చంద్రబాబు పోలీసు కస్టడీపై నేడు అనిశా కోర్టు నిర్ణయం

నైపుణ్యాభివృద్ధి సంస్థ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో నమోదు చేసిన కేసులో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడిని విచారించేందుకు పోలీసు కస్టడీకి ఇచ్చే వ్యవహారంపై శుక్రవారం ఉదయం 10.30 గంటలకు నిర్ణయం వెల్లడిస్తామని అనిశా కోర్టు న్యాయాధికారి బి.సత్య వెంకట హిమబిందు గురువారం తెలిపారు.

Updated : 22 Sep 2023 09:38 IST

హైకోర్టు నేటి కేసుల జాబితాలో లేని క్వాష్‌ పిటిషన్‌

ఈనాడు, అమరావతి: నైపుణ్యాభివృద్ధి సంస్థ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో నమోదు చేసిన కేసులో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడిని విచారించేందుకు పోలీసు కస్టడీకి ఇచ్చే వ్యవహారంపై శుక్రవారం ఉదయం 10.30 గంటలకు నిర్ణయం వెల్లడిస్తామని అనిశా కోర్టు న్యాయాధికారి బి.సత్య వెంకట హిమబిందు గురువారం తెలిపారు. తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌, దాని ఆధారంగా అనిశా కోర్టు జారీ చేసిన రిమాండ్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై శుక్రవారమే హైకోర్టు నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందేమో వేచి చూద్దామన్నారు. శుక్రవారం హైకోర్టు నిర్ణయం లేకపోతే పోలీసు కస్టడీపై తాను ఉదయం 10.30 గంటలకు నిర్ణయం వెల్లడిస్తానని పేర్కొన్నారు. ఒకవేళ హైకోర్టు శుక్రవారమే స్పందిస్తే.. తన నిర్ణయాన్ని వాయిదా వేస్తానని పేర్కొన్నారు.

చంద్రబాబును అయిదు రోజుల పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ అనిశా కోర్టులో పిటిషన్‌ వేసింది. దీనిపై ఈ నెల 20న సుదీర్ఘ వాదనలు జరిగాయి. 21న నిర్ణయం వెల్లడిస్తామని అనిశా కోర్టు న్యాయాధికారి పేర్కొన్నారు. 21న(గురువారం) జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌పై నిర్ణయం ఎప్పుడు వచ్చే అవకాశం ఉందని న్యాయవాదులను న్యాయాధికారి అడిగారు. అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ.. శుక్రవారం నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని తాను అనుకోవడం లేదన్నారు. చంద్రబాబు నాయుడి తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ స్పందిస్తూ.. నిర్ణయం వెల్లడించాలా, శుక్రవారం వరకు వేచి ఉండాలా అనేది అనిశా కోర్టు ఇష్టమన్నారు. న్యాయాధికారి స్పందిస్తూ.. శుక్రవారం హైకోర్టు నిర్ణయం ఉంటుందేమో వేచి చూద్దామని, లేకపోతే ఉదయం 10.30 గంటలకు నిర్ణయం వెల్లడిస్తానన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టుకు సంబంధించి శుక్రవారం విచారణకొచ్చే కేసుల జాబితాలో చంద్రబాబు పిటిషన్‌ లేనందున అనిశా కోర్టు నేడే తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని