తెదేపా దీక్షా శిబిరంపై వైకాపా రాళ్ల దాడి

గుంటూరు జిల్లాలో వైకాపా శ్రేణులు తెగబడ్డాయి. తెదేపా దీక్షా శిబిరంపై వైకాపా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అనుచరులు రాళ్ల దాడి చేశారు.

Updated : 22 Sep 2023 07:26 IST

ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అనుచరుల వీరంగం
ఐదుగురికి గాయాలు

ఈనాడు, అమరావతి-న్యూస్‌టుడే, తాడికొండ: గుంటూరు జిల్లాలో వైకాపా శ్రేణులు తెగబడ్డాయి. తెదేపా దీక్షా శిబిరంపై వైకాపా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అనుచరులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు తెదేపా కార్యకర్తలు గాయపడ్డారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తాడికొండ తెదేపా ఇన్‌ఛార్జి తెనాలి శ్రావణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ విభాగం ఆధ్వర్యంలో గురువారం దీక్షలు చేపట్టారు. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని కృష్ణానదిలో నిమజ్జనం చేసేందుకు వైకాపా కార్యకర్తలు ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. దీక్షా శిబిరంలోని తెదేపా వారిని చూసి కవ్వింపు చర్యలకు దిగారు. తెదేపా శ్రేణులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా శ్రావణ్‌కుమార్‌ వారించారు. ఊరేగింపు శిబిరం దాటి వెళ్లింది. తర్వాత కొందరు వైకాపా కార్యకర్తలు వెనక్కి వచ్చి శిబిరంలోని వారిపై రాళ్లు, కర్రలు, కుర్చీలు విసిరారు. ఈ క్రమంలో ఐదుగురు తెదేపా కార్యకర్తలకు రాళ్లు తగిలాయి. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మర్రిపూడి బ్రహ్మాజీ అనే కార్యకర్తకు పెదవి, దవడ పగిలిపోయాయి. తెదేపా శ్రేణుల నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో వైకాపా శ్రేణులు వెళ్లిపోయాయి. దాడి విషయం తెలుసుకున్న మోతడక గ్రామస్థులు వైకాపా కార్యకర్తలను తమ గ్రామం వద్ద అడ్డుకుని ధర్నాకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని తెదేపా నేతలకు సర్దిచెప్పారు. విగ్రహాన్ని తరలించేందుకు వైకాపా వారికి అండగా నిలిచారు. విగ్రహంతో పాటు వెళుతున్న ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు సతీమణి... మోతడకలో తెదేపా శ్రేణులు ధర్నా చేస్తున్నారన్న విషయం తెలుసుకుని నిడిముక్కల గ్రామ శివారులో ఆగిపోయారు. వైకాపా కార్యకర్తలు ఆమెకు రక్షణగా కారు చుట్టూ గుంపుగా చేరారు. ఈ దృశ్యాలను చిత్రీకరించేందుకు వెళ్లిన పత్రికా ప్రతినిధుల ఫోన్‌లను లాక్కుని నెట్టేశారు. 

దళితులంటే వైకాపాకు చిన్నచూపు

ఎస్సీ, ఎస్టీ విభాగం ఆధ్వర్యంలో సాగుతున్న దీక్షా శిబిరంపై దాడి చేయడమంటే దళితులపై దాడిగానే భావిస్తున్నామని శ్రావణ్‌కుమార్‌ అన్నారు. వైకాపా నేతలకు దళితులంటే చిన్నచూపు ఉండడం వల్లే ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అనుచరులు దాడికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. పవిత్రమైన వినాయక నిమజ్జనానికి వెళుతూ దాడులు చేయడం చూస్తుంటే వైకాపా నేతలకు దేవుడంటే భయమూ, భక్తీ లేవని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని