దిల్లీ మద్యం కేసులో మాగుంట రాఘవ్‌ బెయిల్‌ కుదింపు

దిల్లీ మద్యం కేసులో అరెస్ట్‌ అయిన మాగుంట రాఘవ్‌కు దిల్లీ హైకోర్టు ఇచ్చిన రెండు వారాల మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు అయిదు రోజులకు కుదించింది.

Updated : 10 Jun 2023 06:04 IST

మోసపూరితంగా పొందారన్నఈడీ వాదనతో సుప్రీం నిర్ణయం
2 వారాల నుంచి 5 రోజులకు తగ్గింపు
12న లొంగిపోవాలని ఆదేశం

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో అరెస్ట్‌ అయిన మాగుంట రాఘవ్‌కు దిల్లీ హైకోర్టు ఇచ్చిన రెండు వారాల మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు అయిదు రోజులకు కుదించింది. నిందితుడు ఎప్పుడో చనిపోయిన తన నానమ్మకు ఆరోగ్యం సరిగా లేదని హైకోర్టును తప్పుదోవ పట్టించి బెయిల్‌ పొందారని, అందువల్ల దాన్ని రద్దు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చేసిన వాదనలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ రాజేష్‌ బిందల్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12న నిందితుడిని లొంగిపోవాలని శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఫిబ్రవరి 10న అరెస్ట్‌ చేసిన మాగుంట రాఘవ్‌కు గత బుధవారం దిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీ దాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి, గురువారం ధర్మాసనం ముందు మెన్షన్‌ చేసింది. ప్రతివాదుల వాదనలు వినకుండా తాము ఉత్తర్వులు జారీ చేయబోమని పేర్కొంటూ జస్టిస్‌ అనిరుద్ధబోస్‌ ఈ కేసును శుక్రవారానికి వాయిదా వేశారు. తాజాగా ధర్మాసనం ముందు వాదనలు ప్రారంభమైన వెంటనే ఈడీ తరఫున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీరాజు వాదనలు వినిపిస్తూ.. రాఘవ్‌ బెయిల్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు.

‘సాధారణ బెయిల్‌ కోసం ఆయన పెట్టుకున్న దరఖాస్తును ట్రయల్‌ కోర్టు తిరస్కరించింది. తర్వాత తన సతీమణి ఆరోగ్యం బాగోలేదని మధ్యంతర బెయిల్‌ కోసం చేసుకున్న దరఖాస్తునూ ట్రయల్‌ కోర్టు కొట్టేసింది. దానిపై హైకోర్టుకు వెళ్లినప్పుడు భార్య అనారోగ్యం గురించి మదింపు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో వెంటనే వాళ్లు ఆ బెయిల్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. తరువాత గ్రాండ్‌ మదర్‌కు బాగాలేదని చెప్పి బెయిల్‌ కోసం మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆమె నానమ్మ కాదన్న వాస్తవాన్ని దాచిపెట్టారు. బహుశా అమ్మమ్మ కావొచ్చేమో.. నానమ్మ ఎప్పుడో చనిపోయింది. అందుకు సంబంధించిన మరణ ధ్రువీకరణపత్రం కూడా మా వద్ద ఉంది. ఈ రోజుల్లో మధ్యంతర బెయిళ్ల కోసం ధనవంతులైన నిందితులు స్నానాలగదుల్లో పడిపోవడం ఫ్యాషన్‌గా మారింది. దిల్లీ మాజీ మంత్రి సత్యేంద్రజైన్‌ కూడా స్నానాలగదిలో పడిపోయారు. ఇప్పుడు వీరి గ్రాండ్‌మదర్‌ కూడా అలాగే పడిపోయిందని చెబుతున్నారు’ అని పేర్కొన్నారు.భార్య అనారోగ్యంగా ఉన్నట్లు తొలుత చెప్పారని, దాన్ని మదింపు చేయాలని హైకోర్టు చెప్పిన వెంటనే ఆ పిటిషన్‌ ఉపసంహరించుకొని.. ఇప్పుడు నానమ్మ అనారోగ్య కథనం తెరపైకి తెచ్చారని వాదించారు. భార్య అనారోగ్యం నిజమైతే పిటిషన్‌ ఎందుకు ఉపసంహరించుకున్నారని ప్రశ్నించారు.

డబ్బు సంచులు ముట్టజెప్పడం వల్లే అనారోగ్య నివేదికలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇది మోసపూరితమైన కేసని, గాయాలు కూడా తీవ్రంగా లేవన్నారు. నిందితుడికి ట్యాంపరింగ్‌ చరిత్ర కూడా ఉందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. రాఘవ్‌ తరఫున వాదించిన సీనియర్‌ న్యాయవాది అమిత్‌ దేశాయ్‌ మాత్రం తాము హైకోర్టులో నానమ్మ అని చెప్పలేదని, ఈడీనే అలా వాదనలు వినిపించిందని పేర్కొన్నారు. అప్పుడు జస్టిస్‌ రాజేష్‌ బిందల్‌ జోక్యం చేసుకుంటూ నానమ్మ కాదని ఎక్కడ చెప్పారో చూపాలన్నారు. అప్పుడు న్యాయవాది ‘గ్రాండ్‌మదర్‌’ అని పేర్కొన్నామని చెప్పగా.. ఆ వాదనతో జస్టిస్‌ రాజేష్‌ బిందల్‌ ఏకీభవించలేదు. గ్రాండ్‌మదర్‌ అంటే నానమ్మేనన్నారు. అప్పుడు రాఘవ్‌ తరఫు న్యాయవాది స్పందిస్తూ ఇంగ్లిష్‌ తమాషా భాష అని, అందులో అన్నింటికీ ఒకే పదం ఉంటుందని వాదించారు. జస్టిస్‌ రాజేష్‌ బిందల్‌ ఆ వాదనలను తోసిపుచ్చుతూ పిటిషన్‌లో పెటర్నల్‌, మెటర్నల్‌ అని చెప్పి ఉండాల్సిందన్నారు. తరువాత రాఘవ్‌ తరఫు న్యాయవాది కొనసాగిస్తూ ఆమెను చూసుకోవడానికి ప్రస్తుతం రాఘవ్‌ తప్ప ఇంకెవ్వరూ లేరన్నారు.

రాఘవ్‌ సతీమణి మే నెలలో ఆత్మహత్యకు ప్రయత్నించిందని, ఆ నేపథ్యంలో మధ్యంతర బెయిల్‌ అడిగితే కోర్టు దాన్ని తిరస్కరించిందని చెప్పారు. ఆ వాదనలను ఈడీ న్యాయవాది తోసిపుచ్చారు. ఆమె అనారోగ్యం గురించి పరిశీలన జరపమని కోర్టు చెప్పడంతో వారే పిటిషన్‌ ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. అమ్మమ్మను చూసుకోవడానికి ఆమె కుమార్తె లేదా? అని న్యాయమూర్తి జస్టిస్‌ బిందల్‌ ప్రశ్నించగా... ఆమె ఇప్పుడు ఆత్మహత్యకు ప్రయత్నించిన తన కోడలిని చూసుకుంటోందని, అందువల్ల రాఘవ్‌ చూసుకోవాల్సి వస్తోందని చెప్పారు. ఈ వాదనలను ఏఎస్‌జీ రాజు తోసిపుచ్చారు. వీరంతా కుంభకోణాల్లో ఆరితేరానని, డబ్బు సంచులు ముట్టజెప్పి ఆసుపత్రులను మేనేజ్‌ చేయగలరని పేర్కొన్నారు. నేర తీవ్రతను బట్టి సాధారణ బెయిల్‌ వచ్చే అవకాశం లేనందున మధ్యంతర బెయిల్‌ కోసం ఇలాంటి మోసపూరిత ఎత్తులు వేశారన్నారు. రెండు రోజుల క్రితం అతను విడుదలయ్యారని, అమ్మమ్మను చూసిరావడానికి ఆ సమయం చాలన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న అనంతరం ధర్మాసనం రాఘవ్‌ను ఈ నెల 12న లొంగిపోవాలని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని