ఉద్యోగులకు దగా.. దగా
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పింఛను పథకం) రద్దుచేస్తామని హామీ ఇచ్చిన జగన్.. ఉద్యోగులను దగా చేశారు.
పాత పింఛను పునరుద్ధరణ లేదు
మాట ఇచ్చి తప్పిన ముఖ్యమంత్రి మాట తప్పితే రాజీనామా చేయాలన్నది జగనే
ఇప్పుడు మాట తప్పిందీ ఆయనే..
గ్యారంటీ పింఛను స్కీం అమలుకు మంత్రిమండలిలో పచ్చజెండా
భగ్గుమంటున్న సీపీఎస్ వ్యతిరేక ఉద్యోగ సంఘాలు
జగన్ అనే నేను అధికారంలోకి వచ్చిన వారంలోగా సీపీఎస్ రద్దుచేస్తానని చెబుతున్నా. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికీ మాట ఇస్తున్నా. ఎన్నికలకు వెళ్లేటప్పుడు ప్రతి పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తుంది. అందులోని ప్రతి మాటనూ రాజకీయపార్టీ నిలబెట్టుకోవాలి. అలా నిలబెట్టుకోలేకపోతే ఆ నాయకుడు పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి తీసుకురావాలి.
ఎన్నికలకు ముందు వివిధ సభల్లో జగన్
పదవీవిరమణ తర్వాత సీపీఎస్ ఉద్యోగుల పరిస్థితి ఏంటనే అంశంపై ప్రతిపక్షంగా హామీ ఇచ్చామే తప్ప ఇందులో టెక్నికల్ సబ్జెక్టు మాకూ తెలియదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం బడ్జెట్ సరిపోయేలా లేదు. మళ్లీ ఏం చేయాలని తర్జనభర్జన పడ్డాం. సీపీఎస్‌కు బదులు ఉద్యోగులకు ఎలా భద్రత కల్పించవచ్చనే అంశంపై రెండు, మూడు ప్రతిపాదనలు చర్చిస్తున్నాం.
గతంలో ఉద్యోగ సంఘాలతో సజ్జల రామకృష్ణారెడ్డి
సీపీఎస్ రద్దుచేస్తూ సంతకం పెట్టాలంటే అది నిమిషంలో పని. పాత పింఛను విధానాన్ని అమల్లోకి తీసుకురావాలంటే భవిష్యత్తు తరాలపై కూడా మోయలేని భారం అవుతుంది. 2070 నాటికి ఓపీఎస్ కింద చెల్లింపులే రూ.3,73,000 కోట్లకు పెరుగుతాయి. ఏదో ఒక దశలో మోయలేని భారాన్ని తట్టుకోలేక మళ్లీ ఓపీఎస్ రద్దుచేసే పరిస్థితి వస్తుంది. అందుకే ఓపీఎస్ అమలు చేయలేం. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ తీసుకొస్తున్నాం.
మంత్రిమండలి సమావేశంలో చర్చపై అధికారిక ప్రకటన
ఈనాడు, అమరావతి: అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పింఛను పథకం) రద్దుచేస్తామని హామీ ఇచ్చిన జగన్.. ఉద్యోగులను దగా చేశారు. పాత పింఛను పథకాన్ని పునరుద్ధరిస్తారని ఎదురుచూసిన ఉద్యోగులను నిలువునా మోసం చేశారు. ఓపీఎస్‌ను పునరుద్ధరించలేమని తేల్చిచెప్పేశారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకున్నారు. సీపీఎస్ స్థానంలో గ్యారంటీ పింఛను పథకం అమలుకు బిల్లు పెట్టి ఆమోదించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉద్యోగులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న పాత పింఛను పథకం వారికి దక్కట్లేదు. సీపీఎస్ విధానంలో పింఛనుకు గ్యారంటీ లేదని, ప్రస్తుతం తాజాగా ప్రవేశపెడుతున్న జీపీఎస్ విధానంలో పింఛనుకు గ్యారంటీ ఉంటుందని ప్రకటిస్తూనే పాత పింఛను విధానం తీసుకురావడం సాధ్యం కాదని తేల్చిచెప్పేసింది. అంటే పాత పింఛను విధానం ద్వారా పదవీ విరమణ చేసే ఉద్యోగులకు అందే ప్రయోజనాలన్నీ అందజేయలేమని, అందబోవని సుస్పష్టంగా తేల్చి చెప్పినట్లయింది. ఎన్నికలకు ముందు సీపీఎస్ రద్దు చేసి పాత పింఛను విధానం పునరుద్ధరిస్తామని జగన్ చెబుతారు. ఆ తర్వాత అయ్యో మాకు సాంకేతిక విషయాలు తెలియక ఆ సంగతి చెప్పాము.. అందుకు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో ఆలోచిస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల చెబుతారు. చివరికి మంత్రిమండలి సమావేశం ఏర్పాటుచేసి పాత పింఛను విధానం తీసుకురాలేమని, అది సాధ్యం కాదని చావు కబురు చల్లగా చెప్పేశారు. మాట నిలబెట్టుకోకపోతే ఆ రాజకీయ నాయకుడు రాజీనామా చేసి వెళ్లిపోవాలని చెప్పిన జగన్... మరి ఇప్పుడు ఏం చేస్తారో?
పాత పింఛను పథకానికి, ఈ కొత్త జీపీఎస్‌కు ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయని సీపీఎస్ రద్దుపై పోరాడుతున్న ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టంగా చెబుతున్నారు. ఓపీఎస్ కింద వచ్చే ప్రయోజనాలన్నీ ఇవ్వలేకపోతున్నందునే ఈ జీపీఎస్ పేరుతో మసి పూసి మారేడుకాయ చేయడం తప్ప ఇందులో ఉద్యోగులకు ఒనగూరేది ఏదీ లేదని వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సీపీఎస్ రద్దు కోసం పోరాడుతున్న సంఘాల ప్రతినిధులు అంతా స్పష్టంగా ప్రకటించారు. ఈ జీపీఎస్ విధివిధానాలు వెలుగులోకి వచ్చిన తర్వాత పాత పింఛను విధానంతో పోలిస్తే ఉద్యోగులు ఎంత నష్టపోతున్నారో తెలుస్తుంది.
పాత పింఛను విధానం తీసుకురాలేం
ఆంధ్రప్రదేశ్‌లో పాత పింఛను విధానం అమలు చేయలేమని జగన్ ప్రభుత్వం మళ్లీ ప్రకటించింది. రాష్ట్ర మంత్రిమండలి బుధవారం సమావేశమైన తర్వాత ఆ సమావేశ నిర్ణయాలను సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విలేకర్లకు వివరించారు. దాంతో పాటు మంత్రిమండలి సమావేశంలో సీపీఎస్, ఓపీఎస్, జీపీఎస్‌పై ఏం చర్చ జరిగిందో ప్రభుత్వం అధికారికంగా వివరాలు వెల్లడించింది. అందులో పాత పింఛను విధానం మళ్లీ తీసుకురావడం సాధ్యం కాదని స్పష్టంగా చెప్పింది. సీపీఎస్‌కు, ఓపీఎస్‌కు మధ్యంతరంగా ఉండే విధానమే గ్యారంటీ పింఛను పథకం అని ఆ నోట్‌లోని వివరాలు పరిశీలిస్తే అవగతం అవుతుంది. పాత పింఛను విధానంలో ఉద్యోగులకు అందే ప్రయోజనాలు అన్నీ అమలు చేయడం సాధ్యం కాదని జగన్ ప్రభుత్వం స్పష్టంగా తేల్చి చెప్పినట్లయింది.
సీపీఎస్ రద్దు చేస్తూ సంతకం చేయలేం
‘‘గ్యారంటీ పింఛను పథకం ద్వారా ఉద్యోగి ఆఖరు నెల మూల వేతనంలో 50 శాతం పింఛను ఇస్తాం. పాత పింఛను విధానంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న డీఏ మాదిరిగానే జీపీఎస్ పింఛనుదారులకు కూడా డీఆర్ వర్తింపు ఉంటుంది. సీపీఎస్‌తో పోలికే లేకుండా విశ్రాంత ఉద్యోగులకు భద్రత ఇచ్చేలా జీపీఎస్ విధానం ఉంటుంది. ఉద్యోగులకు, ప్రభుత్వానికి ఇది ఉభయతారకంగా ఉంటుంది. సీపీఎస్ రద్దు చేస్తూ సంతకం చేయాలంటే నిమిషంలో పని. కానీ పాత పింఛను విధానాన్ని అమలు చేస్తే భవిష్యత్తు తరాలపై దాని ప్రభావం పడుతుంది. 2041 నాటికి పింఛన్ల భారం బడ్జెట్‌లో రూ.65,234 కోట్లకు చేరుతుంది. 2070 నాటికి ఇది రూ.3,73,000 కోట్లకు చేరుతుంది. ఏదో ఒక దశలో మళ్లీ పాత పింఛను విధానాన్ని రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సీపీఎస్ విధానంలో పింఛనుకు సంబంధించి పూర్తి అనిశ్చితి ఉంటుంది. పింఛను గ్యారంటీ ఉండదు. పదవీ విరమణ తర్వాత అతని మూల వేతనంలో 20.3 శాతమే పింఛనుగా వస్తుంది. అది కూడా వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం అమలు చేయబోతున్న జీపీఎస్‌లో పింఛనుకు పూర్తి గ్యారంటీ ఇస్తాం. పదవీ విరమణకు ముందు చివరి జీతంలో 50 శాతం పింఛనుగా అందుతుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీఆర్ ఇస్తాం’’ అని ప్రభుత్వం ప్రకటించింది.
పాత పింఛను విధానం, సీపీఎస్, జీపీఎస్... ఏమిటీ వ్యత్యాసం?
పాత పింఛను విధానం...
* పాత పింఛను విధానంలో పింఛను కోసం ఉద్యోగి ఎలాంటి మొత్తమూ ప్రతినెలా చెల్లించాల్సిన అవసరం లేదు.
* ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత ఆఖరి నెల డ్రా చేసిన మూల వేతనంలో 50శాతం పింఛనుగా లభిస్తుంది. ఆ మొత్తానికి నాటికి ఉన్న కరవు భత్యం కలుపుతారు.
* ఉద్యోగి సర్వీసు, ఆయన కమ్యుటేషన్ తీసుకున్న మొత్తాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది.
* ఆ తర్వాత ప్రతి ఆరు నెలలకు ఓసారి ద్రవ్యోల్బణం ఆధారంగా కేంద్రం ప్రకటించే కరవు భత్యం మొత్తాన్ని డీఆర్ (డియర్‌నెస్ రిలీఫ్) రూపంలో ఇస్తారు.
* రాష్ట్ర ప్రభుత్వం నియమించే వేతన సవరణ సంఘం సిఫార్సుల ఆధారంగా నిర్ణయించే ఫిట్‌మెంట్‌కు అనుగుణంగా పింఛను మొత్తాల్లోనూ మార్పులు ఉంటాయి. దానివల్ల ఎప్పటికప్పుడు పింఛను మొత్తం పెరుగుతూ ఉంటుంది.
* పదవీ విరమణ చేసిన ఉద్యోగి మరణిస్తే ఆయన భార్యకు ఆ పింఛనులో సగం మొత్తం చెల్లిస్తారు.
* ప్రస్తుతం పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు ఆరోగ్య బీమా పథకం కూడా అందుబాటులో ఉంది. పదవీవిరమణ చేసిన ఉద్యోగుల కుటుంబసభ్యుల వైద్య ఖర్చులు నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్సు చేస్తుంది. ఇది కూడా కీలక సామాజిక భద్రతగా ఉద్యోగులు పరిగణిస్తున్నారు.
జీపీఎస్ విధానం ఏమిటి?
ప్రస్తుతం ప్రభుత్వం తాజాగా గ్యారంటీ పింఛను పథకం ప్రకటించింది. దీనికి ఇంకా బిల్లు పెట్టి చట్టసభల్లో ఆమోదం పొందాలి. ఆ బిల్లులో ఏమేం అంశాలు ఉంటాయో ఇప్పటికీ స్పష్టత లేదు. రాష్ట్ర మంత్రిమండలి సమావేశం అనంతరం మంత్రి విలేకర్ల సమావేశంలో చెప్పిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి...
పదవీ విరమణ చేసిన ఉద్యోగి ఆఖరు నెలలో తీసుకున్న మూల వేతనంలో 50 శాతం పింఛనుగా ఇస్తారు. ప్రతి ఆరు నెలలకు ఓసారి డీఆర్ ఇస్తారు. 62 ఏళ్ల వయసులో ఉద్యోగి పదవీ విరమణ చేసి ఆ రోజు అతని వేతనం రూ.లక్ష ఉంటే అందులో సగం రూ.50 వేలు పింఛనుగా వస్తుంది. ప్రతి ఆరు నెలలకోసారి డీఆర్ ఇవ్వడం వల్ల ఉద్యోగికి 82 ఏళ్లు వచ్చేసరికి ఆ పింఛను రూ.1,10,000కు చేరుతుంది.
మంత్రి ప్రకటించిన ప్రకారం వివరాలు ఇంతే వెల్లడయ్యాయి. పూర్తి విధి విధానాలు బయటకు రావాలి. పాత పింఛను విధానంతో పోలిస్తే అనేక రకాలుగా ఇందులో నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
* పాత పింఛను విధానంలో ఉద్యోగి జీతం నుంచి పింఛను కోసం ఎలాంటి మొత్తమూ మినహాయించుకోవడం లేదు. ఈ విధానంలో ఉద్యోగి మూలవేతనం నుంచి 10 శాతం మినహాయింపు కొనసాగుతుందా లేదా అన్నది తేలాలి. కొనసాగుతుందనే ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి.
* పాత పింఛను విధానంలో కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణం ఆధారంగా ప్రకటించే మొత్తానికి డీఆర్ ఇస్తారు. ఈ విధానంలో అలా డీఆర్ ఇస్తారా లేక ప్రతి ఆరు నెలలకోసారి ఒక నిర్దిష్ట శాతమే డీఆర్ ఇస్తారా అన్న అనుమానాలు ఉన్నాయని ఉద్యోగసంఘాల నేతలు చెబుతున్నారు.
* పాత పింఛను విధానంలో ఎప్పటికప్పుడు వేతన సవరణ సంఘం సిఫార్సులు, ఫిట్‌మెంట్ ప్రభావం వల్ల పింఛను పెరుగుతుంది. ఈ జీపీఎస్‌లో పీఆర్‌సీకి అనుగుణంగా మార్పులు చేయడం లేదని తమకు సమాచారం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఇది ఎంతో నష్టం కలిగిస్తుందని పేర్కొంటున్నారు.
* ప్రతి నెలా ఉద్యోగి నుంచి 10 శాతం మొత్తం వాటాగా తీసుకునే విధానం కొనసాగిస్తే ఆ మొత్తంతో ఏర్పడే నిధిలో 60 శాతం తమకు తిరిగి చెల్లిస్తారా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. ఆ నిధిలో 60 శాతం ఉద్యోగులకు తిరిగి చెల్లించని పక్షంలో సీపీఎస్‌కు, జీపీఎస్‌కు అసలు పెద్ద వ్యత్యాసమే ఉండబోదని చెబుతున్నారు. దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయి.
* ఓపీఎస్ అమలవుతున్న ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత వైద్యం చేయించుకున్నందుకు అయ్యే ఖర్చులు తిరిగి చెల్లిస్తారు. తాజా విధానంలో ఆ అవకాశం లేదు.
* గ్యారంటీ పింఛను పథకం విధానంలో పాత పింఛను విధానం ప్రకారం ఉద్యోగులకు అందే ప్రయోజనాలన్నీ అందబోవని స్వయంగా ప్రభుత్వమే ప్రకటించింది. లెక్కల ఆధారంగా ఈ విషయం సుస్పష్టంగా చెప్పింది. తమకు ఓపీఎస్ ప్రయోజనాలు దక్కని ఈ జీపీఎస్... ఏ మాత్రం సమ్మతి కాదని ఉద్యోగ సంఘాలు ప్రకటిస్తున్నాయి.
సీపీఎస్ విధానం ఏమిటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
* కాంట్రిబ్యూటరీ పింఛను విధానం 2004 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఉద్యోగి ప్రతి నెలా తన మూలవేతనం నుంచి 10 శాతం పింఛను నిధికి జమ చేయాలి.
* రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి నెలా తన వాటా కింద 10 శాతం ఈ నిధికి జమ చేస్తుంది.
* కేంద్రం తాజాగా ఈ మొత్తాన్ని 14 శాతంగా మార్పు చేసినా ఆంధ్రప్రదేశ్‌లో ఆ మేరకు మార్పులు చేయలేదు.
* ఇలా పింఛను నిధికి జమ చేసిన మొత్తం ఉద్యోగి పదవీ విరమణ చేసే వరకూ ఆ నిధిలో ఉంటుంది.
* పదవీ విరమణ సమయంలో ఆ నిధి నుంచి ఉద్యోగి 60 శాతంగా జమ అయిన మొత్తాన్ని తిరిగి తీసుకోవచ్చు.
* మిగిలిన 40 శాతం మొత్తం యాన్యుటీ పింఛను పథకంలో పెట్టుబడిగా పెడతారు. ఆ సమయంలో ఉద్యోగి ఎంచుకునే పింఛను విధానాన్ని బట్టి ప్రతి నెలా కొంత మొత్తం పింఛనుగా చెల్లిస్తారు.
* ప్రస్తుత లెక్క ప్రకారం.. ఉద్యోగి ఆఖరి నెల తీసుకునే మూల వేతనంలో 20.3 శాతమే పింఛనుగా వస్తుందని ఒక అంచనా. ఇది కూడా మార్కెట్ పరిస్థితులను బట్టి తగ్గే అవకాశం ఉంది. ఈ పింఛనుకు గ్యారంటీ లేదు.
పాత పింఛను విధానంలో వచ్చినంత పెద్ద మొత్తంలో పింఛను రాదు. ఈ విధానంలో వచ్చే పింఛను మొత్తానికి ఎలాంటి గ్యారంటీ లేదు. పైగా ఎప్పటికప్పుడు డీఆర్ ఉండదు. పీఆర్‌సీ వల్ల కలిగే ప్రయోజనాలూ దక్కవు. ఈ స్కీంలో అందే పింఛనుతో ప్రభుత్వానికి, ఖజానాకు సంబంధం లేదు. పదవీ విరమణ తర్వాత ఉద్యోగికి, ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పాత పింఛను విధానంలో ఆరోగ్యం పథకం కింద దక్కే ప్రయోజనాలు సీపీఎస్ విధానంలో వర్తించవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Phonepe appstore: గూగుల్‌కు పోటీగా ఫోన్‌పే కొత్త యాప్‌స్టోర్
-
ఎక్స్ ఇండియా హెడ్ రాజీనామా.. కారణమిదేనా?
-
Cricket News: సిరాజ్ స్పెషల్ అదేనన్న ఏబీడీ... జట్టుకు కాంబినేషనే కీలకమన్న షమీ!
-
Chandrababu Arrest: చంద్రబాబు విడుదలయ్యే వరకు దీక్ష కొనసాగిస్తా: కాలవ శ్రీనివాసులు
-
TS Election: చురుగ్గా ఏర్పాట్లు.. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు?
-
Gurpatwant Singh Pannun: పన్నూ వార్నింగ్ ఇస్తే.. కేంద్రం షాకిచ్చింది: ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ