EPFO - Higher pension: మారనున్న ‘ఈపీఎఫ్‌ పింఛను’ సూత్రం!

ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చే వేతన జీవులకు పదవీ విరమణ తర్వాత అందించే అధిక పింఛను లెక్కింపు గణన విధానం మారనుంది.

Updated : 10 Jun 2023 07:34 IST

పలు అంశాలను పరిశీలిస్తున్న ఈపీఎఫ్‌వో
అధిక పింఛను కనీసం 25% తగ్గే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చే వేతన జీవులకు పదవీ విరమణ తర్వాత అందించే అధిక పింఛను లెక్కింపు గణన విధానం మారనుంది. ఇప్పటికే పింఛను అర్హత వేతన లెక్కింపుపై స్పష్టత ఇచ్చిన ఈపీఎఫ్‌వో త్వరలోనే పింఛను లెక్కించే సూత్రాన్ని ప్రకటించనుంది. ప్రస్తుత విధానంలో అధిక పింఛను లెక్కించి మంజూరు చేస్తే తీవ్ర ఆర్థిక భారంతో ఉద్యోగుల పింఛను పథకం(ఈపీఎస్‌) మనుగడే ప్రశ్నార్థకమయ్యే అవకాశాలున్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఈపీఎస్‌ నిల్వలపై భవిష్యత్తులో ప్రభావం పడకుండా, ఉద్యోగులకు సామాజిక న్యాయమూ దక్కేలా నూతన లెక్కింపు సూత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆలోచన చేస్తోంది. కొత్త గణన ప్రకారం ఉద్యోగులకు లభించే అధిక పింఛను కనీసం 25% తగ్గే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుత లెక్కింపు ఇలా...

అధిక పింఛను అర్హత కలిగిన ఉద్యోగుల పింఛను అర్హత వేతనం (మూలవేతనం+డీఏ కలిపి)పై వారం రోజుల క్రితం ఈపీఎఫ్‌వో స్పష్టతిచ్చింది. దీని ప్రకారం అధిక పింఛనుకు అర్హత పొందిన ఉద్యోగి... 2014 సెప్టెంబరు ఒకటో తేదీకి ముందు పదవీ విరమణ చేస్తే చివరి 12 నెలల వేతన సగటును పింఛను అర్హత వేతనంగా లెక్కిస్తామంది. 2014 సెప్టెంబరు 1 తర్వాత పదవీ విరమణ పొందేవారికి చివరి 60 నెలల (అయిదేళ్లు) వేతన సగటు తీసుకోనుంది. ప్రస్తుతం... పింఛను అర్హత వేతనం X సర్వీసు కాలం /70గా తీసుకుని పింఛను లెక్కిస్తున్నారు. అయితే... గరిష్ఠ వేతన పరిమితి దాటి, అధిక పింఛనుకు అర్హత పొందేవారికి ప్రత్యేక ఫార్ములా ఉండాలన్న చర్చ నడుస్తోంది. ఈ మేరకు అధిక పింఛనుకు ఉమ్మడి ఆప్షన్‌ తీసుకునే సమయంలోనే... తాము నిర్ణయించే పింఛను లెక్కింపు సూత్రానికి చందాదారులు కట్టుబడి ఉండాలన్న షరతును విధిస్తూ ఈపీఎఫ్‌వో దరఖాస్తులను స్వీకరించింది. ఈ నేపథ్యంలో పింఛను లెక్కింపు సూత్రం ఖరారు కోసం జరుగుతున్న చర్చలో రెండు అంశాలు తెరపైకి వచ్చాయి. ఉద్యోగి సర్వీసు సగటు వేతనాన్ని పింఛను అర్హత వేతనంగా నిర్ణయించాలన్న చర్చ జరిగినప్పటికీ, అది నిబంధనలకు విరుద్ధమని, ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందని వెనక్కి తగ్గింది. తాజాగా లెక్కింపు కోసం... పింఛను అర్హత వేతనాన్ని సర్వీసు కాలం (ఏళ్లలో)తో గణించి, ఆ మొత్తాన్ని 90తో భాగించే విషయాన్ని పరిశీలిస్తోంది. తద్వారా ఈపీఎస్‌పై భారాన్ని తగ్గించడంతోపాటు ఉద్యోగులకు సామాజిక న్యాయాన్ని అందించవచ్చని అంచనా వేస్తోంది.

బిల్లుల రూపకల్పనకు కమిటీలు

సామాజిక భద్రత బిల్లు-2020 నిబంధనల్లో కేంద్రం ఉద్యోగుల భవిష్యనిధి పథకం(ఈపీఎఫ్‌ఎస్‌), ఉద్యోగుల పింఛను పథకం(ఈపీఎస్‌), ఉద్యోగుల డిపాజిట్‌ లింక్డ్‌ బీమా పథకం(ఈడీఎల్‌ఐఎస్‌) బిల్లులను రూపొందించాల్సి ఉంది. ఈ మూడింటికి ముసాయిదా బిల్లులను రూపొందించేందుకు ఈపీఎఫ్‌వో వేర్వేరు కమిటీలను నియమించింది. ఈ కమిటీలు ఈనెల 23 నాటికి ముసాయిదా బిల్లులను రూపొందించనుంది. ప్రస్తుతమున్న నిబంధనల్లో 90% వరకు యథాతథంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏమైనా మార్పులు జరిగినా స్వల్పంగానే ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని