AP-Adani Group: షిర్డీ సాయికే.. స్మార్ట్‌గా ఇచ్చేశారు.. ఇదో భారీ కుంభకోణం
రాష్ట్రంలోని అయిదు కోట్ల ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు..అస్మదీయుల కంపెనీ మాత్రం చల్లగా ఉండాలి...! ప్రజాధనాన్ని అప్పనంగా ఇచ్చేయాలి.. ఎన్ని విమర్శలు వచ్చినా దులిపేసుకోవాలి.! పారదర్శకతకు అడుగడుగునా పాతరేయాలి...! ఎవరైనా వేలెత్తి చూపితే... విరుచుకుపడాలి... అడ్డగోలు వాదనతో మసిపూసి మారేడుకాయ చేయాలి..!
ఒక్కో స్మార్ట్ మీటరు వ్యయం రూ.37,072
యూపీలో అదానీ సంస్థ కోట్ చేసింది రూ.10 వేలే
అనుబంధ పరికరాలకు, నిర్వహణకు అన్నిరెట్లు అధికమా?
ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోని ప్రభుత్వం
ఈనాడు - అమరావతి
రాష్ట్రంలోని అయిదు కోట్ల ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు..అస్మదీయుల కంపెనీ మాత్రం చల్లగా ఉండాలి...! ప్రజాధనాన్ని అప్పనంగా ఇచ్చేయాలి.. ఎన్ని విమర్శలు వచ్చినా దులిపేసుకోవాలి.! పారదర్శకతకు అడుగడుగునా పాతరేయాలి...! ఎవరైనా వేలెత్తి చూపితే... విరుచుకుపడాలి... అడ్డగోలు వాదనతో మసిపూసి మారేడుకాయ చేయాలి..! వ్యవసాయ మోటర్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఇదే.. ఇదో అతి పెద్ద కుంభకోణం..! ప్రభుత్వ పెద్దలు అత్యంత రహస్యంగా సాగిస్తున్న వ్యవహారం. ఏకంగా రూ.6,888.03 కోట్లు..! రాష్ట్రంలోని 18.58 లక్షల వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చేయనున్న ఖర్చు ఇది. దీనికి తాజాగా రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదముద్ర వేసేసింది. ఇక అమలే మిగిలింది. ఈ మొత్తం కాంట్రాక్టును ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడు, కడప జిల్లాకు చెందిన విశ్వేశ్వరరెడ్డికి సంబంధించిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థకే కట్టబెట్టినట్టు అధికారవర్గాల సమాచారం. ఒక్కో మీటరుపై ఆ సంస్థకు డిస్కంలు కట్టబెడుతోంది ఏకంగా రూ.37,072.28. కనీవినీ ఎరుగని ఈ ధరలను ఎవరైనా ప్రశ్నిస్తే మీటరు ఏర్పాటు, ‘నిర్వహణ ఖర్చుని రైతుల నుంచి వసూలు చేయడం లేదు కదా’ అన్న అడ్డగోలు వాదనొకటి ప్రభుత్వం వినిపిస్తోంది. రైతుల నుంచి నేరుగా వసూలు చేయకపోయినా, పరోక్షంగా ఆ భారం వేసేది రాష్ట్రంలోని మొత్తం విద్యుత్ వినియోగదారులపైనే కదా? ఇప్పుడు ట్రూప్‌అప్ ఛార్జీల పేరుతో బాదేస్తోంది ప్రజలనే కదా? స్మార్ట్‌మీటర్ల కుంభకోణంపై భవిష్యత్తులో మరో పార్టీ ప్రభుత్వమేదైనా విచారణ జరిపిస్తే... దీనిలో భాగస్వాములైన నాయకుల నుంచి అధికారుల వరకు అందరూ జైలుకెళ్లాల్సిందే..!
ఎందుకంత లోగుట్టు?
స్మార్ట్ మీటర్ల కోసం ఏకంగా రూ.6,888 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్న ప్రభుత్వం.. టెండర్లు ఎప్పుడు పిలిచింది, ఏ సంస్థలు పాల్గొన్నాయి, ఎల్1గా వచ్చిన సంస్థ ఏది, ఏ ప్రాతిపదికన టెండర్ కట్టబెట్టారు వంటి వివరాలు వెల్లడించడం లేదు. అడ్డగోలు వ్యవహారం కాబట్టే సమాచారం బయటకు పొక్కకుండా ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. 2022 సెప్టెంబరు 29న మంత్రి పెద్దిరెడ్డి నిర్వహించిన సమీక్ష కోసం డిస్కంలు అందజేసిన సమాచారం ప్రకారం.. అప్పటికి ఏడాది క్రితమే స్మార్ట్‌మీటర్లపై గుత్తేదారు సంస్థలకు షరతులతో కూడిన లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు జారీ చేసినట్లు పేర్కొన్నాయి. సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తుకు 2022 సెప్టెంబరు 23న ఎస్‌పీడీసీఎల్ సమాధానమిస్తూ.. తమ పరిధిలో 11 లక్షల మీటర్ల ఏర్పాటుకు 2021 సెప్టెంబరు 2న టెండర్లు పిలిచామని, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌తో పాటు మరో నాలుగు సంస్థలు బిడ్‌లు దాఖలు చేశాయని, గుత్తేదారు సంస్థతో ఇంకా ఒప్పందం ఖరారు కాలేదని చెప్పింది. ఆ వివరాలతో ‘ఈనాడు’లో అక్టోబరు 24న కథనం రాస్తే.. పెద్దిరెడ్డి అదే రోజు విలేకరుల సమావేశంలో పాత టెండర్లు రద్దు చేశామని చెప్పారు. మరి కొత్తగా పిలిచిన టెండర్లు, పాల్గొన్న సంస్థలు, బిడ్ల వివరాలు వెల్లడించకపోవడానికి కారణమేంటన్నది ప్రశ్న.
మరీ అంత దారుణమా?
అసలే విద్యుత్ పంపిణీ సంస్థలు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో స్మార్ట్‌మీటర్‌కు అంత భారీ మొత్తం వెచ్చించడంపై నిపుణులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నుంచి విమర్శలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. శ్రీకాకుళంలో వ్యవసాయ మోటార్లకు పైలట్ ప్రాజెక్టుగా అమర్చిన ఐఆర్‌డీ పోర్టు మీటర్లపై అధ్యయనం చేసిన ‘ప్రయాస్ సంస్థ’ నివేదికను ఉటంకిస్తూ ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ 2022 సెప్టెంబరు 15న డిస్కంలకు లేఖ రాశారు. స్మార్ట్‌మీటర్లకు డిస్కంలు ఖరారు చేసిన ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. అయినా ప్రభుత్వం ముందుకే వెళ్లింది.
* ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లోని విద్యుత్ పంపిణీ సంస్థ మధ్యాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ (ఎంవీవీఎన్‌ఎల్) ఒక్కో మీటరుకు రూ.10 వేల చొప్పున 75 లక్షల స్మార్ట్ మీటర్ల సరఫరా, నిర్వహణకు అదానీ సంస్థకు ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేసింది. రద్దుకు కారణాలేమైనా అక్కడ గృహవిద్యుత్ వినియోగదారులకు ఒక్కో స్మార్ట్ మీటర్ అమర్చేందుకు, నిర్వహణకు అదానీ సంస్థ కోట్ చేసిన ధర రూ.10 వేలు మాత్రమే. పోనీ వ్యవసాయ మోటార్లకు నిర్వహణ వ్యయం కొంచెం ఎక్కువనుకున్నా ఏపీలోని డిస్కంలు ఒక్కో మీటరుకు ఏకంగా రూ.37,072.28 చొప్పున చెల్లించడమేంటి?
ఎలా చూసినా ప్రజలపైనే భారం!
వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చితే.. రాష్ట్ర ప్రభుత్వానికి జీఎస్‌డీపీలో 0.5 శాతం రుణాన్ని అదనంగా పొందే వెసులుబాటు లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం మీటర్లు పెట్టాలని మాత్రమే చెప్పింది. దానికి జోడింపుగా రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్‌మీటర్ల పేరుతో భారీ వ్యయానికి సిద్ధపడింది. ఆర్‌డీఎస్‌ఎస్ పథకం కింద మోటార్లకు అమర్చే ఒక్కో మీటరుకు కేంద్రం ఇచ్చేది రూ.1,350 మాత్రమే. ఒక్కో స్మార్ట్ మీటరుపై ప్రభుత్వం వెచ్చిస్తున్న రూ.37,072.28లో కేంద్రం వాటా రూ.1,350 పోనూ, మిగతా రూ.35,722 భారాన్ని భరించేది రాష్ట్ర ప్రజలే కదా అన్నది ప్రశ్న. ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు తెచ్చే అప్పుల భారం పడేదీ కూడా రాష్ట్ర ప్రజలపైనే అన్న విషయం పరిశీలనార్హం.
టెండర్లలో ఎందుకంత దాపరికం?
స్మార్ట్ మీటర్లకు రూ.6,888 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్న ప్రభుత్వం.. టెండర్లు ఎప్పుడు పిలిచింది, ఏ సంస్థలు పాల్గొన్నాయి, ఎల్1గా వచ్చిన సంస్థ ఏది, ఏ ప్రాతిపదికన టెండర్ కట్టబెట్టారు వంటి వివరాలు ఎక్కడా వెల్లడించడం లేదు.
ఇప్పుడేమంటారు పెద్దిరెడ్డిగారూ?
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు అమర్చే ఒక్కో స్మార్ట్ మీటర్‌పై రూ.35 వేలు చొప్పున ఖర్చు పెట్టబోతోందని, అందులో మీటరు ధర రూ.6 వేలు, అనుబంధ పరికరాలు, ఐదేళ్ల నిర్వహణకు రూ.29 వేలు వెచ్చించనుందని 2022 అక్టోబరు 24న ‘ఈనాడు’ కథనాన్ని ప్రచురించింది. 2022 సెప్టెంబరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశం కోసం మూడు డిస్కంలు అందజేసిన సమాచారం ఆధారంగానే ‘ఈనాడు’ ఈ కథనం రాసింది. దానిపై పెద్దిరెడ్డి విలేకరుల సమావేశంలో విరుచుకుపడ్డారు. ‘గతంలో రద్దు చేసిన టెండర్లపై ‘ఈనాడు’ తప్పుడు రాతలు రాసింది. కొవిడ్ సమయంలో రూపొందించిన ఆ టెండర్‌లో హెచ్చుతగ్గులున్నాయని గ్రహించి గతంలోనే రద్దు చేశాం. కొత్త అంచనాలతో ఒక్కో మీటరుకు రూ.6 వేలు, అనుబంధ పరికరాలకు రూ.14,455 చొప్పున ఖర్చుచేస్తాం. ‘ఈనాడు’ కథనంలో నిజం లేదు’ అని పేర్కొన్నారు. నాడు అడ్డగోలుగా బుకాయించిన పెద్దిరెడ్డి... ఇప్పుడు చేసిందేంటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మంత్రి చెప్పినట్టే మీటరు ధర రూ.6 వేలు అనుకుంటే, అనుబంధ పరికరాలు, నిర్వహణకు రూ.31,072.28 ఖర్చు పెడుతున్నట్టే కదా? కాకపోతే గతంలో ప్రతిపాదించిన ఐదేళ్ల నిర్వహణ కాలాన్ని 93 నెలలకు పెంచారంతే! అనుబంధ పరికరాలు, నిర్వహణకే మీటరు ధరకు ఐదు రెట్లకు మించి వెచ్చిస్తారా? అన్నది ప్రశ్న.
కార్పొరేట్లకు దోచిపెట్టే కుట్ర
వ్యవసాయంలో ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి చేస్తున్న కుట్ర ఇది. వ్యవసాయ మోటార్లకు మీటర్ల అవసరమే లేదు. కార్పొరేట్ సంస్థలకు మేలు చేయడానికి, పాలక పార్టీ నేతల జేబులు నింపుకోవడానికి ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడుతోంది. స్మార్ట్ మీటర్లపై గతంలో ఏపీఈఆర్‌సీకి ఫిర్యాదు చేశాం. స్మార్ట్ మీటర్లకయ్యే ఖర్చును రైతుల నుంచి వసూలు చేయడం లేదు, కేంద్రం భరిస్తోందన్న రాష్ట్ర ప్రభుత్వ వాదన అసంబద్ధం. ఆర్డీఎస్‌ఎస్ కింద కేంద్రం ఇచ్చేది చాలా స్వల్పం. ఖర్చెవరిదైనా అది ప్రజల సొమ్మే. మీటరుకు రైతుల నుంచి డబ్బు వసూలు చేయకపోయినా ట్రూఅప్, సర్దుబాటు ఛార్జీల పేరుతో మళ్లీ విద్యుత్ వినియోగదారులపైనే భారం వేస్తారు.
సీహెచ్ బాబూరావు,
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: ప్రముఖ హోమియో వైద్య నిపుణుడు సోహన్‌సింగ్ జోషి మృతి
-
Chandrababu Arrest: చంద్రబాబుకు మద్దతుగా కూకట్‌పల్లిలో నిరసనలు
-
Missing Children: తొమ్మిదేళ్లలో 4.46 లక్షల చిన్నారుల ఆచూకీ లభ్యం: స్మృతీ ఇరానీ
-
Hyderabad: తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టనున్న సింటెక్స్ సంస్థ
-
Income tax refund: ఆదాయపు పన్ను రిఫండ్స్.. ఐటీ శాఖ కీలక సూచన
-
Chandrababu Arrest: విశాఖలో తెదేపా శ్రేణుల కొవ్వొత్తుల ర్యాలీ.. అడ్డుకున్న పోలీసులు