భోరుమంటున్న బోర్ల పథకం

బోరు వేసుకుంటే తప్ప నీటి సదుపాయం లేని రైతులకు అండగా నిలబడేందుకు 2 లక్షల బోర్లు ఉచితంగా తవ్విస్తాం.

Updated : 09 Jun 2023 06:07 IST

48 నెలల్లో తవ్విస్తామని చెప్పినది.. 2 లక్షలు
32 నెలల్లో మోటార్లతో సహా సిద్ధం చేసినవి 25
ఇప్పటివరకు తవ్విన బోర్లు 21 వేలే
ఇలాగైతే రైతుల జల‘కల’ తీరేదెప్పటికి సీఎం సారూ?


బోరు వేసుకుంటే తప్ప నీటి సదుపాయం లేని రైతులకు అండగా నిలబడేందుకు 2 లక్షల బోర్లు ఉచితంగా తవ్విస్తాం. కేసింగ్‌ పైపులూ ఇస్తాం. వచ్చే నాలుగేళ్లలో ఇందుకోసం రూ.2,340 కోట్లు ఖర్చుచేస్తాం. చిన్న, సన్నకారు రైతుల భూముల్లో తవ్వించే బోర్లకు మోటార్లు కూడా ఉచితంగా బిగిస్తాం. వాటికి మరో రూ.1,600 కోట్లు ప్రభుత్వం ఖర్చుచేస్తుంది. బోర్లు తీయించేందుకు నియోజకవర్గానికో రిగ్గును ఏర్పాటుచేస్తున్నాం’

2020 సెప్టెంబరు 28న వైఎస్‌ఆర్‌ జలకళ పథకం ప్రారంభ కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి సీఎం జగన్‌ అన్న మాటలివి.


ఈనాడు, అమరావతి: సీఎం ప్రకటించినప్పటి నుంచి ఈ 32 నెలల్లో మోటార్లు బిగించి సిద్ధం చేసిన బోర్లు.. అక్షరాలా 25 మాత్రమే. సగటున నెలకు ఒకటి కూడా పూర్తిచేయలేదు. 32 నెలలకు 25 బోర్లు పూర్తి చేస్తే... మిగిలిన 1,95,975 బోర్లు తవ్వడానికి ఎన్ని వేల సంవత్సరాలు పడుతుందో తెలుసా? దరఖాస్తు చేసినవారిలో ఎక్కువమంది సన్న, చిన్నకారు రైతులే ఉంటారు కనుక అన్ని బోర్లకూ మోటార్లు బిగించాలి. తవ్విన బోర్లు కూడా.. 21,150 మాత్రమే. అంటే నెలకు 660 బోర్లు తవ్వారు. ఇదే వేగంతో వెళ్తే.. మిగిలిన 1,78,850 బోర్లు తవ్వేందుకు 22 ఏళ్లు పడుతుంది. అంటే, ఎన్నికలు జరిగేలోపు మరో 6,600 కంటే బోర్లు అందుబాటులోకి రావు. పైపెచ్చు, వేసవిలో వేయాల్సిన బోర్లకు.. జగనన్న రివర్స్‌ ప్రభుత్వం వర్షాకాలంలో తవ్వేలా టెండర్లు పిలిచింది. వర్షాకాలంలో నీరు చేరిన పంటభూముల్లో బోర్లు తీయడం సాధ్యమేనా? టెండర్లు పిలిచాం అనిపించుకోవడం తప్పితే రైతులకు ఉపయోగం ఏమిటి?

మొదటి నుంచి నిర్లక్ష్యమే

జలకళ పథకం అమలు మొదటి నుంచి అస్తవ్యస్తంగానే ఉంది. బోర్ల తవ్వకాల పనులను ప్రైవేటు రిగ్గు యజమానులకు అప్పగించారు. పథకం కోసం 2,30,758 మంది రైతులు దరఖాస్తులు చేశారు. ఏడాది వరకు పనులు బాగానే సాగాయి. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, ప్రభుత్వం ఇస్తున్న ధర గిట్టుబాటు కాకపోవడంతో గత ఏడాది ఏప్రిల్‌ నుంచి చాలా జిల్లాల్లో గుత్తేదారులు పనులు నిలిపివేశారు. ఒప్పందకాలం ముగియడంతో గత నెలలో మరోసారి టెండర్లు పిలిచారు. ఈ ప్రక్రియ 10-15 రోజుల్లో పూర్తిచేసినా తర్వాత వర్షాలు మొదలవుతాయి. అప్పుడు పనులు చేయలేరు. ఆ తర్వాత ఎన్నికల వేడి మొదలవుతుంది. నోటిఫికేషన్‌ వెలువడితే పనులు ఆపేయాల్సిందే.

రైతులకు చీకట్లే మిగిలాయి

పేద రైతుల భూముల్లో బోర్ల తవ్వకం నుంచి మోటార్లు అమర్చడం, విద్యుత్తు సౌకర్యం కల్పించడం వరకు అన్నీ ఉచితమేనన్న ప్రభుత్వం ఆ తర్వాత మాట మార్చింది. విద్యుత్తు సౌకర్యం ఖర్చంతా రైతులే భరించాలనడంతో చాలా జిల్లాల్లో పథకం అమలు నీరుగారిపోతోంది. విద్యుత్తు సౌకర్యానికి ఒక్కో బోరుకు రూ.5-10 లక్షలు అవసరమని ఇంజినీర్లు చెప్పడంతో రైతులు వెనకడుగు వేస్తున్నారు. జలకళ పథకం తమ జీవితాల్లో వెలుగులు నింపుతుందని భావించామని, చివరికిలా చీకట్లు మిగుల్చుతుందని ఊహించలేదని రైతులు అంటున్నారు.

సీఎం సొంత జిల్లాలో దరఖాస్తులు 16,606... తవ్విన బోర్లు 1,130

ఉమ్మడి కడప జిల్లాలోనూ వైఎస్‌ఆర్‌ జలకళ పథకం అమలు అధ్వానంగా ఉంది. వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో బోర్ల తవ్వకాలకు రైతుల నుంచి 16,606 దరఖాస్తులొచ్చాయి. ఇప్పటివరకు 1,130 బోర్లే తవ్వారు. ఇంకొన్ని జిల్లాల్లో అయితే రెండంకెల్లోనే తవ్వారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని