వివేకా లేఖపై నిన్‌హైడ్రిన్‌ పరీక్షకు అనుమతి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఆయన చనిపోయే ముందు రాసిన లేఖలో నిగూఢ వేలిముద్రలున్నాయేమో గుర్తించడానికి దాన్ని నిన్‌హైడ్రిన్‌ పరీక్షకు పంపాలన్న సీబీఐ అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఆమోదం తెలిపింది.

Updated : 08 Jun 2023 07:21 IST

సీబీఐ కోర్టు ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఆయన చనిపోయే ముందు రాసిన లేఖలో నిగూఢ వేలిముద్రలున్నాయేమో గుర్తించడానికి దాన్ని నిన్‌హైడ్రిన్‌ పరీక్షకు పంపాలన్న సీబీఐ అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఆమోదం తెలిపింది. వివేకా రాసిన లేఖను నిన్‌హైడ్రిన్‌ పరీక్షల నిమిత్తం దిల్లీలోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (సీఎఫ్‌ఎస్‌ఎల్‌)కు పంపాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రధాన న్యాయమూర్తి సీహెచ్‌.రమేశ్‌బాబు విచారణ చేపట్టారు. నిన్‌హైడ్రిన్‌ పరీక్షల్లో భాగంగా అసలు లేఖ దెబ్బతిన్నా, అందులోని రాత చెరిగిపోయినా ప్రత్యామ్నాయ సాక్ష్యం నిమిత్తం సర్టిఫైడ్‌ కాపీలను సిద్ధం చేయాల్సి ఉందన్నారు. అవసరమైనన్ని సర్టిఫైడ్‌ కాపీలను సిద్ధం చేసుకోవడానికి వీలుగా వివేకా రాసిన అసలు లేఖను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. నిన్‌హైడ్రిన్‌ పరీక్షలో కాగితంపై ఉన్న ఇంకు చెరిగిపోయే అవకాశం ఉన్నందున ముందస్తు అనుమతి కోరుతూ సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

బలవంతంగా రాయించిన లేఖే!

తన హత్యకు డ్రైవర్‌ ప్రసాద్‌ కారణమని, అతణ్ని వదిలిపెట్టరాదంటూ చనిపోయే ముందు వివేకా రాసిన లేఖను సీబీఐ దర్యాప్తులో స్వాధీనం చేసుకుంది. ఆయన ఈ లేఖను ఇష్టపూర్వకంగా రాశారా లేదంటే ఎవరిదైనా ఒత్తిడితో, బలవంతంగా రాశారో పరిశీలించాలంటూ 2021 అక్టోబరులో దిల్లీలోని సీఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపింది. వివేకా గత చేతి రాతతో ఈ లేఖను పోల్చి చూసిన సీఎఫ్‌ఎస్‌ఎల్‌.. దాన్ని బలవంతంగా రాయించినట్లు ధ్రువీకరించింది. ఈ విషయాన్ని అవినాష్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీబీఐ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. లేఖపై వివేకావి కాకుండా  ఇంకెవరివైనా వేలిముద్రలు ఉన్నాయేమో నిన్‌హైడ్రిన్‌ పరీక్ష నిర్వహించి తేల్చాలని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ను సీబీఐ అప్పట్లోనే కోరింది. ఏవైనా వేలిముద్రలు బయటపడితే వాటిని నిందితుల వేలిముద్రలతో పోల్చి చూసి, దర్యాప్తును ముందుకు తీసుకెళ్లచం్చని అభిప్రాయపడింది. అయితే నిన్‌హైడ్రిన్‌ పరీక్ష ద్వారా వేలిముద్రలను గుర్తించడానికి ప్రయత్నిస్తే కాగితంలోని వేలిముద్రలపై ప్రభావం పడుతుందని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ సీబీఐకి లేఖ రాసింది. తదనంతర దర్యాప్తులో అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరి.. నిందితులు వివేకాతో బలవంతంగా లేఖ రాయించినట్లు సీబీఐకి వెల్లడించారు. ఈ క్రమంలో నిందితుల వేలిముద్రలు లేఖపై పడే అవకాశం ఉందని సీబీఐ భావిస్తోంది. నిన్‌హైడ్రిన్‌ పరీక్షలో అవి బయటపడితే అసలైన నిందితులను గుర్తించవచ్చని కోర్టులో దరఖాస్తు చేసింది. దీనిపై విచారించిన కోర్టు నిందితులు వ్యక్తం చేసిన అభ్యంతరాలను తోసిపుచ్చి పరీక్షకు అనుమతిచ్చింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు