AP CID: 14 గంటల్లో మాట మార్చేశారు

‘మార్గదర్శి చిట్‌ఫండ్‌ ఎండీ శైలజాకిరణ్‌ విచారణకు పూర్తిస్థాయిలో సహకరించారు. ఆమె ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా ఉన్నాయి’ అని మంగళవారం రాత్రి 8.30కి చెప్పిన సీఐడీ అదనపు ఎస్పీ రవికుమార్‌ బుధవారం ఉదయం 11 గంటలకు మాట మార్చేశారు.

Updated : 08 Jun 2023 08:51 IST

మంగళవారం రాత్రి ఒక మాట.. బుధవారం ఉదయం కొత్త పాట
మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌ విచారణకు సహకరించలేదని మాట మార్చిన సీఐడీ అదనపు ఎస్పీ
విలేకర్ల ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు

ఈనాడు, అమరావతి: ‘మార్గదర్శి చిట్‌ఫండ్‌ ఎండీ శైలజాకిరణ్‌ విచారణకు పూర్తిస్థాయిలో సహకరించారు. ఆమె ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా ఉన్నాయి’ అని మంగళవారం రాత్రి 8.30కి చెప్పిన సీఐడీ అదనపు ఎస్పీ రవికుమార్‌ బుధవారం ఉదయం 11 గంటలకు మాట మార్చేశారు. ఎవరి ప్రోద్బలమో తెలియదు గానీ, కేవలం 14 గంటల తేడాలో ఆయన పూర్తిగా భిన్నవాదన వినిపించారు. శైలజాకిరణ్‌ తమ దర్యాప్తునకు సహకరించలేదని, అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా దాటవేశారంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఒక్క రాత్రిలోనే ఇలా మాట మార్చేయడం వెనక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయని ప్రశ్నిస్తే.. ఎవరి ఒత్తిళ్లూ లేవంటూనే పొంతనలేని సమాధానాలు చెప్పారు. సీఐడీ ఐజీ సీహెచ్‌.శ్రీకాంత్‌తో కలిసి బుధవారం విలేకర్లతో మాట్లాడిన ఆయన... ప్రశ్నలకు సూటిగా సమాధానాలివ్వలేక ఆద్యంతం తడబడ్డారు.

మంగళవారంసాయంత్రం: ‘‘శైలజాకిరణ్‌ అనారోగ్యంతో బాధపడుతున్నా విచారణకు సహకరించారు. మా ప్రశ్నలకు ఆమెకు తెలిసిన సమాధానాలిచ్చారు. విచారణ పట్ల సంతృప్తి చెందాం’’ అని మార్గదర్శి చిట్‌ఫండ్‌ ఎండీ శైలజాకిరణ్‌ విచారణ ముగిసిన తర్వాత సీఐడీ దర్యాప్తు అధికారి రవికుమార్‌ హైదరాబాద్‌లో విలేకర్లకు చెప్పారు.

బుధవారం ఉదయం: ‘‘విచారణలో భాగంగా మేం అడిగిన ప్రశ్నలకు శైలజాకిరణ్‌ సరైన సమాధానాలు చెప్పలేదు. తనకు ఆరోగ్యం బాగాలేదని, సమాధానాలు తర్వాత చెబుతానంటూ సమయం అడిగారు. 25% ప్రశ్నలకే ఆమె సమాధానమిచ్చారు. మిగతా వాటికి సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. ప్రతిసారీ తనకు ఆరోగ్యం బాగాలేదని చెబుతూ విచారణను జాప్యం చేయిస్తున్నారు’’ అని సచివాలయంలో బుధవారం విలేకర్ల సమావేశంలో అదే అధికారి వ్యాఖ్యానించారు.


హడావుడిలో జనరల్‌గా మాట్లాడానంతే

విలేకర్లు: శైలజాకిరణ్‌ విచారణ పట్ల సంతృప్తి చెందామని, ఆమె విచారణకు పూర్తిగా సహకరించారని మీరే అన్నారు కదా?

రవికుమార్‌: విచారణకు ఒకసారి సహకరించొచ్చు, ఇంకోసారి సహకరించకపోవొచ్చు. విచారణ ముగిసిన తర్వాత మా ఎస్పీని కలిసి మాట్లాడేందుకు నేను వెళ్తుండగా మీడియా ప్రతినిధులు ప్రశ్నించటంతో... ఆ హడావుడిలో నేను జనరల్‌గా మాట్లాడానంతే.


మాట మార్చాలని మీపై ఎవరి  ఒత్తిళ్లు ఉన్నాయి?

విలేకర్లు: మంగళవారం రాత్రి మీరు చెప్పిన మాటలకు, బుధవారం ఉదయం మీరు చేస్తున్న ప్రకటనకు ఏ మాత్రం పొంతనలేదు. ఇలా మాట మార్చటం వెనక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయి? అవి ఏ స్థాయి వారివి?

రవికుమార్‌: నాపైన ఎవరి ఒత్తిళ్లూ లేవు. (ఈ సమాధానం చెప్పేటప్పుడు తడబడ్డారు.)


చందాదారులు ఫిర్యాదు చేయకపోయినా మార్గదర్శిపై వేధింపులేంటి?

విలేకర్లు: చందాదారులు ఎవరూ ఫిర్యాదులు చేయకపోయినా సరే మార్గదర్శిని వేధించటమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ ఎందుకు వ్యవహరిస్తోంది?

రవికుమార్‌: మేం విచారణ చేపట్టిన తర్వాత నుంచి అనేకమంది ఫిర్యాదులు చేస్తున్నారు. వారి వాంగ్మూలాలు రికార్డు చేస్తున్నాం.

విలేకర్లు:మరి ఆ వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు?

రవికుమార్‌: సమాధానం లేదు.


చట్ట పరిధిలోనే దర్యాప్తు చేస్తున్నాం

- రవికుమార్‌

మార్గదర్శి చిట్‌ఫండ్‌పై నమోదు చేసిన కేసులను చట్ట పరిధిలోనే తాము దర్యాప్తు చేస్తున్నామని రవికుమార్‌ చెప్పారు. చిట్‌ఫండ్‌ చందాదారుల ప్రయోజనాలకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకే తాము చట్టానికి అనుగుణంగా పనిచేస్తున్నామన్నారు. విచారణ సమయంలో తాము ఎవర్నీ వేధించలేదని, నిజాల్ని రాబట్టడానికి పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. శైలజాకిరణ్‌కు మరోసారి నోటీసులిచ్చి విచారిస్తామని చెప్పారు. మార్గదర్శి ఆస్తుల ఎటాచ్‌మెంట్‌ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.


లోపలికి అనుమతించటం వరకే సహకరించారు...

విలేకర్లు: శైలజాకిరణ్‌ విచారణకు సహకరించారని మీరే చెప్పారు కదా! ఇప్పుడు ఆమె సహకరించలేదని ఎలా అంటున్నారు?

రవికుమార్‌: మమ్మల్ని లోపలికి అనుమతించటం వరకే సహకరించారు. ఆమె ఓవరాల్‌గా మాట్లాడారు. దర్యాప్తునకు సహకరించలేదు. తనకు ఆరోగ్యం బాగాలేదని, పరీక్షలు చేయించుకోవాలని అన్నారు.

విలేకర్లు: ఆరోగ్యం బాగాలేకున్నా విచారణకు సహకరించారని అన్నారు కదా?

రవికుమార్‌: దర్యాప్తు పరంగా ఆమె మాకు సహకరించలేదు. మేం అడిగిన ప్రశ్నలకు ఆమెకు తెలిసిన సమాధానమే చెబుతున్నారు. తెలిసిన సమాచారం చెప్పట్లేదు. మేనేజర్లను అడిగి చెబుతానంటూ దాటవేస్తున్నారు. (ఇలా అర్థరహితంగా సమాధానమిచ్చారు.)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని