జలవనరులశాఖలో అన్నీ అదనపు బాధ్యతలే!
జలవనరుల శాఖలో బదిలీలకు సంబంధించి ఆలస్యంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. నిజానికి మే నెలాఖరుకే పోస్టింగుల ఉత్తర్వులు విడుదల కావాల్సి ఉంది.
అర్హతలు ఉన్న వారికి దక్కని అవకాశాలు
బదిలీల్లో ఆ స్థానాలు ఖాళీ చూపని వైనం
ముగ్గురు ఎస్‌ఈలకు చీఫ్ ఇంజినీర్లుగా అదనపు బాధ్యతలు
ఈనాడు, అమరావతి: జలవనరుల శాఖలో బదిలీలకు సంబంధించి ఆలస్యంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. నిజానికి మే నెలాఖరుకే పోస్టింగుల ఉత్తర్వులు విడుదల కావాల్సి ఉంది. ఆలస్యంగా ఆ ప్రక్రియ పూర్తి చేసి గురువారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఉత్తర్వులు విడుదల చేశారు. దీనిపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం బదిలీలు చేపట్టేందుకు జీవో ఇచ్చి మార్గదర్శకాలు విడుదల చేసినా ఆ పద్ధతి జలవనరులశాఖలో పాటించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, సూపరింటెండెంట్ ఇంజినీరు, ఇతర పోస్టుల్లో అనేక చోట్ల పూర్తి అదనపు బాధ్యతల్లో అంతకన్నా దిగువ పోస్టుల్లో ఉన్న వారిని నియమించి కొనసాగిస్తున్నారు. ఉన్నతస్థాయిలో ఉన్న కొందరికి ఇష్టమైన వారికి, ప్రసన్నం చేసుకున్న వారికి గతంలోనే ఈ పోస్టులు దక్కాయి. నిజానికి డీఈఈ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, సూపరింటెండింగ్ ఇంజినీరు హోదా ఉన్న వారు ఆ స్థానాలను కోరుకుంటే వారిని అక్కడికి బదిలీ చేయాల్సి ఉంటుంది. ఆయా పోస్టులను ఖాళీలుగా చూపాల్సి ఉంటుంది. తాజా బదిలీల్లో అలా చేయకపోవడం విమర్శలకు తావు ఇస్తోంది. పూర్తి అదనపు బాధ్యతలతో కొనసాగుతున్న వారిని అలాగే కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మూడు చోట్ల కొత్తగా చీఫ్ ఇంజినీర్లను నియమించారు. అది కూడా ఎస్‌ఈలుగా ఉన్న వారిని పూర్తి అదనపు బాధ్యతలతో ఆ పోస్టుల్లో నియమించారు. విజయవాడ చిన్ననీటివనరులు, మధ్య తరహా జలవనరుల చీఫ్ ఇంజినీరుగా వి.సాయిరాంప్రసాద్‌ను పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు. ప్రస్తుతం ఆయన గుంటూరు నీరు ప్రగతి సూపరింటెండెంట్ ఇంజినీరుగా వ్యవహరిస్తున్నారు. తెలుగుగంగ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీరుగా మాలె వెంకటరమణను పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు. ఆయన ప్రస్తుతం తిరుపతి జీఎన్‌ఎస్‌ఎస్ సర్కిల్ ఎస్‌ఈగా ఉన్నారు. కేంద్ర ఆకృతుల సంస్థ చీఫ్ ఇంజినీరుగా బి.శ్రీనివాస్‌యాదవ్‌ను పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు. ప్రస్తుతం ఆయన ధవశేశ్వరం నాణ్యత నియంత్రణ విభాగం ఎస్‌ఈగా ఉన్నారు. వీరు కాక మొత్తం తొమ్మిది మంది ఎస్‌ఈలను బదిలీ చేశారు. ముగ్గురు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు సూపరింటెండెంట్ ఇంజినీర్లుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.