ChandraBabu: కుప్పంలో చంద్రబాబు ఇంటికి అడ్డంకులు

చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణానికి అనుమతుల మంజూరులో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది.

Updated : 11 Jun 2023 07:32 IST

ప్రభుత్వ అనుమతుల్లో తీవ్ర జాప్యం
ఆరు నెలలుగా ఆగిన నిర్మాణ పనులు

కుప్పం, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణానికి అనుమతుల మంజూరులో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు.. తన సొంత నియోజకవర్గంలో ఇంటి నిర్మాణానికి గతేడాది శ్రీకారం చుట్టారు. శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద.. కుప్పం-పలమనేరు జాతీయరహదారి పక్కన 2 ఎకరాల్లో ముందుగా రక్షణగోడ నిర్మాణం ప్రారంభించారు. ప్రహరీ పనులు ముగింపుదశకు చేరుకున్నాయి.

స్పందించని పీఎంకే ఉడా: రైతుల నుంచి కొన్న పొలాన్ని నిబంధనల మేరకు కన్వర్షన్‌ చేపట్టి.. ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వ అనుమతులు కోరుతూ.. సుమారు ఆరు నెలల కిందట చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌ పీఎంకే ఉడాకు దరఖాస్తు చేశారు. ఉడా వర్గాల నుంచి స్పందన లేకపోవడంతో అనుమతుల కోసం న్యాయస్థానం ద్వారా నోటీసులను పంపినట్లు తెలిసింది.

ఎక్కడి పనులు అక్కడే: శివపురం వద్ద దాదాపు ఏడాదిన్నర క్రితం ప్రారంభించిన నిర్మాణ పనులను చంద్రబాబు, పార్టీ ప్రధానకార్యదర్శి లోకేశ్‌ వేర్వేరు సందర్భాల్లో పరిశీలించారు. నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని స్థానిక నాయకుల్ని ఆదేశించారు. అయితే ప్రభుత్వ అనుమతులు రాకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగాయి. దాంతో నిర్మాణ సామగ్రిని ఆరుబయట భద్రపరిచారు. అనుమతులు రాకపోవడం వల్లే నిర్మాణాలు ఆగిన విషయాన్ని చంద్రబాబు, లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు స్థానిక నేతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని