నమ్ముకుని ఉన్నాం.. ఆ ఒక్కటీ ఇచ్చేయండి

‘ ఏపీ ఐకాస అమరావతి నేతృత్వంలో 92 రోజుల పాటు ఉద్యమం కొనసాగగా, 48 డిమాండ్లలో 37 పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేశారు.

Published : 10 Jun 2023 04:52 IST

పాత పింఛను విధానానికి  ఏపీ ఐకాస అమరావతి డిమాండ్‌

విజయవాడ (ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: ‘ ఏపీ ఐకాస అమరావతి నేతృత్వంలో 92 రోజుల పాటు ఉద్యమం కొనసాగగా, 48 డిమాండ్లలో 37 పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేశారు..మిగతా 11 డిమాండ్ల పరిష్కారానికి కూడా కృషి చేస్తాం. ఉద్యమం ద్వారా 80 శాతం మేర పరిష్కారాన్ని సాధించగలిగాం. పాత పింఛను విధానం పునరుద్ధరణ అంశం ఇంకా మిగిలి ఉంది. పాత పింఛను విధానమే అమలు చేయాలి’ అని ఐకాస ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. విజయవాడలోని ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ భవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని శాఖాధిపతులు (హెచ్‌వోడీలు) ప్రభుత్వ గుర్తింపు గల సంఘాలతో ప్రతి నెలా సమావేశాలు నిర్వహించి, మినిట్స్‌ రూపొందించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను పునరుద్ధరించాలని కోరారు. పొరుగు సేవల ఉద్యోగులు, వివిధ శాఖల్లో పని చేసే చిరుద్యోగుల బాధలను ఉద్యమంలో గమనించామని, ఇకపై వీరి సమస్యల పోరాటానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఏపీ ఐకాస అమరావతి ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావును ఉద్యమ దళపతిగా బొప్పరాజు అభివర్ణించి కృతజ్ఞతలు తెలిపారు. సంఘాలతో పనిలేకుండా ఉద్యోగులు ఉద్యమంలో పాల్గొన్నారని, ఈ విజయం వారికే అంకితమన్నారు. ఏపీ ఐకాస అమరావతి ఉద్యమాన్ని చేపట్టిన తర్వాతే సమస్యలు పరిష్కారం అయ్యాయన్నారు. సీఎం, మంత్రివర్గ ఉపసంఘానికి, ఎమ్యెల్యేలకు, సీఎస్‌కు బొప్పరాజు కృతజ్ఞతలు తెలిపారు. పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ. పాత పింఛను విధానం అమలులోకి వస్తుందనే ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనానికి కోరుకున్నట్టు చెప్పారు. పొరుగు సేవల ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సుమన్‌ మాట్లాడుతూ మిగతా ఒప్పంద ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరించాలని, పొరుగు సేవల ఉద్యోగులకు జీతాలు పెంచాలని కోరారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం నేత పుల్లయ్య, ఏపీ గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వి.అర్లయ్య, ఏపీ ఐకాస నాయకులు టి.వి.ఫణిపేర్రాజు, వి.వి.మురళీకృష్ణనాయుడు, ఎస్‌.శ్రీనివాసరావు, మల్లేశ్వరరావు, బి.కిశోర్‌కుమార్‌, కనపర్తి సంగీతరావు, డి.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని