నాడు నంబి నారాయణన్‌.. నేడు చంద్రబాబు

నిజాయతీపరుడైన ఇస్రో శాస్త్రవేత్త నంబినారాయణన్‌పై కక్షసాధింపుతో తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపినట్లుగానే 45 ఏళ్లపాటు రాష్ట్రానికి సేవలందించిన మచ్చలేని నాయకుడు చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టారని తెలుగుదేశం లోక్‌సభాపక్ష నేత కె.రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు.

Updated : 22 Sep 2023 09:08 IST

నిజాయతీపరులపై తప్పుడు కేసులు
యువతరానికి ఏం సందేశం ఇస్తున్నారు?
లోక్‌సభలో రామ్మోహన్‌నాయుడు

ఈనాడు, దిల్లీ: నిజాయతీపరుడైన ఇస్రో శాస్త్రవేత్త నంబినారాయణన్‌పై కక్షసాధింపుతో తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపినట్లుగానే 45 ఏళ్లపాటు రాష్ట్రానికి సేవలందించిన మచ్చలేని నాయకుడు చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టారని తెలుగుదేశం లోక్‌సభాపక్ష నేత కె.రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. నంబిని అరెస్టుచేసి జైలుకు పంపడం చూసిన తర్వాత కష్టపడి పనిచేసి దేశానికి సేవ చేయాలనుకున్న శాస్త్రవేత్తల మనసుల్లో భయాందోళనలు రేకెత్తాయని, ఇప్పుడు చంద్రబాబు అరెస్టుతో తనలాంటి యువతకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. ఆయన గురువారం లోక్‌సభలో చంద్రయాన్‌ విజయవంతంపై జరిగిన చర్చలో పాల్గొని ప్రసంగించారు.‘‘ప్రతి సంక్షోభం ఒక అవకాశాన్ని సృష్టిస్తుంది. ఆ పరిస్థితుల్లో పోరాడేవారు నాయకులుగా ఎదుగుతారని మా నాయకుడు చంద్రబాబు ఎప్పుడూ చెబుతుంటారు. ఇస్రో శాస్త్రవేత్తలు దాన్నే ప్రపంచానికి చాటిచెప్పారు. వాళ్లు అవకాశాలను అందిపుచ్చుకొని నాయకులుగా ఎదిగారు. ఇస్రో పేరు ఎప్పుడు ప్రస్తావించినా యువతకు గుర్తొచ్చేది మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలామే. చంద్రబాబు ఎన్డీయే కన్వీనర్‌గా ఉన్నప్పుడు అంతటి గొప్ప వ్యక్తి పేరును రాష్ట్రపతి పదవికి ప్రతిపాదించినందుకు మేం గర్విస్తున్నాం. ఆయన ఈరోజు జీవించి ఉంటే ఇస్రో విజయాన్ని చూసి ఎంతో సంతోషించి ఉండేవారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇస్రో సహకారంతో పిడుగుపాట్ల వంటి సమస్యలకు పరిష్కారం కనుక్కోవడానికి ప్రయత్నించారు. ముందస్తు హెచ్చరికలతో ప్రజలు వాటి బారినుంచి తప్పించుకొని సురక్షితంగా బయటపడటానికి వీలైంది.

పోలవరం లాంటి భారీ కార్యక్రమాల పర్యవేక్షణకు స్పేషియల్‌ డ్యాష్‌బోర్డులు కూడా ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా నేను ఇస్రో శాస్త్రవేత్త నంబినారాయణ్‌ కేసు గురించి సభ దృష్టికి తేదలచుకున్నాను. శాస్త్ర, సాంకేతికత అభివృద్ధి కోసం ఏళ్ల తరబడి చేసిన కష్టం... సంకుచిత కక్షసాధింపు ధోరణి కారణంగా వృథా అవుతుందనడానికి ఆయన ఉదంతం ఓ ఉదాహరణ. ఆయన్ను అరెస్టు చేసి జైలుకు పంపడం చూసిన తర్వాత కష్టపడి పనిచేసి దేశానికి సేవ చేయాలనుకున్నవారిమనసుల్లో భయాందోళనలు రేకెత్తాయి. అన్ని అభియోగాల నుంచి విముక్తి పొందినా.. ఆయన ఆరోగ్యం, ప్రతిష్ఠను దెబ్బతీశాయి. 45 ఏళ్లపాటు నిరంతరంగా రాష్ట్రం కోసం పనిచేసిన మచ్చలేని మా నాయకుడు చంద్రబాబుపై రాజకీయ కక్షతో తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపారు. నిజాయతీని శిక్షించడం ద్వారా నాలాంటి యువనాయకులకు ఏం సందేశంఇస్తున్నారు? మరోవైపు సైకోఫ్యాన్స్‌ చుట్టుముట్టిన నాయకుడు ఈ దేశానికి చెందిన రూ.43వేల కోట్లను దోచుకొని ఈ నెల 23న పదో బెయిల్‌ వార్షికోత్సవం జరుపుకోబోతున్నారు. అందువల్ల ఈవ్యవస్థను సరిదిద్దాలి. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ప్రజాస్వామ్య హననానికి వ్యతిరేకంగా సభలో ఉన్నవారంతా ముక్తకంఠంతో నినదించాలని పిలుపునిస్తున్నా’’ అని పేర్కొన్నారు.

అన్‌పార్లమెంటరీ పదాలు వాడలేదు.. ప్యానల్‌ స్పీకర్‌: రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతున్నప్పుడు వైకాపా ఎంపీలు అభ్యంతరం వ్యక్తంచేయగా ఆయన వాటిని తోసిపుచ్చారు. ‘‘నేను ఇక్కడ ఏదైనా ఒక్క అన్‌పార్లమెంటరీ వ్యాఖ్య చేసినా సభాధ్యక్ష స్థానంలో ఉన్న మీరు తొలగించవచ్చు. నేను ఎక్కడా హద్దులు దాటకుండా నా పరిధిలో మాట్లాడుతున్నా’’ అన్నారు. అది వినిపించుకోకుండా వైకాపా సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేయడంతో స్పీకర్‌స్థానంలో ఉన్న ప్యానల్‌ స్పీకర్‌ ఎన్‌కే ప్రేమచంద్రన్‌ జోక్యంచేసుకొని వారి వాదనలను తోసిపుచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని