జగనన్నా.. పల్లెకు బస్సులు ఏవన్నా!?

అంటరానితనం అంటే.. ఫలానా వ్యక్తులను కేవలం భౌతికంగా ముట్టుకోవడానికి వీల్లేదని దూరం పెట్టడం మాత్రమే కాదు. పేదలు ఏ బస్సు ఎక్కుతున్నారో ఆ బస్సును ప్రైవేటుకు అమ్మేయాలని చూడటం.

Updated : 22 Sep 2023 07:10 IST

రాష్ట్రంలో 3,669 గ్రామాలకు ఆర్టీసీ సేవలే లేవు
వైకాపా ప్రభుత్వం వచ్చాక ఏటా తగ్గుతున్న వైనం
గ్రామస్థుల విజ్ఞప్తులు బుట్టదాఖలు చేస్తున్న అధికారులు 

ఈనాడు - అమరావతి

అంటరానితనం అంటే.. ఫలానా వ్యక్తులను కేవలం భౌతికంగా ముట్టుకోవడానికి వీల్లేదని దూరం పెట్టడం మాత్రమే కాదు. పేదలు ఏ బస్సు ఎక్కుతున్నారో ఆ బస్సును ప్రైవేటుకు అమ్మేయాలని చూడటం. రూపం మార్చుకున్న అంటరానితనం మీద, పలు రూపాల్లో ఉన్న ఈ పెత్తందారీ భావజాలం మీద యుద్ధం చేస్తున్న ప్రభుత్వం మనది.’

 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో సీఎం జగన్‌ వ్యాఖ్యలు ఇవి.


  • ఆర్టీసీ బస్సులు ప్రైవేటుకు అమ్మేయాలని చూడటం అంటరానితనం అన్నారే.. మరి మీరు రాష్ట్రంలోని పల్లెలన్నింటికీ పూర్తిస్థాయిలో బస్సుల్లేకుండా చేయడాన్ని ఏమంటారు జగన్‌?
  • ఇది పేదల పక్షపాత ప్రభుత్వమని, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ.. అంటూ ప్రతి ప్రసంగంలో వారిపై ఎనలేని ప్రేమ ఒలకబోస్తుంటారే.. మరి అదే పేదలు, రైతులు, కులవృత్తులు చేసుకునేవాళ్లు, అన్నివర్గాల గ్రామీణులు అత్యధికంగా ఉండే గ్రామాలన్నింటికీ ఆర్టీసీ బస్సులను ఎందుకు నడపలేకపోతున్నారు?
  • రాష్ట్రంలో 3,669 గ్రామాలకు అసలు బస్సులే నడపకుండా, ఆటోల్లోనో, ప్రైవేటు వాహనాల్లోనో మీ పాట్లు మీరు పడండి అని వదిలేయడమేనా వారిపై ప్రేమంటే?
  • ఆటోలు, ప్రైవేటు వాహనాల డ్రైవర్లు అడిగినంత ఛార్జీ చెల్లించేందుకు గ్రామీణులు పడుతున్న ఇక్కట్లు మీకు కనిపించవా?
  • బస్సుల్లేకపోవడంతో ఆయా గ్రామాలకు సామర్థ్యానికి మించి 10-15 మందిని ఎక్కించుకొని ప్రయాణించే ఆటోలు.. అధ్వానంగా ఉన్న రోడ్లపై గుంతలు తప్పించుకొని వెళ్లే ప్రయత్నంలో తరచూ ప్రమాదాలకు గురికావడం మీకు తెలియదా?
  • నాలుగేళ్లలో మూడుసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచేసి, ప్రయాణికులపై ఏటా రూ.2 వేల కోట్ల మేర భారం వేయడంపై ఉన్న శ్రద్ధ పల్లెలకు బస్సులను పరుగులు పెట్టించడంపై ఎందుకు లేదు సీఎం సార్‌?

గ్రామాల్లో ఉండే ప్రజలు నిత్యం తమ అవసరాల కోసం సమీప పట్టణాలు, మండల, నియోజకవర్గ కేంద్రాలకు వెళ్లాలంటే సురక్షిత ప్రయాణం, తక్కువ ఛార్జీల కారణంగా ఎక్కువగా ఆర్టీసీ బస్సులనే ఆశ్రయిస్తారు. కానీ ఏపీఎస్‌ఆర్టీసీ మాత్రం అన్ని పల్లెలకు బస్సులు నడిపేందుకు మొగ్గుచూపడంలేదు. గిట్టుబాటు కాదని, రూట్‌ కనెక్టివిటీ ఇవ్వలేమని.. ఇలా రకరకాల కారణాలతో పలు గ్రామాలకు బస్సులు నడపడంపై దాటవేత ధోరణి అవలంబిస్తోంది. ఏపీఎస్‌ఆర్టీసీ నిత్యం 3,510 రూట్లలో బస్సులు నడుపుతుండగా.. ఇవి 14,213 గ్రామాల మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. అయినా రాష్ట్రవ్యాప్తంగా ఇంకా ఆర్టీసీ బస్సులు తిరగని గ్రామాలు 3,669 ఉన్నాయి. మా ఊళ్లకు బస్సు నడపండి మహాప్రభో అంటూ ఆయా గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు వేడుకున్నా ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడంలేదు. ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే.. పరిశీలిస్తామని హామీ ఇచ్చి, తర్వాత దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారు.


ఏటా తగ్గుతున్న బస్సుల సంఖ్య

గన్‌ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీలో బస్సుల సంఖ్య ఏటా తగ్గిపోతోంది. అత్యధిక కిలోమీటర్లు తిరిగిన, కాలంచెల్లిన బస్సుల స్థానంలో ఎప్పటికప్పుడు కొత్తవి కొనుగోలు చేయడంలేదు. దీంతో గత నాలుగేళ్లలో ఏసీ మినహా, మిగిలిన అన్ని రకాల సర్వీసుల సంఖ్య తగ్గిపోయింది.


ర్టీసీలో 2019లో మొత్తం బస్సుల సంఖ్య 11,770 కాగా, వైకాపా అధికారంలో ఉన్న గత నాలుగేళ్లలో 866 బస్సులు తగ్గి 10,904కి చేరింది.


సూపర్‌ లగ్జరీ, అల్ట్రా డీలక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ వంటి నాన్‌ ఏసీ బస్సులు 4,439 ఉండగా, ప్రస్తుతం 568 బస్సులు తగ్గిపోవడంతో 3,871 మాత్రమే నడుపుతున్నారు.


గ్రామీణుల ప్రయాణించే పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సులు 5,648 నుంచి 5,504 సర్వీసులకు తగ్గాయి.  ఈ లెక్కన పల్లె బస్సుల్లో 144 కనుమరుగయ్యాయి.


త నాలుగేళ్లలో కేవలం ఏసీ సర్వీసులు మాత్రమే పెరిగాయి. 2019లో 340 ఏసీ సర్వీసులు నడపగా, ప్రస్తుతం 462 బస్సులు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని