జగన్ పటారం.. చెరువు లొటారం!
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోని 68 చెరువులకు నీరిచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 19న ప్రారంభించబోతుండటంపై పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు.
పనులు పూర్తిచేయకుండానే ప్రారంభోత్సవం చేస్తారట!
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 68 చెరువులకు నీరెప్పుడు అందేనో?
ఈనాడు- కర్నూలు, న్యూస్‌టుడే- కృష్ణగిరి, తుగ్గలి, పత్తికొండ గ్రామీణం, డోన్: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోని 68 చెరువులకు నీరిచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 19న ప్రారంభించబోతుండటంపై పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. 68 చెరువులకు సంబంధించి కొన్నిచోట్ల ఇంకా పైపులైన్లు వేయకుండానే ప్రాజెక్టును ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుండటంపై రైతులు విస్తుపోతున్నారు. కొన్ని చెరువుల వద్ద పనుల జాడే లేకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
- తుగ్గలి మండలం పగిడిరాయి చెరువుకు అర కిలోమీటరు దూరంలో ప్రధాన పైపులైను ఉంది. సీఎం ప్రాజెక్టును ప్రారంభించే సమయానికి పైపులైను వేసే పరిస్థితి లేదు. పగిడిరాయి చెరువు నిండితేనే జొన్నగిరి, ఎర్రగుడి చెరువులనూ గ్రావిటీపై నింపుకోవచ్చు. తుగ్గలి మండలంలో అతిపెద్దదైన జొన్నగిరి చెరువు ఎప్పటికి నిండుతుందో తెలియని పరిస్థితి. ఈ మూడింటినీ అధికారులు ట్రయల్ రన్ చేపడుతున్న వాటి జాబితాలో చూపుతుండడం గమనార్హం.
- ప్యాపిలి మండలం చండ్రపల్లి చెరువుకు ఆరు కిలోమీటర్ల దూరంలో ప్రధాన పైపులైను ఉంది. ఆ ఆరు కిలోమీటర్ల మేర పైపులైను వేయడానికి పనులు కొనసాగుతున్నాయి. ఈ నెల 19న ముఖ్యమంత్రి ప్రాజెక్టు ప్రారంభించే సమయానికి ఇవి పూర్తయ్యే అవకాశమే లేదు. చండ్రపల్లి చెరువు వద్ద అసలు పనుల జాడే లేదు.
- ప్యాపిలి మండలం గుడిపాడు చెరువుకు మూడు కిలోమీటర్ల దూరంలో ప్రధాన పైపులైను పనులు సాగుతున్నాయి. సీఎం ప్రారంభోత్సవం సమయానికి అవి పూర్తయ్యే అవకాశమే లేదు.
పనులు పూర్తయినా నీళ్లు రాలేదు
ప్రాజెక్టులో భాగంగా 68 చెరువులకు నీరిచ్చే క్రమంలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అందులో భాగంగా పలు చెరువులకు నీరందించిన దాఖలాలు లేవు. పత్తికొండ మండలం చక్రాల చెరువుకు నీళ్లు పంపాలని ట్రయల్‌రన్ వేయగా ఓ చోట పైపులైను లీకేజీ సమస్య తలెత్తింది. మరమ్మతులు చేశారు. అయినా ట్రయల్‌రన్‌లో చక్రాల చెరువుకు నీళ్లు మాత్రం రాలేదు. తుగ్గలి మండలం ఆర్.ఎస్.పెండేకల్లు చెరువుకు కనెక్షన్ ఇవ్వలేదు. ప్రధాన పైపులైను నుంచి చెరువుకు నీళ్లు పంపాలంటే రోడ్డును తవ్వి పైపులు వేయాలి. శనివారం నాటికి ఆ పనులు పూర్తికాలేదు. దీంతో ట్రయల్‌రన్ జరగలేదు.
మరోపక్క లీకేజీ ముప్పు
ట్రయల్‌రన్‌లో భాగంగా శుక్రవారం హంద్రీనీవా నీటిని ఆలంకొండ వద్ద నిర్మించిన పంప్‌హౌస్ నుంచి నీటిని కటారు కొండకు పంపగా కేవలం అర కిలోమీటరు దూరంలోనే పైపులైను లీకైంది. 15 అడుగులకు పైగా నీరు ఎగసిపడింది. దీంతో ఆ పైపులైనుకు వెల్డింగ్ చేసి, ఇనుప ముక్కలు అతికించారు. ఈ నేపథ్యంలో పైపులైను కోసం ములిచ్చిన రైతుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. పైపుల్లోని నీరు లీకై పొలాలు నాశనమైతే తమ పరిస్థితి ఏంటోనని ఆందోళన చెందుతున్నారు.
చెరువులు నిండడానికి 90 రోజులు
ప్రాజెక్టు పరిధిలోని 68 చెరువులు, వీటికి అదనంగా అనుసంధానం చేస్తున్న మరో తొమ్మిది నిండటానికి 90 రోజుల సమయం పడుతుంది. ఫలితంగా 10,130 ఎకరాలకు సాగునీరు, 57 గ్రామాలకు తాగునీరు అందాలి. ప్రస్తుతం హంద్రీనీవాలో నీరు పుష్కలంగా ప్రవహిస్తే ఈ ప్రాజెక్టుకు అవసరమైన 1.238 టీఎంసీల నీటిని మళ్లించడానికి అవకాశం ఉంటుంది. హంద్రీనీవా ప్రధాన కాలువకు ఎన్ని రోజుల నీళ్లు వస్తాయో తెలియని పరిస్థితి ఉందని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు.
పొలం దెబ్బతింది
పంప్‌హౌస్ నుంచి కటారుకొండకు వెళ్లే ప్రధాన పైపులైను నా పొలం మీదుగా వెళ్లింది. పొలం అడుగున పైపు ఉంటుందని ఏమీ కాదని చెప్పిన అధికారులు ప్రస్తుతం మొఖం చాటేశారు. పైపులైను లీకేజీ కారణంగా ఎకరం పొలంలో నీరు ఉద్ధృతంగా ప్రవహించింది. ఆ ప్రభావంతో అరెకరం విస్తీర్ణంలో మొత్తం రాళ్లే మిగిలాయి. నా పొలాన్ని మళ్లీ సాగు యోగ్యంగా మార్చుకోవాలంటే కనీసం రూ.2 లక్షల ఖర్చు అవుతుంది. గతంలో పైపులైను వేసి గుంతలను సరిగా పూడ్చకపోవడంతో మట్టి తొలగించడానికి రూ.లక్ష ఖర్చు పెట్టా. నా పొలంలో నేటికీ రెండు పైపులను తీయకుండా వదిలేశారు.
గంగన్న, రైతు, ఆలంకొండ
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం
-
Vijay antony: కుమార్తె మృతి.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ పోస్ట్
-
Sai Rajesh: నా సాయం పొందిన వ్యక్తే నన్ను తిట్టాడు: ‘బేబీ’ దర్శకుడు
-
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే.. ఈ రికార్డులు నమోదవుతాయా?
-
Military Tank: సైనిక శిక్షణ కేంద్రంలో మాయమై.. తుక్కులో తేలి!
-
NTR: ‘ఏఐ’ మాయ.. ఎన్టీఆర్‌ని తలపించేలా.. ఫొటో వైరల్