విద్యుత్తు తీగలపై వేలాడుతున్న ప్రాణాలు

గత నెల 8న చిత్తూరు జిల్లా గ్రామీణ డివిజన్‌ పరిధిలోని యాదమర్రి సెక్షన్‌లో 11 కేవీ డబుల్‌ ఫీడింగ్‌ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తున్న ఎనర్జీ అసిస్టెంట్‌ భూమిరెడ్డి పవన్‌ ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురయ్యారు.

Updated : 10 Jun 2023 06:05 IST

గాల్లో దీపాల్లా మారిన ఎనర్జీ అసిస్టెంట్ల జీవితాలు  
ఇప్పటి వరకు 125 మంది బలి
200 మందికి పైగా క్షతగాత్రులు.. వారి వైద్యానికీ దిక్కు లేదు
జాబ్‌చార్ట్‌లో లేకున్నా విద్యుత్తు మరమ్మతులకూ వినియోగం
పరిహారం ఇవ్వడానికి ఏళ్ల తరబడి తిప్పించుకుంటున్న ప్రభుత్వం

గత నెల 8న చిత్తూరు జిల్లా గ్రామీణ డివిజన్‌ పరిధిలోని యాదమర్రి సెక్షన్‌లో 11 కేవీ డబుల్‌ ఫీడింగ్‌ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తున్న ఎనర్జీ అసిస్టెంట్‌ భూమిరెడ్డి పవన్‌ ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురయ్యారు. తీవ్ర గాయాలైన ఆయన్ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కుమారుడు బతుకుతాడన్న ఆశతో ఆయన తల్లి సరోజ మూడు రోజులపాటు ఆసుపత్రిలోనే పడిగాపులు పడ్డారు. చికిత్స చేసినా ప్రయోజనం లేదని వైద్యులు చెప్పిన మాటలు విని తట్టుకోలేక ఆమె ఉరేసుకుని చనిపోయారు. తర్వాత రోజే పవన్‌ కూడా ప్రాణాలు వదిలారు. భార్యాబిడ్డలను ఒకేసారి పోగొట్టుకున్న ఆయన తండ్రి సంజీవరెడ్డి మానసికంగా ఇబ్బందుల పాలయ్యారు. ఆ ప్రమాదం నిండు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది.


ఏలూరు సర్కిల్‌ జంగారెడ్డిగూడెం డివిజన్‌ రాజవరం సచివాలయ పరిధిలో ఎనర్జీ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న మల్లాబత్తుల ధర్మరాజుకు ఆరేళ్ల కిందట కల్యాణితో వివాహమైంది. నాలుగేళ్లు, ఏడాదిన్నర వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. ధర్మరాజు ఈ నెల 1న రాత్రి 11 కేవీ లైనుకు మరమ్మతులు నిర్వహిస్తుండగా మరో ఫీడర్‌కు విద్యుత్‌ సరఫరా చేసే లైను తీగలు తాకడంతో ప్రమాదం సంభవించింది.  సుమారు గంటన్నరపాటు ఆయన ప్రాణాలతో కొట్టుమిట్టాడారు. అంత బాధలోనూ తన భార్యాబిడ్డల బతుకేంటని తల్లడిల్లిపోయారు. మృత్యువు ఆయన్ను కబళించడంతో భార్యాబిడ్డలు అనాథలయ్యారు.


కడప జిల్లా కలసపాడు మండంలోని రాజుపాలెంలో 11 కేవీ లైనుకు మరమ్మతులు చేస్తూ ఎనర్జీ అసిస్టెంట్‌ సురేష్‌ మార్చి 17న విద్యుత్‌ ప్రమాదానికి గురయ్యారు. రాజుపాలెం ఫీడర్‌ నుంచి ఎల్‌సీ తీసుకుని పనులు నిర్వహిస్తుండగా.. దాని పైనుంచి పుల్లారెడ్డిపల్లెకు వెళ్లే ఫీడర్‌ లైను తీగలు తగిలి విద్యుత్‌ ప్రవహించడంతో రెండు చేతులు కోల్పోయారు. ఒళ్లంతా కాలింది. వైద్యం కోసం రూ.7 లక్షలు ఖర్చయింది. సమస్య చెప్పిన వెంటనే స్పందిస్తాడన్న అభిమానంతో రాజుపాలెం, పుల్లారెడ్డిపాలెం గ్రామాల ప్రజలు రూ.3 లక్షలు పోగేసి ఇచ్చి ఉదారత చాటుకున్నారు. విద్యుత్‌ శాఖ మాత్రం ఇసుమంత సాయం కూడా చేయలేదు. పైగా ప్రమాదం జరిగిన తర్వాత రోజు నుంచే తనకు ఇవ్వాల్సిన జీతాన్ని నిలిపేసిందని, మళ్లీ ఉద్యోగం ఇస్తామన్న భరోసా కూడా అధికారులు కల్పించలేదని సురేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు.


ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ. బతుకుదెరువు కోసం కరెంటు స్తంభమెక్కితే కాటికి చేరిపోతున్న వ్యథ. తమ విధి కాకపోయినా అధికారుల బెదిరింపులకు భయపడి, విద్యుత్‌ తీగల మరమ్మతులు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 125 మంది ఎనర్జీ అసిస్టెంట్లు బలయిపోయారు. 200 మందికి పైగా వైకల్యం బారినపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన జాబ్‌ చార్ట్‌కు విరుద్ధంగా 11 కేవీ, 33 కేవీ లైన్ల మరమ్మతులకు ఎనర్జీ అసిస్టెంట్లను వినియోగించడమే ప్రమాదాలకు కారణంగా మారింది. ఇవన్నీ సర్కారు చేసిన హత్యలేనని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. మృతుల కుటుంబాలకు భరోసా ఇచ్చే దిశగానైనా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. ఎనర్జీ అసిస్టెంట్లుగా నియమితులైనవారిలో అధిక శాతం యువకులే. కడవరక తోడుంటానని మాటిచ్చిన భర్తను కరెంటు తీగలు కాటేయడంతో చిన్న వయసులోనే వైధవ్యంతో ఆ ఆడబిడ్డలు తల్లడిల్లిపోతున్నారు.  

సీఎం జగన్‌ తన మానస పుత్రిక అని చెప్పుకొనే సచివాలయ వ్యవస్థలో భాగంగా ఎనర్జీ అసిస్టెంట్లను విద్యుత్‌ శాఖ ఉద్యోగ ప్రకటన ద్వారా నియమించింది. సచివాలయ ఉద్యోగులు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో ఉండాలి. ఎనర్జీ అసిస్టెంట్లు మాత్రం 24 గంటలూ విధుల్లో ఉండాల్సి వస్తోంది. వారితోపాటు సచివాలయాల్లో నియామకం పొందిన వారికి ప్రభుత్వం ప్రొబేషన్‌ ఖరారు చేసింది. జాబ్‌ చార్ట్‌తో పాటు, వేతనంతో కూడిన సెలవులు ఇచ్చింది. ఎనర్జీ అసిస్టెంట్లకు మాత్రం ప్రొబేషన్‌ ఖరారు చేయలేదు. నియామకం నాటి నుంచి రెండేళ్లపాటు సచివాలయ ఉద్యోగుల మాదిరే నెలకు రూ.15 వేల వంతున చెల్లించింది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వారికి నెలకు రూ.25 వేలు, పట్టణాల్లోని వారికి రూ.26 వేల చొప్పున వేతనం ఇస్తున్నారు. విద్యుత్‌ శాఖ.. వీరికి సర్వీసు నిబంధనలు ప్రకటించకపోవడంతో సెలవులు పెట్టుకునే వెసులుబాటు లేదు. ఒక్కరోజు విధులకు రాకున్నా జీతంలో కోత పడుతోంది.

రెండేళ్ల తర్వాత పరిహారమా?

ప్రమాదంలో మృతి చెందిన ఎనర్జీ అసిస్టెంట్ల కుటుంబసభ్యులకు నిబంధన మేరకు ఇచ్చే పరిహారాన్ని వెంటనే అందిస్తే.. వారికి ఆర్థికంగా కొంత ఉపశమనం లభిస్తుంది. దుర్ఘటన జరిగిన తర్వాత ఏడాదికో, రెండేళ్లకో రూ.16 లక్షలు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఆలోగా ఆ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. రెండేళ్ల కిందట ప్రమాదంలో మృతి చెందిన వారికి పరిహారాన్ని అధికారులు ఇప్పుడు అందిస్తున్నారు. గాయపడినవారికి వైద్య ఖర్చులు భరించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. దీంతో అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి బయటపడినా.. వైద్యం కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలన్న ఆవేదన వారిని కుంగదీస్తోంది. తమను సచివాలయ వ్యవస్థలో విలీనం చేసి, సర్వీసు నిబంధనలను వర్తింపజేస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఎనర్జీ అసిస్టెంట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో 15,004 గ్రామ/ వార్డు సచివాలయాలుంటే.. 7,966 మంది ఎనర్జీ అసిస్టెంట్లను మాత్రమే ప్రభుత్వం భర్తీ చేసింది. దీంతో కొన్నిచోట్ల రెండు సచివాలయాల పరిధిలో ఒక్కరే విధులు నిర్వహించాల్సి రావడంతో పని ఒత్తిడీ పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

క్షేత్రస్థాయిలో చేస్తున్న పనులు

11 కేవీ, అంతకు మించి విద్యుత్‌ లైన్లలో సరఫరాకు అంతరాయం కలిగితే సంబంధిత లైన్‌ ఇన్‌స్పెక్టర్‌, లైన్‌మెన్‌, అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ మాత్రమే విధులు నిర్వర్తించాలి. క్షేత్రస్థాయిలో వారు కనిపించడం లేదు. ఎలాంటి సమస్య వచ్చినా ఎనర్జీ అసిస్టెంట్లతోనే పనులు చేయిస్తున్నారు. జాబ్‌ చార్ట్‌ ప్రకారం ప్రమాదకరమైన విద్యుత్‌ లైన్లపై వారు పనిచేయడానికి వీల్లేదు. కానీ, మెమో ఇస్తామని, విధుల నుంచి తొలగిస్తామని ఉన్నతాధికారులు బెదిరిస్తుండటంతో ప్రమాదమని తెలిసీ ప్రాణాలను ఫణంగా పెట్టి 11 కేవీ, 33 కేవీ లైన్లలో పనులు చేస్తున్నామని ఎనర్జీ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత గ్రామ, వార్డు సచివాలయ పరిధికే వారి సేవలు పరిమితం. కానీ ఏఈ సెక్షన్‌ పరిధిలో ఎక్కడ సమస్య వచ్చినా తీసుకెళుతున్నారు. దీంతో తరచూ 20 కిలోమీటర్లు వెళ్లి, ప్రమాదకరమైన తీగలపై మరమ్మతులు చేయాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


జాబ్‌ చార్ట్‌ ప్రకారం ఎనర్జీ అసిస్టెంట్ల ముఖ్య విధులు

* సచివాలయ పరిధిలో వెలగని వీధిదీపాలను, వేలాడే తీగలను గుర్తించి లైన్‌ ఇన్‌స్పెక్టర్‌, సిబ్బంది ద్వారా మరమ్మతులు చేయించడం

ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణలో విద్యుత్‌ సిబ్బందికి సహకారం అందించడం

ఎల్‌టీ లైన్లలో తలెత్తే సమస్యలు, నిర్వహణకు సంబంధించి డిస్కంల సిబ్బందికి సహకారం

ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్స్‌, బ్రేక్‌డౌన్లు, వినియోగదారుల నుంచి అందిన ఫిర్యాదులపై ఉన్నతాధికారుల ఆదేశాలకు లోబడి వ్యవహరించడం

విద్యుత్‌ సబ్సిడీ పథకాల అమలు పర్యవేక్షణ

తాగునీటి ప్రాజెక్టులకు విద్యుత్‌ సరఫరా చేసే లైన్లలో తలెత్తే సమస్యలను గుర్తించి పరిష్కరించడం.

ఈనాడు, అమరావతి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు