చంద్రబాబు భద్రతపై కలవరం

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు ఆరోగ్య భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Updated : 22 Sep 2023 06:56 IST

రాజమహేంద్రవరం జైలులో రిమాండ్‌ ఖైదీ డెంగీతో మృతి
అక్కడే ఉన్న తెదేపా అధినేత ఆరోగ్యంపై శ్రేణుల్లో ఆందోళన

ఈనాడు, రాజమహేంద్రవరం, కాకినాడ: రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు ఆరోగ్య భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన దోమలతో ఇబ్బంది పడుతున్నారని ములాఖత్‌ అనంతరం కుటుంబ సభ్యులు, తెదేపా కీలక నేతలు వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా అదే జైలులో రిమాండ్‌లో ఉన్న 19 ఏళ్ల యువకుడు డెంగీ, టైఫాయిడ్‌ ఇతర ఆరోగ్య సమస్యలతో మృతిచెందడంతో జైల్లోని పరిస్థితులపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ(19)ను ఓ కేసులో ఈ నెల 6న రిమాండ్‌ ఖైదీగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తీసుకొచ్చారు. ఆరోగ్య సమస్యల కారణంగా జైలు అధికారులు ఈనెల 7న అతడిని స్థానిక సర్వజన ఆసుపత్రికి తరలించారు. 15న అతనికి డెంగీ అని తేలింది.. పరిస్థితి విషమించడంతో 18న అర్ధరాత్రి కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ 20న తెల్లవారుజామున సత్యనారాయణ మృతిచెందాడు. ఈ ఘటనతో తెదేపా శిబిరం కలవరపడుతోంది. చంద్రబాబు కంటే నాలుగు రోజుల ముందే రిమాండ్‌ ఖైదీగా వచ్చిన యువకుడు డెంగీ సోకి మృతిచెందడంతో అక్కడున్న చంద్రబాబుతోపాటు మిగిలిన ఖైదీల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ‘జడ్‌ ప్లస్‌ భద్రత ఉండాల్సిన చంద్రబాబు చుట్టూ సాధారణ భద్రత ఉంది.. కేటగిరీ-1 సౌకర్యాలు కల్పించాల్సిన చోట ఆ ఊసేలేదు.. పారిశుద్ధ్యం అంతంత మాత్రమే. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన వ్యక్తికి కనీస సౌకర్యాలు కల్పించడం లేదు..’ అంటూ తమ అధినేత చంద్రబాబు చుట్టూ నెలకొన్న పరిస్థితులపై తెదేపా నేతలు ఆందోళన చెందుతున్నారు. తొలి మూడు రోజులూ దోమల బెడదతో చంద్రబాబు చాలా ఇబ్బందిపడ్డారు. ములాఖత్‌లో కలిసిన వారికి ఈ విషయం చెప్పడంతో వారు జైలు అధికారులతో మాట్లాడిన తర్వాత దోమ తెర ఇచ్చినట్లు సమాచారం. అయితే దోమల బెడద ఎక్కువగా ఉండడంతో పగటిపూట పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఎదురవుతోంది.

జైలులో జ్వరాల కేసులే అధికం

ఈ కేంద్ర కారాగారం సుమారు 170 ఎకరాల్లో విస్తరించి ఉంటే.. అందులో 37 ఎకరాల్లో భవనాలు ఉన్నాయి. మిగిలినదంతా పచ్చదనం, ఖాళీ ప్రాంతాలే. పారిశుద్ధ్య పరిస్థితులు, వాతావరణ ప్రతికూలతలతో దోమల బెడద వేధిస్తోంది. ప్రస్తుతం లోపల 2,064 మంది ఖైదీలున్నారు. ప్రముఖ వ్యక్తి జ్యుడిషియల్‌ రిమాండ్‌కు రావడంతో కారాగారంలో సౌకర్యాలు, పారిశుద్ధ్య పరిస్థితులపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

  • జైలు లోపల ఉన్న ఆసుపత్రిని రోజూ వివిధ అనారోగ్య సమస్యలతో సుమారు 100 నుంచి 150 మంది వరకు ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. ఈ కేసుల్లో ఎక్కువ శాతం జ్వర పీడితులే ఉంటున్నారని తెలుస్తోంది.
  • రాజమహేంద్రవరం జైలు నుంచి జిల్లా ఆసుపత్రికి నిత్యం సగటున అయిదుగురు వివిధ అనారోగ్య సమస్యలతో వైద్యానికి వెళుతున్నారు. ఆగస్టులో ముగ్గురు ఇన్‌పేషెంట్లుగా చేరగా.. ఈ నెలలో ఇప్పటివరకు 12 మంది ఆసుపత్రిలో చేరారు. వీరిలో ఎక్కువ మంది తీవ్ర జ్వరాలతో బాధపడుతున్నవారే కావడం గమనార్హం.

డెంగీ కలకలం.. ఫాగింగ్‌ హడావుడి

కేంద్ర కారాగారంలో డెంగీ కలకలం రేగడం.. చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తమవడంతో జైలు అధికారులు అప్రమత్తం అయ్యారు. మలేరియా విభాగం సహకారంతో హుటాహుటిన ఫాగింగ్‌ చేయించారు. లార్వా సర్వేతోపాటు ఖైదీల ఆరోగ్యంపైనా వాకబు చేస్తున్నారు.

దోమల నివారణ చర్యలు చేపట్టాం: డీఐజీ 

రిమాండ్‌ ఖైదీ గంజేటి వీరవెంకట సత్యనారాయణ (19) కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని జైళ్ల శాఖ కోస్తాంధ్ర డీఐజీ ఎం.ఆర్‌.రవికిరణ్‌ తెలిపారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో మొత్తం 2,064 మంది ఖైదీలు, సుమారు 200 మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు. ‘వారందరి ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నాం. దోమల బెడద ఉంటే అందరికీ ఇబ్బందే. అందుకే నివారణ చర్యలు తీసుకుంటున్నాం. జ్వరం కేసులు ఉంటే వారిని వేరుగా ఉంచి పర్యవేక్షిస్తున్నాం. తాజాగా మలేరియా విభాగం జైలులో లార్వా సర్వే చేసింది. ఎక్కడా ఆ జాడలు లేవు. జైలులో ప్రతి వారం ఫాగింగ్‌ చేయిస్తున్నాం. ప్రస్తుతానికి జైలులో డెంగీ కేసులు లేవు’ అని వివరించారు.


కేటగిరీ-1 సౌకర్యాలేవీ..?

‘చంద్రబాబు భద్రతపై భయం ఉంది. ఆయనకు కేటగిరీ-1 సౌకర్యం ఇవ్వాలి. అవేవీ అక్కడ కనిపించలేదు. చన్నీళ్లతో స్నానం చేయాల్సి వస్తోంది.’

ఈనెల 12న చంద్రబాబుతో ములాఖత్‌ అనంతరం ఆయన సతీమణి భువనేశ్వరి ఆందోళన  


దోమలు విపరీతంగా ఉన్నాయి..

‘జైలులో భద్రతపై ఆందోళన ఉంది. దోమలు విపరీతంగా ఉండడంతో చంద్రబాబు ఇబ్బంది పడ్డారు. జైళ్లశాఖ డీఐజీని అడిగితే దోమతెర, మంచం  ఇచ్చామని చెబుతున్నారు. అక్కడ సౌకర్యాల లేమి స్పష్టంగా తెలుస్తోంది.’

ఈనెల 18న చంద్రబాబుతో ములాఖత్‌ తర్వాత తెదేపానేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్య


చంద్రబాబును అంతం చేసేందుకు జగన్‌ కుట్ర

‘చంద్రబాబును... సైకో జగన్‌ అక్రమంగా అరెస్టు చేయించింది జైల్లో అంతం చేయడానికేనన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్‌ రాకుండా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లోనే చంపేందుకు ప్లాన్‌ చేశారు. చంద్రబాబుకు జైలులో భద్రత లేదు. జడ్‌ ప్లస్‌ భద్రతలో ఉన్న ప్రతిపక్ష నేతకు జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోంది. విపరీతమైన దోమలు కుడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు పట్టించుకోవడం లేదు. జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగీ బారినపడి మరణించారు. చంద్రబాబునూ ఇలాగే చేయాలని సైకో కుతంత్రాలు అమలు చేస్తున్నారు. చంద్రబాబుకు ఏం జరిగినా జగన్‌దే బాధ్యత.’

ట్విటర్‌లో తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని