సీపీఎస్‌ స్థానంలో జీపీఎస్‌

కాంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్‌)లో ఉన్న ఉద్యోగులకు దాని స్థానంలో గ్యారంటీ పింఛను పథకం (జీపీఎస్‌) వర్తింపు, రాష్ట్ర విభజన నాటికి అయిదేళ్లుగా కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్నవారిని క్రమబద్ధీకరించడం, వివిధ శాఖల్లో 6,840 పోస్టుల భర్తీ, వైద్య విధానపరిషత్‌ను ప్రభుత్వ శాఖగా మార్చి, అందులోని ఉద్యోగులను విలీనం చేయడం, చిత్తూరు డెయిరీకి చెందిన 28.35 ఎకరాలను అమూల్‌కు 99 ఏళ్లపాటు లీజుకు ఇవ్వడం.. వంటి పలు నిర్ణయాలకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

Updated : 08 Jun 2023 06:54 IST

ఉద్యోగుల చివరి నెల జీతంలోని మూలవేతనంలో 50 శాతం పింఛను, ఏటా రెండు డీఆర్‌లు
10 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ
వివిధ శాఖల్లో 6,840 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు
28.35 ఎకరాల చిత్తూరు డెయిరీ భూములు అమూల్‌కు 99 ఏళ్లపాటు లీజుకు
రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలు
ఈనాడు - అమరావతి

కాంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్‌)లో ఉన్న ఉద్యోగులకు దాని స్థానంలో గ్యారంటీ పింఛను పథకం (జీపీఎస్‌) వర్తింపు, రాష్ట్ర విభజన నాటికి అయిదేళ్లుగా కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్నవారిని క్రమబద్ధీకరించడం, వివిధ శాఖల్లో 6,840 పోస్టుల భర్తీ, వైద్య విధానపరిషత్‌ను ప్రభుత్వ శాఖగా మార్చి, అందులోని ఉద్యోగులను విలీనం చేయడం, చిత్తూరు డెయిరీకి చెందిన 28.35 ఎకరాలను అమూల్‌కు 99 ఏళ్లపాటు లీజుకు ఇవ్వడం.. వంటి పలు నిర్ణయాలకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో 63 నిర్ణయాలను కేబినెట్‌ ఆమోదించింది. సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ విలేకర్ల సమావేశంలో వెల్లడించిన వివరాలివీ..

* సీపీఎస్‌ విధానం రద్దు చేసి, జీపీఎస్‌ విధానం తీసుకొచ్చేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఉద్యోగి పదవీ విరమణ చేసే చివరి నెల మూలవేతనం (బేసిక్‌)లోని 50 శాతం పింఛనుగా వస్తుంది. దీనికి ఏటా రెండు డీఆర్‌లు కలుపుతారు. 62 ఏళ్లకు పదవీవిరమణ చేసే ఓ ఉద్యోగి చివరి నెల బేసిక్‌ రూ.లక్ష ఉంటే, అందులో రూ.50 వేలు పింఛనుగా వస్తుంది. ఏడాదికి రెండు డీఆర్‌లు కలుపుతూ ఉంటే, ఉద్యోగికి 82 ఏళ్లు వచ్చేసరికి పింఛను రూ.1.10 లక్షలు అవుతుంది. ఈ విధానం దేశంలోనే ఆదర్శంగా నిలవనుంది.

* 2014 జూన్‌ 2 (రాష్ట్ర విభజన తేదీ) నాటికి అయిదేళ్ల సర్వీసు ఉన్న సుమారు 10 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ. 

* ఏపీ వైద్యవిధాన పరిషత్‌ స్వయంప్రతిపత్తిని రద్దు చేసి, డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ శాఖగా మార్పు. ఇందులోని 14,653 మంది  ఉద్యోగులకు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 010 పద్దు నుంచి జీతాల చెల్లింపు.

* అన్ని జిల్లా కేంద్రాల్లోని ఉద్యోగులకు ఒకే విధంగా ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) అమలు. కొన్ని జిల్లా కేంద్రాల్లో 12శాతం ఉన్న హెచ్‌ఆర్‌ఏ 16 శాతానికి పెంపు.

* 2022 జనవరి డీఏ, డీఆర్‌ 2.73 శాతం మంజూరు.

* 12వ వేతన సవరణ కమిషన్‌ ఏర్పాటుకు నిర్ణయం. 

మూడు వైద్య కళాశాలలకు 2,118 పోస్టులు

* పలు శాఖల్లో 6,840 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల విడుదలకు నిర్ణయం. ఇందులో నాలుగు ఇండియన్‌ రిజర్వ్‌ బెటాలియన్లకు 3,920 పోస్టుల మంజూరు

* వచ్చే ఏడాదికి సిద్ధం కానున్న పులివెందుల, పాడేరు, ఆదోని వైద్య కళాశాలలకు.. ఒక్కోదానికి 706 పోస్టుల చొప్పున మొత్తం 2,118 పోస్టుల మంజూరు

* మానసిక సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు సూపర్‌ స్పెషాలిటీ సేవల కోసం విశాఖలోని ప్రభుత్వ మానసిక చికిత్సాలయంలో కొత్తగా అడాలసెంట్‌ అండ్‌ చైల్డ్‌ సైకియాట్రీ విభాగంతోపాటు, చైల్డ్‌ సైకియాట్రీలో ఓ సూపర్‌ స్పెషాలిటీ యూనిట్‌ ఏర్పాటు. ఇందులో 11 పోస్టుల మంజూరు

* కడప మానసిక వైద్య కళాశాలకు కొత్తగా 116 పోస్టులు

* పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఏర్పాటు చేయనున్న ఫిషరీస్‌ విశ్వవిద్యాలయానికి 65 పోస్టులు, నరసాపురం సైన్స్‌ కళాశాలకు 75 పోస్టులు 

* ఉద్దానం కిడ్నీ ఆసుపత్రిలో రెగ్యులర్‌ విధానంలో 41 మంది స్పెషాల్టీ, సూపర్‌ స్పెషాల్టీ వైద్యుల నియామకం

* చిత్తూరు డెయిరీ భూములు 28.35 ఎకరాలను అమూల్‌కు 99 ఏళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు నిర్ణయం

* గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమ్మోనియా విధానానికి ఆమోదం. ఏడాదికి 0.5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల హైడ్రోజన్‌, 2 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఆమ్మోనియాను అయిదేళ్లలో ఉత్పత్తి చేయాలనేది లక్ష్యం. ఈ పరిశ్రమల ఏర్పాటు ద్వారా 12 వేల మందికి ఉద్యోగాల కల్పన

*  అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో రెన్యూ వొయేమాన్‌ పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 300 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆమోదం. దీనివల్ల రూ.1,800 కోట్ల పెట్టుబడులతో 300మందికి ఉద్యోగాల కల్పన

12న విద్యాకానుక, 28న అమ్మఒడి

* ఈ నెల 12న జగనన్న విద్యాకానుక అమలు. ఒక్కో విద్యార్థికి రూ.2,200 విలువైన కిట్‌ను అందజేయనున్నాం.

* ఈ నెల 28 నుంచి అమ్మ ఒడి. పది రోజులపాటు కార్యక్రమం నిర్వహణ.

* ‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమం కింద పదో తరగతి, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ఈ నెల 15న నియోజకవర్గ స్థాయిలో, 17న జిల్లా స్థాయిలో, 20న రాష్ట్ర స్థాయిలో ఎక్సలెన్స్‌ అవార్డులు అందజేసి, సన్మానం.

* ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల్లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచేందుకు టోఫెల్‌ పరీక్షల నిర్వహణ. ఇందుకు ఈటీఎస్‌తో చేసుకున్న ఒప్పందానికి ఆమోదం. మూడు నుంచి అయిదో తరగతి విద్యార్థులకు టోఫెల్‌ ప్రైమరీ, 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు టోఫెల్‌ జూనియర్‌ పరీక్షలు నిర్వహించి, ప్రతిభ చూపిన వారికి ధ్రువపత్రాలు ఇస్తారు. పిల్లలు ఉత్తమ ప్రతిభ చూపితే వారి ఇంగ్లిష్‌ టీచర్‌ను మూడు రోజుల శిక్షణ కోసం అమెరికాలోని ప్రిన్స్‌టన్‌కు పంపించేలా నిర్ణయం.

* బడుల్లో అమలవుతున్న కార్యకలాపాల పర్యవేక్షణకు రెవెన్యూ డివిజన్‌ స్థాయిలోనూ ఉప విద్యాశాఖాధికారి నియామకం.

* ప్రతి మండలంలో రెండు జూనియర్‌ కళాశాలల మంజూరు. మండలంలో జనాభా ఎక్కువగా ఉండే రెండు పట్టణాలు లేదా గ్రామాలను ఎంపిక చేసి, అక్కడి హైస్కూళ్లను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేస్తారు. ఇందులో ఒకటి బాలబాలికలకు, మరొకటి ప్రత్యేకంగా బాలికలకు ఉంటుంది.

* నాడు- నేడు పూర్తి చేసుకొని ఐఎఫ్‌పీ ప్యానెళ్లు ఏర్పాటు చేసిన 476 జూనియర్‌ కళాశాలల్లో వాచ్‌మన్ల నియామకం.


ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ రూ.445.7 కోట్లు రుణం తీసుకునేందుకు అనుమతి

* మండల కేంద్రం నుంచి ప్రతి గ్రామ పంచాయతీకి ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ ఏర్పాటు. డిజిటల్‌ లైబ్రరీలు, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, బడులు, పీహెచ్‌సీలకు హై బ్యాండ్‌విడ్త్‌ ద్వారా 5జీ సేవలు. ఇందుకు ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ రూ.445.7 కోట్లు రుణం తీసుకునేందుకు ఆమోదం

* రాష్ట్రంలో ఆధార్‌ గుర్తింపు కార్డుకు చట్టబద్ధతకు వీలుగా చట్టసవరణ. ఏపీ ఆధార్‌ ఆర్డినెన్స్‌- 2023కు ఆమోదం

*రూ.5 లక్షల్లోపు వార్షిక ఆదాయమున్న ఆలయాల నిర్వహణ అయిదేళ్లపాటు వాటి అర్చకులు, వంశపారంపర్య ధర్మకర్తలకు అప్పగింత

* దేవాదాయ భూముల పరిరక్షణకు చట్టసవరణ. ఆక్రమణలు తొలగించేందుకు, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు వీలుగా ఈ సవరణ

* 2017- డెఫ్‌ ఒలింపిక్స్‌ టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ కాంస్య పతక విజేత, ఇండియన్‌ డెఫ్‌ టెన్నిస్‌ కెప్టెన్‌ కుమారి షేక్‌ జాఫ్రిన్‌ (కర్నూలు జిల్లా)ను సహకారశాఖలో డిప్యూటీ రిజిస్ట్రార్‌గా గ్రూప్‌-1 సర్వీసు కింద నియామకం

భూముల కేటాయింపు

* గుంటూరు జిల్లా తాడేపల్లిలో నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ సంస్థ ఏర్పాటుకు 2 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు.

* కడప జిల్లా బెస్త సంఘానికి సీకే దిన్నె మండలం మామిళ్లపల్లెలో 3.70 ఎకరాలు, కడప మండలం చిన్నచౌక్‌లో 3.70 ఎకరాల కేటాయింపు.

* శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 10 ఎకరాల కేటాయింపు. గతంలో నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్‌, ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ నార్కొటిక్స్‌ (నాసిన్‌)కు కేటాయించిన 10 ఎకరాల స్థలాన్ని కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు వీలుగా మార్పు చేస్తూ నిర్ణయం

* రామాయపట్నం నాన్‌ మేజర్‌ పోర్టు కోసం ఏపీ మారిటైమ్‌ బోర్డుకు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రావూరులో 9.46 ఎకరాలు, చేవూరులో 40 సెంట్ల ప్రభుత్వ స్థలాలు బదలాయింపు

* ఏర్పేడు మండలం వికృతమాలలో 15.15 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వామినారాయణ్‌ గురుకుల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఏర్పాటుకు కేటాయింపు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని