Raghu Rama: నా వైద్య పరీక్షల నివేదికలను ధ్వంసం చేయబోతున్నారు
కస్టడీలో ఉన్న తనను ఏపీ సీఐడీ పోలీసులు చిత్రహింసలు పెట్టిన ఘటనలో న్యాయస్థానం ఆదేశాల మేరకు నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికలు, ఇతర దస్త్రాలను భద్రపరిచేలా గుంటూరు గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి తదితరులను ఆదేశించాలంటూ ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది.
వాటిని భద్రపరిచేలా ఆదేశాలివ్వండి
హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ రఘురామ
ఈనాడు, అమరావతి: కస్టడీలో ఉన్న తనను ఏపీ సీఐడీ పోలీసులు చిత్రహింసలు పెట్టిన ఘటనలో న్యాయస్థానం ఆదేశాల మేరకు నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికలు, ఇతర దస్త్రాలను భద్రపరిచేలా గుంటూరు గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి తదితరులను ఆదేశించాలంటూ ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. పూర్తి వివరాలను రాతపూర్వకంగా కోర్టుకు సమర్పించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలకృష్ణారావు అధికారులను గురువారం ఆదేశించారు. విచారణను ఈ నెల 13కి వాయిదా వేశారు. కస్టడీలో ఉన్న తనను సీఐడీ పోలీసులు కొట్టారని ఎంపీ రఘురామకృష్ణరాజు.. రిమాండ్‌కు హాజరుపరిచిన సందర్భంగా 2021 మే 15న గుంటూరు ఆరో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయాధికారి.. వైద్య పరీక్షల కోసం ఎంపీని గుంటూరు జీజీహెచ్‌కు, ఆ తర్వాత గుంటూరు రమేశ్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆదేశించిన విషయం తెలిసిందే. తనను పరీక్షించిన కార్డియాలజీ, రేడియాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్ విభాగాధిపతులు 2021 మే 15, 16 తేదీల్లో ఇచ్చిన వైద్య పరీక్షల నివేదికలు, నోట్ ఫైళ్లను కనుమరుగు చేయాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ చూస్తున్నారంటూ ఎంపీ రఘురామ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. జీజీహెచ్ వైద్యులు పరీక్షలు నిర్వహించి ఇచ్చిన ఆ నివేదికల్లో తన ఒంటిపై గాయాలున్నాయని పేర్కొన్నారని తెలిపారు. ఆ వివరాలను ఇప్పటి వరకు జీజీహెచ్ సూపరింటెండెంట్ బయటపెట్టలేదన్నారు. అంతేకాక 16న తప్పుడు నివేదిక ఇచ్చారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.