టించుకోకపోవడం కూడా ఇందుకు కారణం’ అని ఐఐటీహెచ్‌ నివేదించింది.


14 ప్రధాన కారణాలివీ..

1. ప్రాజెక్టు నిర్మాణ గడువులను ఏపీ జలవనరుల శాఖ తరచూ మార్చడం.

2. కొవిడ్‌ మహమ్మారి, దాని సంబంధ పరిస్థితులు (లాక్‌డౌన్‌, కట్టడి చర్యలు).

3. ఏపీ జలవనరులశాఖ నిర్మాణ సంస్థలను మార్చడం.

4. భూసేకరణ, సహాయ, పునరావాస కార్యకలాపాల్లో నెమ్మది.

5. నిర్మాణసంస్థకు వ్యూహాత్మక ప్రణాళిక లోపించడం.

6. ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధమున్న అనుబంధ సంస్థలు/ వ్యవస్థల మధ్య సమన్వయలేమి.

7. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సూచనలు, డిజైన్లకు అనుమతులు పొందడంలో జాప్యం.

8. జలవనరుల శాఖ ఆమోదించిన ఒరిజినల్‌/ ప్రీఅప్రూవ్డ్‌ డీపీఆర్‌లోని డిజైన్‌లో మార్పులు చేయడం.

9. ఆర్‌అండ్‌ఆర్‌ అమలులో ఆటోమేషన్‌ లేకపోవడం. డాక్యుమెంటేషన్‌ సమస్యల కారణంగా నిర్వాసితులకు సకాలంలో పరిహారం అందక ఆర్‌అండ్‌ఆర్‌ పనుల్లో జాప్యం.

10. ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్లో జలవనరుల శాఖ 30%లోపు మాత్రమే ఖర్చు చేయడం.

11. భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ ప్రక్రియ 2013నాటి భూసేకరణ, సహాయ పునరావాస చట్టం ప్రకారమే చేస్తున్నప్పటికీ.. అమలులో వేగం లోపించింది.

12. కాంట్రాక్టర్లను తరచూ మార్చడం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి కారణమైంది. కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌ దృష్టి సారించాలి.

13. ఆమోదిత డీపీఆర్‌ నుంచి పక్కకు మళ్లడం (డీవియేషన్‌), ప్రాధాన్యాలను మార్చడం.

14. ఒక ఏజెన్సీని రద్దు లేదా ప్రీక్లోజర్‌ చేశాక, కొత్త ఏజెన్సీకి పనులు అప్పగించకపోవడం.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని