రేపు కేరళకు ‘నైరుతి’

నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు దేశంలోకి ప్రవేశించనున్నాయి. శుక్రవారానికల్లా ఇవి కేరళలో ప్రవేశించే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ బుధవారం అధికారికంగా ప్రకటించింది.

Updated : 08 Jun 2023 06:32 IST

ఈనాడు, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు దేశంలోకి ప్రవేశించనున్నాయి. శుక్రవారానికల్లా ఇవి కేరళలో ప్రవేశించే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ బుధవారం అధికారికంగా ప్రకటించింది. గతేడాది జూన్‌ ఒకటినే రాగా ఈ ఏడాది ఆలస్యంగా వస్తున్నాయి. గురు, శుక్ర, శనివారాల్లో తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు శాఖ తెలిపింది. బుధవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా మొగలిగిద్ద(రంగారెడ్డి జిల్లా)లో 6.9 సెంటీమీటర్లు, నాంపల్లి(నల్గొండ)లో 5.3, బంట్వారం(వికారాబాద్‌)లో 5.1, దామరగిద్ద(నారాయణపేట)లో 3.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షాలు లేని ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో.. ప్రధానంగా ఆదిలాబాద్‌, కుమురం భీం, మంచిర్యాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశాలున్నట్లు ప్రజలను వాతావరణశాఖ హెచ్చరించింది. బుధవారం పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు, వేడి, ఉక్కపోతలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అత్యధికంగా కరీంనగర్‌ జిల్లా తంగుళ్లలో 45.8, హైదరాబాద్‌లోని ఉప్పల్‌ వద్ద 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

అరేబియాలో ‘బిపోర్‌జాయ్‌’ తుపాను..

మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపోర్‌జాయ్‌’ తుపాను తీవ్రత మరింత పెరిగింది. ఇది జూన్‌ 5న ఏర్పడగా బుధవారానికల్లా తీవ్ర తుపానుగా మారిందని వాతావరణ నిపుణులు తెలిపారు. దీని ప్రభావంతో దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతున్నట్లు అంచనా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు