శాఖాపరమైన చర్యల్లో అసాధారణ జాప్యం తగదు

దుష్ప్రవర్తన ఆరోపణల విషయంలో ఉద్యోగిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంలో అసాధారణ జాప్యం సరికాదని హైకోర్టు పేర్కొంది.

Published : 10 Jun 2023 04:52 IST

తీరిక కుదిరినప్పుడు చర్యలు తీసుకోవడం సరికాదన్న హైకోర్టు
ఏపీఏటీ తీర్పును సమర్థించిన ధర్మాసనం

ఈనాడు, అమరావతి: దుష్ప్రవర్తన ఆరోపణల విషయంలో ఉద్యోగిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంలో అసాధారణ జాప్యం సరికాదని హైకోర్టు పేర్కొంది. ఓ ఉద్యోగికి 2005లో ఛార్జిమెమో ఇచ్చి 2015లో షోకాజ్‌ నోటీసు జారీ చేయడంపై అభ్యంతరం తెలిపింది. వాటిని కొట్టేసింది. తీరిక కుదిరినప్పుడు చర్యలు తీసుకోవడం సరికాదంది. 2008లో పదవీ విరమణ చేసిన ఉద్యోగికి 2015లో షోకాజ్‌ జారీ చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. పరిపాలన ట్రైబ్యునల్‌ (ఏపీఏటీ) ఇచ్చిన తీర్పును సమర్థించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, జస్టిస్‌ వి.గోపాలకృష్ణారావుతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు తీర్పునిచ్చింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేవీవీ సత్యనారాయణమూర్తి వ్యవసాయ శాఖలో పనిచేసేవారు. డిప్యుటేషన్‌పై అరకులోయ అటవీ శాఖకు వెళ్లారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, దుష్ప్రవర్తన ఆరోపణలతో 2005లో ఆయనకు అధికారులు ఛార్జిమెమో ఇచ్చారు. దానికి ఆయన సమాధానమిచ్చారు. ఆ వివరణ సంతృప్తిగా లేదని అధికారులు విచారణకు ఆదేశించారు. 2008 డిసెంబరులో సత్యనారాయణమూర్తి పదవీ విరమణ చేశారు. 2010లో విచారణ పూర్తి చేసినప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఐదేళ్లు గడిచాక 2015 మార్చి 16న షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. జరిమానా ఎందుకు విధించకూడదో చెప్పాలన్నారు. దాన్ని సవాలు చేస్తూ సత్యనారాయణమూర్తి ఏపీఏటీని ఆశ్రయించగా ఉపశమనం లభించింది. ఛార్జిమెమో, షోకాజ్‌ నోటీసును ఏపీఏటీ రద్దు చేసింది. ఏపీఏటీ తీర్పును సవాలు చేస్తూ వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు 2017లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారించిన హైకోర్టు.. అధికారుల వ్యాజ్యాన్ని కొట్టేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని