ఆసుపత్రుల రూపు మారేదెప్పుడు?

రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో ‘నాడు-నేడు’ కింద మూడేళ్ల కిందట దశల వారీగా చేపట్టిన నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి.

Published : 08 Jun 2023 05:29 IST

మందకొడిగా సాగుతున్న  ‘నాడు-నేడు’ పనులు

‘‘నాడు-నేడు పథకం కింద ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మారుస్తున్నాం. ఆసుపత్రులకు ఎవరు వెళ్లి చూసినా అక్కడ మార్పు కనిపిస్తోంది. ప్రజాప్రతినిధులు వాటిని సందర్శించాలి. చేసిన మంచి పనుల గురించి ప్రజలకు వివరించాలి’’ అంటూ ముఖ్యమంత్రి జగన్‌ చేసిన ఆర్భాట ప్రకటనలు ప్రచారానికి మాత్రమే పరిమితమౌతున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని ఆసుపత్రుల్లో చేపట్టిన పనులు పరిశీలించినప్పుడు కొన్నిచోట్ల పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నట్లు స్పష్టమవుతుంది.

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో ‘నాడు-నేడు’ కింద మూడేళ్ల కిందట దశల వారీగా చేపట్టిన నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. మొత్తంగా 11,870 ఆసుపత్రుల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టగా.. గుత్తేదారులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వంటి కారణాల వల్ల నిర్మాణాలు ఇప్పటికీ అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. వీటి నిర్మాణాలకు రూ.3,954 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు రూ.1,631 కోట్ల వరకు మాత్రమే బిల్లుల చెల్లింపులు జరిగాయి. నిర్మాణాలు పూర్తికాకపోవడంతో కొన్నిచోట్ల ఇరుకు గదుల్లోనే రోగులకు చికిత్స అందించాల్సి వస్తోంది. 

గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులు జరగక...!

గ్రామ సచివాలయానికి అనుసంధానంగా ఆరోగ్య సంరక్షణ కేంద్రాల నిర్మాణాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ నిధులతో తలపెట్టాయి. వీటిలో కొత్త నిర్మాణాలే ఎక్కువ. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపిలో ఇప్పటివరకు నిర్మాణ పనులే ప్రారంభం కాలేదు. ఒక్కో ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి ఉపాధి హామీ పథకం కింద మొదట్లో రూ.17.50 లక్షలు కేటాయించారు. నిధులు సరిపోవట్లేదని గుత్తేదారులు పనులు ఆపేయడంతో మరో రూ.3.30 లక్షల చొప్పున అదనంగా కేటాయించారు. మొత్తం 10,032 కేంద్రాల నిర్మాణాలు పనులు చేపట్టారు. ఇందులో 8,600 సంరక్షణ కేంద్రాలకు కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నారు. మిగిలిన వాటికి మరమ్మత్తు పనులు సాగుతున్నాయి. ఇందుకయ్యే నిధుల్లో ఉపాధి పథకం హామీ కింద వచ్చే నిధుల్లో 90% కేంద్రం, 10% పంచాయతీరాజ్‌ శాఖ ఖర్చుపెడుతోంది. అలాగే..జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద కొంత నిధులు సమకూరుస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో 38 ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్ని నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయగా గత మూడేళ్లలో సగం భవనాల నిర్మాణాల పనులు కూడా పూర్తవలేదు. ఆరుచోట్ల అసలు పనులే ప్రారంభం కాలేదు. కమలాపురం నియోజకవర్గంలో 60 కేంద్రాలకుగాను 26 మాత్రమే పూర్తయ్యాయి. పులివెందుల నియోజకవర్గంలో 54కు 34 పూర్తయ్యాయి. మిగిలినవి నిర్మాణంలో ఉన్నాయి. పంచాయతీరాజ్‌ ద్వారా ఈ పనులు జరుగుతున్నాయి. ఉపాధి హామీ పథకం కింద ఈ కేంద్రాలకు నిధులు సర్దుబాటులో సమస్యలు తలెత్తుతున్నాయి.

పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిస్థితి..!

పట్టణ వాసులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో చేపట్టిన అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌ సెంటర్ల నిర్మాణాల పనులూ నత్తనడకన సాగుతున్నాయి. ఈ నిర్మాణాలు పూర్తికాకముందే కొన్నిచోట్ల ఫర్నిచర్‌, వ్యాధి నిర్థారణ పరికరాలు ఆసుపత్రులకు చేరుకున్నాయి. వీటిని జాగ్రత్త చేసేందుకు, ఉపయోగించేందుకు సిబ్బంది పడరానిపాట్లు పడుతున్నారు. అనంతపురం జిల్లా చెట్నేపల్లిలోని పట్టణ కేంద్రం నిర్మాణానికి సంబంధించి రూ.60 లక్షల బిల్లులు పెండింగులో ఉండటంతో పనులు నిలిచిపోయాయి. గుత్తి పట్టణంలోని ఆరోగ్య కేంద్రం నిర్మాణం కూడా అసంపూర్తిగా ఉంది. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణం తేరుబజార్‌ ప్రాంతంలోని పట్టణ ఆరోగ్య కేంద్రం పనులూ పూర్తికాలేదు. పలమనేరు పట్టణంలోని గంటావూరు, కాకాతోపు ప్రాంతాల్లో రెండు పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా...నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. గుత్తేదారులకు ప్రభుత్వం నుంచి బిల్లులు సక్రమంగా అందకపోవడంతో పనులు నిలిచిపోయాయి.


ఇతర ఆసుపత్రుల నిర్మాణాల్లోనూ జాప్యమే..!

అమలాపురంలోని ఏరియా ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు రూ.5.76 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. 2020 అక్టోబరులో నిర్మాణ పనులు ప్రారంభమైనా ఇప్పటికీ పూర్తికాలేదు. కావలి ప్రాంతీయ ఆసుపత్రిలో రెండున్నరేళ్ల కిందట నూతన భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఈ పనులూ నత్తనడకన సాగుతున్నాయి.

* ఏలూరు జిల్లా చనుబండలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంజూరుచేసి ఏడాది అవుతున్నా నిర్మాణ పనులు ఇంకా ప్రారంభంకాలేదు. భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని (రూ.25 లక్షలు) దాత అందచేసినా పనుల్లో కదలికలేదు. రూ.2.30 కోట్ల అంచనాతో టెండరు పిలవగా గుత్తేదారులు ముందుకురాలేదు. శ్రీకాకుళం జిల్లా లావేరులో ఉన్న పీహెచ్‌సీ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో 2020లో కూల్చివేశారు. నాడు-నేడు కింద రూ.1.77 కోట్లు మంజూరుచేశారు. ఈ పనులకు 2021 డిసెంబరు 31న శంకుస్థాపన జరిగింది. భవనం పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. గుత్తేదారులకు సుమారు రూ.50 లక్షల వరకు చెల్లింపులు జరగకపోవడంతో పనులు నిలిచిపోయాయి.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు