అసౌకర్యం కలగకూడదని కమిటీని పంపుతున్నా

మక్కాకు వెళ్లే యాత్రికులకు ఇబ్బందులు, అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతోనే హజ్‌ కమిటీని మీతో పంపుతున్నామని హజ్‌ యాత్రికులతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

Updated : 09 Jun 2023 06:10 IST

రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరగాలని ప్రార్థించాలి
హజ్‌ యాత్రికులతో సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: మక్కాకు వెళ్లే యాత్రికులకు ఇబ్బందులు, అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతోనే హజ్‌ కమిటీని మీతో పంపుతున్నామని హజ్‌ యాత్రికులతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా నంబూరు మదర్సాలో తాత్కాలిక హజ్‌హౌస్‌ వద్ద మక్కా వెళుతున్న యాత్రికులతో గురువారం సాయంత్రం సీఎం జగన్‌ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... హజ్‌లో  ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే హజ్‌ కమిటీ దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా ఎప్పటికప్పుడు మీ సమస్యలను తెలుసుకుంటారని, సంతోషంగా యాత్ర పూర్తి చేసుకుని రావాలన్నారు. ‘యాత్రికులు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. మీరు అక్కడికి వెళ్లి నమాజు చేసేప్పుడు రాష్ట్రాన్ని గుర్తుంచుకుని, ప్రభుత్వానికి అల్లా దీవెనలు ఉండాలని దువా చేయాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా మాట్లాడుతూ హజ్‌యాత్రికులకు దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రీ చేయని విధంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నారని అన్నారు. అనంతరం హజ్‌ యాత్రికులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం జగన్‌ పాల్గొన్నారు. మతపెద్దలు ముఖ్యమంత్రిని ఆశీర్వదించారు. సీఎం వెంట మండలి ఉపాధ్యక్షురాలు జకియా ఖానం, ఎమ్మెల్యేలు ముస్తఫా, రోశయ్య, ఎమ్మెల్సీ రహంతుల్లా, జడ్పీ ఛైర్‌పర్సన్‌ హెనీక్రిస్టినా, డిప్యూటీ మేయర్‌ సజీల, జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఇంతియాజ్‌ తదితరులు ఉన్నారు. రాత్రి 7 గంటల సమయంలో సీఎం మదర్సా నుంచి వెనుదిరిగారు. అయితే సీఎం వెళ్లిపోయే వరకు మదర్సా నుంచి యాత్రికులతో పాటు ఇతరులను బయటకు రానీయకుండా పోలీసులు నిలువరించారు. దీంతో కొందరు ముస్లిం మత పెద్దలు తమకు నమాజు సమయం అవుతోందని, ఎంతసేపు గేట్లు మూసి ఉంచుతారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలీసులు వారిని బయటకు వదిలారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని