నిండా మునిగిన పౌరసరఫరాల సంస్థ

అప్పుల విషయంలో తమను చూసి ప్రభుత్వరంగ సంస్థలూ నేర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఎడాపెడా రుణ హామీలు ఇచ్చేస్తోంది.

Published : 08 Jun 2023 05:34 IST

ఇప్పటికే రూ.30వేల కోట్లకు పైగా  రుణభారం
తాజాగా మరో రూ.5వేల కోట్ల  రుణానికి హామీ ఇచ్చిన ప్రభుత్వం
మూడేళ్లలో ఇచ్చిన రాయితీ సొమ్ము  రూ.900 కోట్ల లోపే

ఈనాడు, అమరావతి: అప్పుల విషయంలో తమను చూసి ప్రభుత్వరంగ సంస్థలూ నేర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఎడాపెడా రుణ హామీలు ఇచ్చేస్తోంది. ఇలాగే.. పౌరసరఫరాల సంస్థకూ అదనంగా రూ.5వేల కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతించింది. ఈ సంస్థ ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయి, రైతుల వద్ద కొన్న ధాన్యానికి చెల్లించేందుకు సొమ్ము లేక సతమతమవుతోంది. 2014-15లో రూ.6,042 కోట్ల అప్పు మాత్రమే ఉండగా.. ఇది ఏటికేడు పెరుగుతూ రూ.30వేల కోట్లకు పైగా చేరింది. బ్యాంకుల్లో అప్పు పుట్టే దారి కానరాక.. రెండేళ్లుగా మార్క్‌ఫెడ్‌పై ఆధారపడుతోంది. అందుకే రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు అదనపు సేకరణ ఏజెన్సీగా మార్క్‌ఫెడ్‌ను నియమించి రూ.5వేల కోట్ల రుణ హామీ ఇచ్చింది. ఆ సంస్థ ద్వారా రూ.వేలకోట్ల అప్పులు తెచ్చి.. ధాన్యం బకాయిల్ని చెల్లిస్తోంది. అయినా సమయానికి బకాయిలు చెల్లించట్లేదు. రైతులకు నెలల తరబడి ఎదురుచూపులు తప్పట్లేదు.

రూ.6,042 కోట్ల నుంచి  రూ.32 వేల కోట్లకు పైగా

పౌరసరఫరాల సంస్థ రుణభారం ఏటికేడు పెరుగుతోంది. రాష్ట్రవిభజన సమయంలో సంస్థ అప్పు రూ.6,042 కోట్లే ఉంది. తర్వాత ఏటికేడు పెరుగుతోంది. 2022 మార్చి నాటికి రూ.31వేల కోట్ల మేర అప్పులు ఉన్నాయని కాగ్‌ నివేదిక వెల్లడిస్తోంది. వాటిలో కొంతమేర తీర్చగా.. మార్చి చివరకు రూ.30వేల కోట్ల వరకు రుణభారం ఉంది. ప్రభుత్వం ఇచ్చిన బ్యాంకు గ్యారంటీలు రూ.37వేల కోట్ల వరకూ చేరాయి. తాజాగా ప్రభుత్వం మరో రూ.5వేల కోట్ల రుణానికి అనుమతి ఇచ్చింది. అంటే మొత్తం రూ.42వేల కోట్ల వరకు రుణం తీసుకునే వెసులుబాటు కల్పించింది.

రూ.10వేల కోట్లకు పైగా ఖర్చు.. రూ.900 కోట్లతో సర్దుకోమన్నారు

పేదలకు నాణ్యమైన బియ్యం అందిస్తున్నట్లు చెప్పే సర్కారు.. పౌరసరఫరాల సంస్థకు రాయితీ సొమ్ము మాత్రం విడుదల చేయట్లేదు. అందుకే సంస్థ రుణభారం ఏటికేడు పెరుగుతోంది. ఏడాదికి రాయితీ బియ్యం, కందిపప్పు, పంచదార సరఫరాకు రూ.3వేల కోట్లకు పైగా ఖర్చవుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ.600 కోట్లు కూడా ఇవ్వట్లేదు. దీంతో బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి.. సర్దుబాటు చేస్తోంది. 2017-18లో అప్పటి ప్రభుత్వం రాయితీ కింద రూ.3,056 కోట్లు ఇచ్చింది. 2018-19లో రూ.340 కోట్లు, 2019-20లో రూ.396 కోట్లు, 2020-21లో రూ.23 లక్షలు, 2021-22లో రూ.503 కోట్లు మాత్రమే విడుదల చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక తొలి మూడేళ్లకు పరిశీలిస్తే.. రాయితీ నిమిత్తం రూ.10వేల కోట్లకు పైగా ఖర్చు చేయగా ప్రభుత్వం నుంచి రూ.900 కోట్లే అందింది. మిగిలిన మొత్తాన్ని సంస్థ అప్పుల రూపంలోనే సర్దుబాటు చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని