నిర్వహణకు నిధులివ్వక ప్రాజెక్టుల భద్రత గాలికి..

ఈ ఫొటోలన్నీ ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు ఎంతో కీలకమైన ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజి దుస్థితికి సంబంధించినవి.

Published : 10 Jun 2023 04:52 IST

ఇప్పటికే కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు
పులిచింతల, గుండ్లకమ్మ గేటుదీ అదే పరిస్థితి
ఇంత జరిగినా మేల్కోని జగన్‌ సర్కార్‌
నిర్వహణ పనులకు ఏ మాత్రం చాలని నిధులు
బిల్లులు రాక ముందుకు రాని గుత్తేదారులు
అధ్వానంగా అనేక ప్రాజెక్టులు

ఈ ఫొటోలన్నీ ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు ఎంతో కీలకమైన ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజి దుస్థితికి సంబంధించినవి. ఈ బ్యారేజి దాదాపు 10 లక్షల ఎకరాలకు నీరందిస్తుంది. వరద కాలంలో బ్యారేజిలో నీరు నిలిపి మధ్య, పశ్చిమ, తూర్పు డెల్టా కాలువల ద్వారా లక్షల ఎకరాలకు నీరందిస్తారు. అయితే బ్యారేజి పరిస్థితి, అందులోని గేట్లు అత్యంత దారుణంగా తయారయ్యాయి. ప్రాజెక్టు గేట్ల రోలర్లలో బేరింగులు పాడైపోయాయి. ఆ బేరింగుల్లో ఉండే బాల్స్‌ ముక్కలు ముక్కలుగా విరిగిపోయాయి. డ్యాం భద్రతా కమిటీ ఈ విషయాలను గుర్తించి తక్షణమే పనులు చేపట్టాలని సిఫార్సు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. మొత్తం ప్రధాన గేట్లు 175, స్లూయిస్‌ గేట్లు 22 ఉన్నాయి. గతంలో 53 గేట్లకు మాత్రమే మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం మిగిలిన అన్ని గేట్ల పరిస్థితీ దారుణంగా తయారైంది. 2018 నుంచి కూడా ధవళేశ్వరం బ్యారేజి గేట్లు, ఇతర మరమ్మతు పనులు పూర్తి కావడం లేదు. నిధులు లేకపోవడం, బిల్లులు పెండింగులో ఉండటమే ఇందుకు కారణం అని చెబుతున్నారు.

ఈనాడు - అమరావతి

లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షల జనాభాకు తాగునీరు అందించే ప్రాజెక్టులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉన్నా వాటి నిర్వహణ విషయంలో రాష్ట్రంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. వరుసగా ప్రాజెక్టుల గేట్లు...మొత్తం ప్రాజెక్టులే కొట్టుకుపోతున్నా ప్రభుత్వం మేల్కొనడం లేదు. ప్రాజెక్టుల మరమ్మతులకు చర్యలు తీసుకోవడం లేదు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిన తర్వాత ఒక కమిటీని వేసి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులను సరిదిద్దుతామంటూ ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీ అమలు కాలేదు. ఇప్పటికీ ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు లేవు. చర్యలూ లేవు.

రూ.వందల కోట్లు వెచ్చించి నిర్మించిన డ్యాంలు అవి.   ఏటా తప్పనిసరిగా వాటి నిర్వహణ పనులు చేపట్టాలి.  అన్ని పరికరాలు సరిగా పని చేస్తున్నాయో లేదో సరిచూసుకోవాలి. తలుపులు ఎత్తే హాయిస్టంగ్‌ వ్యవస్థ సరిగా పని చేస్తోందో లేదో గమనించుకోవాలి. తలుపులు గట్టిగా ఉన్నాయా? ఏవైనా మరమ్మతులు అవసరమా అన్నది పరిశీలించి ఎప్పటికప్పుడు పనులు చేసుకుంటూ ఉండాలి. అయితే ఇందుకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. ‘మా ప్రాజెక్టుకు నిధులు కావాలి, నిర్వహణ ఎంతో ముఖ్యం..మంజూరు చేయండి’ అని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ‘ఒక పెద్ద ప్రాజెక్టు నిర్వహణ ఖర్చులకు రూ.5 లక్షలు కావాలని కోరినా ఆర్థికశాఖ స్పందించడం లేదు’ అని జల వనరులశాఖలో కీలక అధికారి ఒకరు ఆవేదన చెందారంటే పరిస్థితి ఊహించవచ్చు. ప్రాజెక్టుల నిర్వహణకు చాలా కొద్ది మొత్తాల కోసం ఆర్థికశాఖకు పంపిన ఫైళ్లు సైతం మూలుగుతున్నాయి తప్ప జీవోలు రావడం లేదు’ అని ఆయన ఆవేదన చెందారు.

ఇదీ పరిస్థితి

ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వ హయాంలోనే పులిచింతల గేటు కొట్టుకుపోయింది. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు, పింఛా వరద కట్ట కొట్టుకుపోయాయి. అన్నమయ్య ప్రాజెక్టు సైతం కొట్టుకుపోయి 33 మంది ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం మేల్కోలేదు. ఇప్పటికీ సరిదిద్దే పరిస్థితి లేదు. అన్నమయ్య ప్రాజెక్టు విషాదం తర్వాత సీఎస్‌ ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించి అన్ని ప్రాజెక్టులపై అధ్యయనం చేయించి ప్రాజెక్టుల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించినా వరుసగా రెండో ఏడాదీ అదే నిర్లక్ష్యం కొనసాగుతోంది.


గుత్తేదారులు ముందుకు రావడం లేదు

ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు కావాలని ఎప్పటికప్పుడు కింది స్థాయి నుంచి అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నా ఫలితం ఉండటం లేదని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి చిన్న పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచినా ఒక్క గుత్తేదారూ ముందుకు రావడం లేదని చెబుతున్నారు.


కీలక శ్రీశైలం ప్రాజెక్టుపైనా నిర్లక్ష్యం

శ్రీశైలం ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిర్వహణకు అటు ప్రపంచ బ్యాంకు నిధుల కోసం  ప్రయత్నిస్తున్నా మంజూరు కావడం లేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వమూ తగినన్ని నిధులు ఇవ్వడం లేదు. ఈ ప్రాజెక్టు నిర్వహణ పనుల కోసం సుమారు రూ.50 లక్షలు మాత్రమే బడ్జెట్‌లో చూపారని, అవి ఏమాత్రం సరిపోవని అధికారులే అంటున్నారు. చేసిన పనులకు బిల్లుల చెల్లింపుల్లోనూ ఆలస్యమవుతున్నాయి. శ్రీశైలంలోనూ గుత్తేదారులు మధ్యలోనే పనులు ఆపేసిన సందర్భాలూ ఉన్నాయి. స్టాప్‌ లాగ్‌ గేట్ల బిల్లులు రాకపోవడంతో గుత్తేదారు ఇప్పటికీ ఆ పనులు చేయలేదు.


డ్యాం భద్రతా కమిటీలు నివేదికలు  ఇచ్చినా...

రాష్ట్రంలో డ్యాం భద్రతా కమిటీ ఏటా కొన్ని ప్రాజెక్టులను సందర్శించి చేపట్టాల్సిన పనులు, తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలు ఇస్తుంటుంది. అయితే ఆ మేరకూ పనులు సకాలంలో చేస్తున్న దాఖలాలు లేవు.

* డ్యాంలపై అవగాహన ఉన్న సిబ్బంది చాలా మంది పదవీవిరమణ చేశారు. వారి స్థానంలో కొత్తవారి నియామకానికి ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. చాలా చోట్ల లస్కర్లు కూడా లేరు.


నిధులు ఎక్కడ?

ప్రాజెక్టుల నిర్వహణకు నిధులిచ్చే హెడ్‌లలో నిధులు లేకపోవడంతో ఆ పనులు ఏవీ సరిగా జరగడం లేదు. రూ.మూడునాలుగు లక్షలు కూడా నిర్వహణ ఖర్చులకు ఇచ్చే పరిస్థితి లేదని రాయలసీమ ప్రాజెక్టులకు చెందిన ఎస్‌ఈ ఒకరు వాపోయారు. గుత్తేదారులు కూడా పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని అంటున్నారు. బతిమాలుకొని పనులు చేయించాల్సి వస్తోందని చెబుతున్నారు. కొన్ని చోట్ల అధికారులు సొంత డబ్బులు పెట్టి చిన్నచిన్న పనులు చేయిస్తున్నారు.

* గుండ్లకమ్మ ప్రాజెక్టుకు గతంలోనే రూ.3 కోట్లు మంజూరు చేయాలని అడిగారు. ఆ నిధులు ఇవ్వకపోవడం వల్ల కిందటేడాది సెప్టెంబరులో గేటు కొట్టుకుపోయింది. ఆ తర్వాత నిపుణుల కమిటీలు సందర్శించి నివేదికలు ఇచ్చినా ఆ మేరకు పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. అనేక గేట్లు బలహీనంగా ఉన్నాయని గుర్తించినా ఇప్పటికీ వాటిని సరిదిద్దలేదు.

* 2021 ఆగస్టు 5 తెల్లవారుజామున పులిచింతల ప్రాజెక్టులో 16వ నంబరు గేటు కొట్టుకుపోయింది. టైప్లాట్స్‌ పూర్తిగా తెగిపోయాయి. పనులకు నిధులు మంజూరు చేయడంలోనూ ఆలస్యం అయింది. టెండర్లు పిలిచి పనులు చేపట్టింది కిందటి ఏడాదిలోనే. గేటు కొట్టుకుపోయి దాదాపు రెండేళ్లు కావస్తున్నా పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు.

* ప్రస్తుత ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం సమీపంలో ఎర్రకాలువ జలాశయంలో నాలుగేళ్ల కిందట గేట్లు ఎత్తేందుకు ప్రయత్నించగా అవి పని చేయలేదు. దీంతో దిగువన సర్‌ప్లస్‌ ఛానల్‌కు గండి పడింది. ఆ నిధుల కోసం అధికారులు అనేకసార్లు ప్రతిపాదనలు పంపిన తర్వాత చివరికి 2022 జూన్‌లో పాలనామోదం దక్కింది. ఇంతవరకు ఎర్రకాలువ ప్రధాన జలాశయానికి సంబంధించిన షట్టర్లు, బేరింగులు తదితర పనులు పూర్తి కాలేదు. జలాశయంలో నీళ్లు ఉండటం వల్లే ఆ పనులు చేయలేకపోయామని అధికారులు చెబుతున్నారు. కొంత మేర పనులు అయ్యాయని చెబుతున్నారు. రూ. 20 లక్షలకు బిల్లులు సమర్పించాల్సి ఉందన్నారు.

* కడప జిల్లా లోయర్‌ సగిలేరు నిర్వహణ పనులు, గేట్ల పనులు ఆలస్యమవుతున్నాయి. గాజులదిన్నె ప్రాజెక్టులోనూ ఇదే పరిస్థితి.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని