హాథీరాంజీ మఠం మహంతు సస్పెన్షన్‌

తిరుపతి హాథీరాంజీ మఠానికి మహంతుగా ఉన్న అర్జున్‌ దాస్‌ను సస్పెండ్‌ చేస్తూ ధార్మిక పరిషత్‌ నిర్ణయం తీసుకుందని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు.

Updated : 09 Jun 2023 05:42 IST

లక్ష్మీ రాజశ్యామల యాగ ఫలితమే కేంద్ర నిధులు
దేవదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ

ఈనాడు, అమరావతి: తిరుపతి హాథీరాంజీ మఠానికి మహంతుగా ఉన్న అర్జున్‌ దాస్‌ను సస్పెండ్‌ చేస్తూ ధార్మిక పరిషత్‌ నిర్ణయం తీసుకుందని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. సచివాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘మఠానికి మహంతుగా ఉన్న వ్యక్తి సన్యాసిగా ఉండాలి. కానీ, అర్జున్‌ దాస్‌కు వివాహమై, పిల్లలున్నారు. మఠం ఆస్తులను అన్యాక్రాంతం చేసి, ఇష్టం వచ్చినట్లు లీజులకు ఇస్తున్నారు. ఆయనపై చర్యలకు సిద్ధపడగా.. అర్జున్‌ దాస్‌ కోర్టును ఆశ్రయించారు. ధార్మిక పరిషత్‌ ద్వారా ఆయనపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం సూచించడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నాం. ఆయన స్థానంలో మరొకర్ని నియమిస్తాం’ అని మంత్రి తెలిపారు.‘ఇటీవల విజయవాడలో నిర్వహించిన లక్ష్మీ రాజశ్యామల యాగం ఫలితంగానే కేంద్రం నుంచి నిధులు వచ్చాయని చెప్పడానికి మంత్రిగా చొరవ తీసుకుంటున్నా’’ అని తెలిపారు.

సీఎం జగన్‌ ధనవంతుడే అయినా..

సీఎం జగన్‌ మొదటి నుంచి ధనవంతుడైనప్పటికీ పేదల పక్షాన ఉంటున్నారని పేర్కొన్నారు. వంగవీటి రాధ ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. మద్యం దుకాణాలు, ఇసుక లావాదేవీల్లో డిజిటల్‌ విధానం అమలు చేయకపోవడం గురించి తనకు తెలియదని పేర్కొన్నారు. కాపు కులాన్ని మళ్లీ ముంచేందుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఓ కాపు నాయకుడిగా తాను జనసేనలో చేరనని మంత్రి స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు