వరి రైతుకు మిగిలేదేంటి?

ఎకరాకు రూ.45 వేలకు పైగా పెట్టుబడి పెట్టి, వానల్ని, వరదల్ని తట్టుకుని పండిస్తేనే రైతన్న చేతికి ధాన్యం వస్తుంది. దానికి గిట్టుబాటు ధర కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్న విషయాన్ని విస్మరించిన ముఖ్యమంత్రి జగన్‌.. అదేదో ఉచితంగా ఇచ్చినట్లు, ధాన్యం కొనుగోలు ద్వారా రూ.58 వేల కోట్ల సాయం చేశామని చెబుతున్నారు.

Published : 09 Jun 2023 05:10 IST

క్వింటాలు ఉత్పత్తికి రాష్ట్ర లెక్క రూ.2,084
కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రూ.2,183
తేమ, నూకల పేరిట కొనుగోళ్ల వేళ కోత
వర్షాలు, వరదలొస్తే మరింత నష్టం

ఈనాడు, అమరావతి: ఎకరాకు రూ.45 వేలకు పైగా పెట్టుబడి పెట్టి, వానల్ని, వరదల్ని తట్టుకుని పండిస్తేనే రైతన్న చేతికి ధాన్యం వస్తుంది. దానికి గిట్టుబాటు ధర కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్న విషయాన్ని విస్మరించిన ముఖ్యమంత్రి జగన్‌.. అదేదో ఉచితంగా ఇచ్చినట్లు, ధాన్యం కొనుగోలు ద్వారా రూ.58 వేల కోట్ల సాయం చేశామని చెబుతున్నారు. తమ ప్రభుత్వం వచ్చాకే రైతులు సంతోషంగా ఉన్నారంటున్న ఆయన.. గతేడాది ఖరీఫ్‌, రబీలో సాధారణ విస్తీర్ణం కంటే 9 లక్షల ఎకరాల్లో వరి సాగు ఎందుకు తగ్గిందో చెప్పలేదు. ధాన్యం అమ్మాలంటే మిల్లర్లకు ఎదురు సొమ్ము చెల్లించాల్సిన దుస్థితి ఏపీలోనే ఎందుకుందో సెలవివ్వలేదు. బోనస్‌ ఇచ్చి ఆదుకోవాలన్న ఆలోచనే మానుకున్నారు.

ఎకరా వరి సాగుకు రైతు కుటుంబ శ్రమ కాకుండానే రూ.45 వేలకు పైగా పెట్టుబడి అవుతోంది. క్వింటాలు ఉత్పత్తికి రూ.2,084 ఖర్చవుతుందని రాష్ట్ర ప్రభుత్వమే అంచనా వేసింది. అయినా కేంద్రం నిర్ణయించిన మద్దతు ధర రూ.2,183 మాత్రమే. ఇందులోనూ తేమ, నూకల పేరుతో క్వింటాలుకు రూ.300-400 వరకు కోతలు విధిస్తున్నారు. వర్షాలు, వరదలొచ్చి వడ్లు రంగు మారినా, మొలకలు వచ్చినా ధరలు తగ్గిస్తున్నారు. అందుకే అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లో వరి సాగుకు రైతులు వెనకాడుతున్నారు. ధాన్యాగారమైన గోదావరి జిల్లాల్లోనే ఖరీఫ్‌లో వరి సాగుకు విరామం ప్రకటిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నామని, ఈ కొత్త విధానంతో రైతులంతా సంతోషంగా ఉన్నారంటున్న ప్రభుత్వం.. కుంగిపోతున్న అన్నదాతల ఆవేదనను పట్టించుకోవడం లేదు.

పెట్టుబడి వ్యయమే అధికం

2023-24 సంవత్సరానికి క్వింటాలు వరికి మద్దతు ధరగా రూ.3,126 చొప్పున ఇవ్వాలని వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌(సీఏసీపీ)కు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. అయితే కేంద్రం రూ.2,183 మాత్రమే నిర్ణయించింది. అంటే రాష్ట్రం ప్రతిపాదించిన ధర కంటే రూ.943 తక్కువే.

* క్వింటాలు ఉత్పత్తికి రూ.2,084 ఖర్చవుతుందని రాష్ట్ర ప్రభుత్వం సీఏసీపీకి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. ఎకరానికి 24 క్వింటాళ్ల దిగుబడిగా నిర్ణయించి.. ఈ లెక్కలు వేసింది.

* ఖరీఫ్‌ పంటనే పరిశీలిస్తే.. 2019-20లో ఎకరాకు 21 క్వింటాళ్లు, 2020-21లో 16.89, 2021-22లో 17.21 క్వింటాళ్ల దిగుబడే లభించింది. గతేడాది కూడా ముందస్తు అంచనాల ప్రకారం 20.78 క్వింటాళ్లుగా గుర్తించారు. అంటే ప్రభుత్వం చెబుతున్న దిగుబడి గత నాలుగేళ్లలో ఎప్పుడూ లేదు.

* ఖరీఫ్‌లో వాస్తవ పెట్టుబడి ఎకరానికి రూ.50 వేల వరకు అవుతుంది. సగటున 20 క్వింటాళ్ల దిగుబడి లెక్కన చూస్తే.. క్వింటాలు ఉత్పత్తికి రూ.2,500 చొప్పున ధర దక్కాలి. కేంద్రం నిర్ణయించిన రూ.2,183కు అమ్ముకుంటే క్వింటాలుపై రైతు రూ.317 నష్టపోతున్నారు. ఎకరాకు 30 బస్తాల ధాన్యం పండిస్తే తేమ, నూక పేరుతో రూ.12వేల వరకు వ్యాపారులే దోచుకుంటున్నారు. ప్రభుత్వం కూడా రైతుల్ని వ్యాపారులకు వదిలేసి చోద్యం చూస్తోంది.


బోనస్‌తో కొంతైనా భరోసా

వరి సాగుకు అధిక పెట్టుబడి అయ్యే రాష్ట్రాల్లో తెలంగాణ తర్వాతి స్థానం ఆంధ్రప్రదేశ్‌దే. 2021-22 గణాంకాల ప్రకారం తెలంగాణలో ఎకరాకు రూ.45,306 ఖర్చవుతుంటే.. ఏపీలో రూ.41,423 అవుతోంది. కేరళలో రూ.40,364 ఖర్చవుతోంది. అయినా అక్కడి ప్రభుత్వం క్వింటాలుపై రూ.780 వరకు బోనస్‌ ఇస్తోంది. తమిళనాడులోనూ రూ.100 వరకు ఇస్తున్నారు.


అమ్మాలంటే అగచాట్లే

తేమ, నూకశాతం పేరుతో క్వింటాలుకు రూ.200 నుంచి రూ.400 వరకు వ్యాపారులు దోచుకుంటున్నారు. ధాన్యం సేకరణ ద్వారా లబ్ధి పొందే వారిలో సన్నకారు రైతులు కేవలం 22% మంది మాత్రమే ఉన్నారు. అదే తెలంగాణలో 71.5%, ఛత్తీస్‌గఢ్‌లో 53.7% మందికి లబ్ధి కలుగుతోంది. గ్రామాల్లో ఎకరా, రెండెకరాలను కౌలుకు తీసుకుని వరి పండించే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని అర్థమవుతోంది. వీరి పేరుతో యజమానులే అమ్ముకుంటున్నారు. అందుకే అయిదెకరాలు, ఆపై విస్తీర్ణమున్న రైతుల సంఖ్య అధికంగా ఉంది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు