Botsa Satyanarayana: సప్లిమెంటరీలో ఫెయిల్‌ అయినా మళ్లీ తరగతులకు వెళ్లొచ్చు

పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలతోపాటు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు మళ్లీ చదువుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Updated : 09 Jun 2023 08:09 IST

పదోతరగతి, ఇంటర్‌ విద్యార్థులకు అవకాశం
జూన్‌ 12నే విద్యా కానుక కిట్ల పంపిణీ
మంత్రి బొత్స సత్యనారాయణ

ఈనాడు, అమరావతి: పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలతోపాటు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు మళ్లీ చదువుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విద్యార్థులు పాఠశాల, కళాశాలలకు వెళ్లి చదువుకోవచ్చని, అయితే, అన్ని సబ్జెక్టులూ చదవాల్సి ఉంటుందని వెల్లడించారు. సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైతే కంపార్ట్‌మెంటల్‌ అని ఇస్తుండగా.. మళ్లీ బడికి వెళ్లి మొత్తం సబ్జెక్టులు చదివితే రెగ్యులర్‌గా ఉత్తీర్ణులైనట్లు పరిగణిస్తారని తెలిపారు. పాఠశాలల్లో అమలు చేయనున్న కార్యక్రమాలను విజయవాడలో గురువారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌, అధికారులు సురేష్‌ కుమార్‌, కాటమనేని భాస్కర్‌, శ్రీనివాసరావు, నిధి మీనా, శేషగిరిబాబులతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు.

‘పాఠశాలల పునఃప్రారంభం రోజునే విద్యాకానుక అందిస్తాం. ఒక్కో విద్యార్థికి రూ.2,600 విలువ చేసే కిట్‌ ఇస్తున్నాం. బ్యాగ్‌లు ఇప్పటి వరకు 70శాతం చేరాయి. మరో 30శాతం రెండు, మూడు రోజుల్లో పాఠశాలలకు చేరతాయి. అమ్మఒడి లబ్ధిదారుల జాబితాను ఈనెల 12 నుంచి 22 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచుతారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది జాబితా సిద్ధమవుతుంది. ఈనెల 28న అమ్మఒడి పథకం డబ్బులను సీఎం జగన్‌ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. విద్యార్థుల్లో ఆంగ్ల భాష నైపుణ్యం పెంచేందుకు టోఫెల్‌ పరీక్ష నిర్వహించబోతున్నాం. విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపిన పాఠశాలల ఉపాధ్యాయులను అమెరికాకు శిక్షణకు పంపిస్తాం. 3-5 తరగతులకు టోఫెల్‌ ప్రాథమిక, 6-9 తరగతులకు జూనియర్‌ నిర్వహిస్తాం. ఆ తర్వాత ఇంటర్మీయట్‌కు స్యాట్‌, డిగ్రీలో జీఆర్‌ఈ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు.

పాఠశాల స్థాయిలోనూ సత్కారం: ‘పదోతరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను 12న పాఠశాల స్థాయిలో సన్మానిస్తాం. మొదటి స్థానానికి రూ.3వేలు, ద్వితీయ రూ.2వేలు, తృతీయ రూ.వెయ్యి నగదు బహుమతి అందిస్తాం. రాష్ట్ర స్థాయిలో 20న నిర్వహిస్తాం. ఇంటర్మీడియట్‌ ప్రతి గ్రూపు నుంచి ముగ్గురిని చొప్పున సత్కరిస్తున్నాం. ‘నాడు-నేడు’ మొదటి విడత పూర్తయిన పాఠశాలల్లో 30వేల ఇంట్రాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌(ఐఎఫ్‌పీ), 1-5 తరగతులకు 10వేల స్మార్ట్‌ టీవీలు ఏర్పాటు చేస్తున్నాం. జులై 12లోపు సరఫరా పూర్తవుతుంది. ఈ ఏడాది డిసెంబరులో ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తాం’ అని మంత్రి బొత్స వివరించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని