దోపిడీ గుట్టు బట్టబయలు

రాష్ట్రంలో ఇసుక వ్యాపారమంతా జేపీ సంస్థకు బదులుగా వైకాపా నాయకులే నిర్వహిస్తున్నారనే విషయం తిరుగులేని ఆధారాలతో బయటపడింది.

Published : 10 Jun 2023 05:24 IST

అధికార పార్టీ నాయకులే అనధికార రీచ్‌ల నిర్వాహకులు
ఇసుక రేవులు అడ్డగోలుగా సబ్‌లీజులకు..
వాటిని తీసుకున్న లీజుదారులు నష్టాల ఊబిలోకి
చివరికి ఒకరు ఆత్మహత్య.. తాజాగా మరొకరు ఆత్మహత్యాయత్నం

ఈనాడు, అమరావతి, కడప: రాష్ట్రంలో ఇసుక వ్యాపారమంతా జేపీ సంస్థకు బదులుగా వైకాపా నాయకులే నిర్వహిస్తున్నారనే విషయం తిరుగులేని ఆధారాలతో బయటపడింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో, ఆయన సమీప బంధువే అనుమతుల్లేని ఇసుక రీచ్‌ కోసం డబ్బులు కట్టించుకుని, అవి తిరిగి ఇవ్వకుండా తిప్పిస్తున్నారంటూ పోకల నారాయణరెడ్డి అనే వ్యాపారి ఆత్మహత్యకు ప్రయత్నించడం... రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఇసుక దోపిడీని కళ్లకు కడుతోంది. ఇసుక వ్యాపారం పేరిట అధికార పార్టీ నాయకులు ఎంతటి అరాచకాలకు పాల్పడుతున్నారో అద్దం పడుతోంది. ఇసుక రేవులను కొంతమంది తన వద్ద సబ్‌లీజుకు తీసుకున్నారంటూ సీఎం బంధువు వీరారెడ్డి బాహాటంగా అంగీకరించటం.. ఆయన బరితెగింపుతనాన్ని చూపిస్తోంది. ఈ స్థాయిలో దారుణాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి మాత్రం నోరు మెదపరు. ఇసుక వ్యాపారాన్ని జేపీ సంస్థకు ఇచ్చేశామని, వారు ఎవరికి సబ్‌లీజు ఇచ్చుకున్నా తమకు సంబంధం లేదంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డి తరచూ ప్రకటనలు చేస్తుంటారు. ఇసుక వ్యాపారం కోసం వైకాపా నాయకులకు రూ.కోట్లలో డిపాజిట్టు, నెలవారీ చెల్లింపులు చేసి ఆ సొమ్ము తిరిగి రాబట్టుకోలేక తీవ్రంగా నష్టపోయి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో కళ్లేపల్లి ప్రేమ్‌రాజ్‌ మార్చిలో ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా వైయస్‌ఆర్‌ జిల్లాలో పోకల నారాయణరెడ్డి ఆత్మహత్యకు యత్నించటం, దానికి కారణం వీరారెడ్డి అంటూ ఆరోపిస్తూ వీడియో విడుదల చేయటం రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు, అధికార వైకాపా నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్న దోపిడీని చెప్పకనే చెబుతోంది.

వైకాపా నాయకుల నేతృత్వంలోనే

రాష్ట్రంలో ఇసుక వ్యాపారం జేపీ పవర్‌ వెంచర్స్‌ సంస్థ ప్రధాన గుత్తేదారుగా, టర్న్‌కీ సంస్థ ఉపగుత్తేదారుగా సాగుతున్నట్లు ప్రభుత్వ దస్త్రాల్లో ఉంటుంది. ఇసుక కొన్నవారికి రసీదులూ ఆ సంస్థల పేరిటే ఇస్తారు. కానీ మొత్తం దందాను రాష్ట్ర స్థాయిలో వైకాపా ‘ముఖ్య నేతలు’, ప్రభుత్వ పెద్దలే శాసిస్తున్నారు. జిల్లాల వారీగా ఆ బాధ్యతలను వైకాపా ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు, వారి బంధువులు, తమకు అత్యంత సన్నిహితులు, ఇతరులకు అప్పగించారు. వారి నుంచి ముందస్తుగా రూ.కోట్లలో అడ్వాన్సులు వసూలు చేశారు. నెలవారీగా ఎంత డబ్బు కట్టాలో లక్ష్యాలు నిర్దేశించారు. జిల్లా స్థాయిలో ఇసుక వ్యాపారం నిర్వహిస్తున్న నాయకులు.. ‘ముఖ్య నేతలకు’ నెలవారీ కట్టాల్సిన డబ్బుతో పాటు, వారు మరింత సంపాదించేందుకు మరో అడుగు ముందుకేశారు. ఆయా జిల్లాల్లోని ఇసుక రేవులకు, ఇంత మొత్తమని ధర నిర్ణయించి స్థానిక వైకాపా నాయకులకు, ఇతరులకు అప్పగించారు. ఈ దోపిడీయే ఇప్పుడు ఆత్మహత్యలకు కారణమవుతోంది.

అడిగినంత కట్టలేక

కళ్లేపల్లి ప్రేమ్‌రాజ్‌ అనే వ్యక్తి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఇసుక వ్యాపార నిర్వహణ బాధ్యతలను రూ.25 కోట్లు డిపాజిట్టు చెల్లించి దక్కించుకున్నారు. ఆయన రాష్ట్ర ముఖ్యనేతలకు ప్రతి నెలా రూ.21 కోట్లు చెల్లించాలి. వ్యాపారం సరిగ్గా జరగకపోవటంతో మూడు నెలల పాటు సొమ్ము చెల్లించలేదు. అధికార పార్టీ పెద్దలు ఆ మొత్తాన్ని డిపాజిట్‌ నుంచి మినహాయించుకున్నారు. అంతేకాదు ఇసుక వ్యాపార బాధ్యతను ఇతరులకు అప్పగించారు.  మళ్లీ ఇసుక బాధ్యతలు ఇవ్వాలని ప్రేమ్‌రాజ్‌ ప్రభుత్వ పెద్దలను, రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలను కలిసి ప్రాథేయపడినా ఫలితం లేకపోయింది. దీంతో ఈ ఏడాది మార్చిలో ఆత్మహత్య చేసుకున్నారు.


అనుమతుల్లేని రీచ్‌ అప్పగించి.. రూ.లక్షలు కొల్లగొట్టి

వైకాపా నేత, ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ ఏ.మల్లికార్జునరెడ్డి సోదరుడు, ముఖ్యమంత్రి జగన్‌కు సమీప బంధువైన దుగ్గాయపల్లె వీరారెడ్డి వైయస్‌ఆర్‌ జిల్లాలో ఇసుక సిండికేట్‌ను నిర్వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లె వద్ద పెన్నా నదిలో ఇసుక రీచ్‌ కోసం వీరారెడ్డికి తాను రూ.81 లక్షలు కట్టానని పోకల నారాయణరెడ్డి చెబుతున్నారు. ఆ రీచ్‌కు అనుమతి లేకపోవటంతో కొన్నాళ్లపాటు నడిచి మూతపడింది. నష్టపోయానని.. తాను కట్టిన డబ్బులో కొంతైనా తిరిగివ్వాలని బతిమాలుతున్నా వీరారెడ్డి ససేమిరా అనడంతో గత్యంతరం లేకే ఆత్మహత్యకు యత్నించినట్లు నారాయణరెడ్డి చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని