మొక్కుబడి రాయితీ

రాష్ట్రంలో వేరుసెనగ సాగు విస్తీర్ణం పడిపోతున్నందున రైతుల్ని ప్రోత్సహించేందుకు విత్తన రాయితీని పెంచాలనే విషయాన్ని ప్రభుత్వం విస్మరించింది. సాగునీటి వసతి గల రైతులకు విత్తనాన్ని అందుబాటులో ఉంచట్లేదు.

Published : 10 Jun 2023 05:24 IST

2019-20లో 11 లక్షల క్వింటాళ్లు.. ఈ ఏడాది 6.18 లక్షల క్వింటాళ్లే
అరకొరగానే వేరుసెనగ విత్తన పంపిణీ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో వేరుసెనగ సాగు విస్తీర్ణం పడిపోతున్నందున రైతుల్ని ప్రోత్సహించేందుకు విత్తన రాయితీని పెంచాలనే విషయాన్ని ప్రభుత్వం విస్మరించింది. సాగునీటి వసతి గల రైతులకు విత్తనాన్ని అందుబాటులో ఉంచట్లేదు. వర్షాధారంగా సాగుచేసే కే6, లేపాక్షి రకాల విత్తనాన్నే అరకొరగా పంపిణీచేస్తోంది. అదీ చిత్తూరు జిల్లాలో రైతుకు బస్తా, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో మూడు బస్తాలు ఇస్తున్నారు. ఇవి ఏమూలకూ చాలవని, మళ్లీ బయట కొనాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. రాష్ట్రంలో 2019-20లో 11 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రాయితీపై పంపిణీ చేయగా.. గతేడాది 7.16 లక్షల క్వింటాళ్లకు తగ్గించారు. ఈ ఏడాది 6.18 లక్షల టన్నులే లక్ష్యంగా నిర్ణయించారు.

అవసరమైన రకాలేవీ?

రాయలసీమలో రైతులు వేరుసెనగ సాగు తగ్గించుకుని.. పత్తి, మిరప, కంది, ఆముదం తదితర పంటల వైపు మళ్లుతున్నారు. వేరుసెనగను ఆరుతడిగానే సాగుచేస్తుంటే.. ఈ విత్తనాలను వ్యవసాయశాఖ ఇవ్వట్లేదని రైతులు చెబుతున్నారు. వ్యవసాయశాఖ ద్వారా గతంలో ఏడాదికి 3.5-4 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని రాయితీపై సరఫరా చేసేవారు. ఈ ఏడాది ఏపీ సీడ్స్‌ ద్వారా 2.97 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని 40% రాయితీపై ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వమిచ్చే కె-6 రకం వర్షాధార సాగుకే అనుకూలిస్తుంది. ఆరుతడికి లేపాక్షి రకం అనుకూలమే అయినా.. దిగుబడి, మార్కెట్‌ పరంగా ట్యాగ్‌ 24 రకం మేలైనదని రైతులు అంటున్నారు. క్వింటాలుకు రూ.15వేలు పెట్టి ఈ విత్తనాన్ని తెచ్చుకుంటున్నామని అనంతపురం జిల్లా రైతులు వివరించారు.రాష్ట్రంలో 2016-17లో 23.32 లక్షల ఎకరాల్లో వేరుసెనగ సాగుచేయగా, 2022-23లో 12.67 లక్షల ఎకరాలకు పడిపోయింది. రాయితీకి ఏటా సగటున రూ.302 కోట్ల నుంచి రూ.325 కోట్ల వరకు అప్పటి ప్రభుత్వం భరించింది. విత్తన ధరలు పెరుగుతున్నందున కనీసం రూ.400 కోట్లయినా కేటాయిస్తే.. రైతులకు భరోసా దక్కుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని