Jagananna Vidya Kanuka: పిల్లలు తగ్గినా ‘కానుక’ ఖర్చు పెరిగింది.. నాణ్యత పేరుతో అధిక ధరలు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ‘విద్యా కానుక’ కిట్ల ధర ఈ ఏడాది భారీగా పెరిగిపోయింది. విద్యా కానుక కింద ఇస్తున్న వస్తువులన్నీ నాణ్యమైనవని ప్రభుత్వం ఏటా ప్రకటిస్తోంది.

Published : 10 Jun 2023 07:49 IST

గతేడాదితో పోల్చితే 2 లక్షల మంది తగ్గిన విద్యార్థులు
పెరిగిన రూ.155 కోట్ల వ్యయం

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ‘విద్యా కానుక’ కిట్ల ధర ఈ ఏడాది భారీగా పెరిగిపోయింది. విద్యా కానుక కింద ఇస్తున్న వస్తువులన్నీ నాణ్యమైనవని ప్రభుత్వం ఏటా ప్రకటిస్తోంది. కానీ, ఈసారి నాణ్యత పెంచామంటూ వ్యయాన్నీ భారీగా పెంచేశారు. అంటే గతంలో ఇచ్చిన వస్తువుల్లో నాణ్యత లేదా? లేదంటే ఈసారి ఎక్కువ ధరలు పెట్టి కొన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెండర్ల నిబంధనల ప్రకారం గుత్తేదార్లు వస్తువులను సరఫరా చేయాలి. నిబంధనలను ఉల్లంఘిస్తే వారికి జరిమానా విధించడంతోపాటు బ్లాక్‌ లిస్టులో పెట్టొచ్చు. కానీ టెండర్ల నిబంధనల ప్రకారం వస్తువుల నాణ్యత ఉందా లేదా అని పరిశీలించే బాధ్యతను ప్రభుత్వం ‘క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా’కు అప్పగించింది. ఇందుకోసం ఈ సంస్థకు రూ.1.50 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. గతేడాది సరఫరా చేసిన బ్యాగ్‌ల్లో చాలా వరకు చినిగిపోయాయి. అధికారులకు అందిన ఫిర్యాదుల మేరకే 6 లక్షలు చినిగినట్లు గుర్తించి, వాటి స్థానంలో కొత్తవి ఇచ్చారు. కానీ, గుత్తేదార్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, పాత గుత్తేదార్లలో ముగ్గురు ఈ ఏడాదీ బ్యాగ్‌లు సరఫరా చేస్తుండటం గమనార్హం. చినిగిన బ్యాగ్‌లు ఇచ్చిన వారిని వదిలేసి, వస్తువుల తనిఖీ కోసమంటూ రూ.1.5 కోట్లు ఖర్చు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పిల్లలు తగ్గినా.. వ్యయం పెరిగింది

2022-23 విద్యా సంవత్సరంలో 45,14,687 మంది విద్యార్థులకు కిట్లు అందించేందుకు రూ.886.69 కోట్లు వ్యయమైంది. ఈ ఏడాది 43,10,165 మంది పిల్లలకు కిట్లు ఇవ్వడానికి రూ.1,042.53 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పిల్లల సంఖ్య రెండు లక్షలు తగ్గినా.. వ్యయం మాత్రం రూ.155 కోట్లు పెరగడం గమనార్హం.

భారీగా పెరిగిన బ్యాగ్‌ల ధర

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు 39,95,992 మంది ఉన్నారు. అదనంగా వచ్చే పిల్లల కోసమని కూడా లెక్కవేసి 43 లక్షలకు పైగా బ్యాగులు కొనుగోలు చేశారు. గతేడాది నాణ్యత లేని బ్యాగ్‌లు ఇచ్చారని, ఈసారి నాణ్యమైనవి కొనడం వల్లే ధరలు పెరిగినట్లు అధికారులు చెప్పడం గమనార్హం. గతేడాది మూడు సైజుల బ్యాగ్‌ల ధర సరాసరిన రూ.185 ఉండగా.. ఈసారి అది రూ.272.92 అయింది. అంటే ఒక్క బ్యాగ్‌ ధరే సుమారు రూ.88 పెరిగింది. గుత్తేదార్లు రింగ్‌ కావడం వల్లే దీని ధరలు భారీగా పెరిగినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అన్ని స్థాయిల విద్యార్థులకు కలిపి ఒకే బ్యాగ్‌ అందించేలా ఒక్కోటి రూ.265 ధరకు టెండర్లు పిలిచారు. గుత్తేదార్లు రింగై 30 శాతం అధికానికి కోట్‌ చేశారు. రివర్స్‌ టెండర్లలోనూ గుత్తేదార్లు దిగి రాకపోవడంతో వీటిని రద్దు చేశారు. ఆ తర్వాత బ్యాగ్‌ల సైజులను మూడు రకాలుగా విభజించి, అయిదు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. 2.43 శాతం అధికంగా గుత్తేదారులు కోట్‌ చేశారు. ఒక్కో బ్యాగ్‌ రూ.272.92 సరఫరా చేసేందుకు అంగీకరించారు.

గతేడాది జత బూట్లు, 2 జతల సాక్సులు కలిపి రూ.175కు కొనగా.. ఈసారి అది రూ.187.48కి పెరిగింది. ఒక్కో యూనిట్‌పై రూ.12 అధికంగా చెల్లించబోతున్నారు.

గతేడాది 1-5 తరగతులకు ఇచ్చిన పిక్టోరియల్‌ డిక్షనరీ ఒక్కోదాన్ని రూ.64కు ముద్రిస్తే ఈసారి రూ.69.47కు పెరిగిపోయింది. 6-10 తరగతులకు ఇస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ ఒక్కోటి గతేడాది రూ.168 పెట్టి కొన్నారు. ఈసారి ఏకంగా రూ.193 ఖర్చు చేశారు.

1-8 తరగతులకు ఇస్తున్న ఒక్కో పాఠ్యపుస్తకం ధర సరాసరిన రూ.11.88 పెరిగింది.

6-10 తరగతులు చదివే విద్యార్థులకు ఉచితంగా ఇస్తున్న నోటు పుస్తకాల పరిస్థితీ ఇలాగే ఉంది. ఈ ఏడాది సరాసరిన ఒక్కో నోట్‌ పుస్తకానికి రూ.6 అదనంగా ఖర్చు చేశారు.


నోటుపుస్తకాలపైనా జగన్‌ ప్రచారం

ముఖ్యమంత్రి జగన్‌ ప్రచారం కోసం చివరికి విద్యార్థుల్నీ వదలేదు. విద్యా కానుక కింద ఇచ్చే రాత పుస్తకాలపైన జగన్‌ ఫొటో ముద్రించారు. స్వచ్ఛంగా ఉండాల్సిన పాఠశాల వాతావరణాన్నీ రాజకీయాలతో కలుషితం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  గతేడాది నోటు పుస్తకాలపై ‘నాడు- నేడు’, సంప్రదాయ నృత్యాలు, చేతివృత్తులు వంటి చిత్రాలను ముద్రించారు. ఈసారి ‘జగనన్న అమ్మఒడి’, జగనన్న విద్యాకానుక, తదితర కార్యక్రమాలను ప్రస్తావిస్తూ సీఎం జగన్‌ ఫొటో ముద్రించారు. పాఠశాల విద్యాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి స్వామి భక్తి ప్రదర్శించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు