మాగుంట రాఘవ్‌కు 15 రోజుల మధ్యంతర బెయిలు

దిల్లీ మద్యం విధానం కేసులో తిహాడ్‌ జైలులో ఉన్న వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవ్‌కు దిల్లీ హైకోర్టు 15 రోజుల మధ్యంతర బెయిలు మంజూరుచేసింది.

Published : 08 Jun 2023 05:12 IST

దిల్లీ హైకోర్టు మంజూరు

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం విధానం కేసులో తిహాడ్‌ జైలులో ఉన్న వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవ్‌కు దిల్లీ హైకోర్టు 15 రోజుల మధ్యంతర బెయిలు మంజూరుచేసింది. తన అమ్మమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందున బెయిలు మంజూరు చేయాలని రాఘవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. జస్టిస్‌ చంద్రధారి సింగ్‌ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం బుధవారం పిటిషన్‌ విచారణ చేపట్టింది. రాఘవ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వికాస్‌ పహ్వా వాదనలు వినిపించారు. ‘‘రాఘవ్‌ అమ్మమ్మ బాత్రూంలో కాలు జారి పడడంతో ముక్కుకు గాయమైంది. 83 ఏళ్ల వయసున్న ఆమెతో రాఘవ్‌కు మంచి అనుబంధం ఉంది. ఆమె ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నందున ఆమెను చూసుకునేందుకు రాఘవ్‌కు ఆరు వారాల మధ్యంతర బెయిలు మంజూరు చేయండి. రాఘవ్‌ దాఖలు చేసిన రెగ్యులర్‌ బెయిలు పిటిషన్‌ ఈ నెల 26న విచారణకు రానుంది’’ అని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పహ్వా వాదనలపై ఈడీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.వి.రాజు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘‘రాఘవ్‌ అమ్మమ్మ ముక్కుకు చిన్నపాటి గాయమైంది. ఆమెను చూసుకునేందుకు బంధువులు ఉన్నారు. ఐసీయూలో ఉన్న రోగిని ఇతరులు చూసే వీలుండదు. అక్రమనగదు చలామణి వ్యతిరేక చట్టంలో అరెస్టయిన వారికి ఇలాంటి చిన్న కారణాలతో బెయిలు మంజూరు చేయకూడదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ బాత్రూంలో జారి పడుతున్నారు. వారి బంధువులు మధ్యంతర బెయిలు పిటిషన్లు వేస్తున్నారు. వారం రోజుల్లోనే ఇలాంటిది మూడో కేసు’’ అని వాదనలు వినిపించారు. ఈ దశలో జస్టిస్‌ చంద్రధారి సింగ్‌ జోక్యం చేసుకొని అమ్మమ్మను చూసుకోవడానికి రాఘవ్‌ ఆసక్తి చూపుతున్నారని, భారతీయ సమాజంలో అనుబంధాలకు ప్రాధాన్యం ఉందని వ్యాఖ్యానించారు. రాఘవ్‌కు 15 రోజుల మధ్యంతర బెయిలు మంజూరు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని