జగన్‌ కేసుల్లో వైఎస్‌పై అభియోగాలు నమోదు చేయలేదే?

‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జగన్‌కు లబ్ధి చేకూర్చిన నిర్ణయాలకు సంబంధించి అధికారులు తప్పు చేశారంటూ శ్రీలక్ష్మి సహా పలువురిని జైలుకు పంపించారు.

Updated : 23 Sep 2023 07:00 IST

ఆ కేసుల్లో అధికారుల్ని జైలుకి పంపారు కదా?
నైపుణ్యాభివృద్ధి కేంద్రాల కేసులో అధికారులపై చర్యలేవి?
కక్ష సాధింపుతోనే చంద్రబాబు అరెస్ట్‌
తెదేపా శాసన సభాపక్షం ధ్వజం
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుపై పయ్యావుల కేశవ్‌ ప్రజంటేషన్‌

ఈనాడు, అమరావతి: ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జగన్‌కు లబ్ధి చేకూర్చిన నిర్ణయాలకు సంబంధించి అధికారులు తప్పు చేశారంటూ శ్రీలక్ష్మి సహా పలువురిని జైలుకు పంపించారు. అప్పటి సీఎం వైఎస్‌పై అభియోగం మోపలేదు. కానీ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల కేసులో ఒక్క రూపాయి అవినీతి జరగకపోయినా జరిగిందని దుష్ప్రచారం చేస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును వైకాపా ప్రభుత్వం అరెస్ట్‌ చేసింది. ఆ ప్రక్రియలో క్రియాశీలక పాత్ర వహించిన అధికారుల గురించి ప్రస్తావించడం లేదు. చంద్రబాబుపై జగన్‌ ప్రభుత్వ కక్షసాధింపునకు ఇదే నిదర్శనం. అప్పట్లో జగన్‌ కేసుల్లో అధికారుల్ని బాధ్యుల్ని చేయాలంటూ ప్రజాహిత వ్యాజ్యం వేసింది ప్రస్తుత అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డే’’ అని తెదేపా శాసనసభాపక్షం ధ్వజమెత్తింది. ముఖ్యమంత్రి, మంత్రివర్గం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారని, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని తెలిపింది. ప్రభుత్వం ప్రచారం చేస్తున్నట్టుగా నైపుణ్యాభివృద్ధి  కేంద్రాల వ్యవహారంలో నిజంగా తప్పు జరిగితే సంబంధిత అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్రవారం శాసనసభ సమావేశాల్ని బహిష్కరించిన అనంతరం అక్కడికి సమీపంలో మందడం గ్రామంలోని ఒక కన్వెన్షన్‌ సెంటర్‌లో సమావేశమయ్యారు. ‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌-వాస్తవాలు’ పేరుతో ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా అసలేం జరిగిందో వివరించారు. ఆ సందర్భంగా ప్రాజెక్టుకి సంబంధించి శాసన సభాపక్షం సభ్యులు, విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.

అమెరికా యూనివర్సిటీలూ అవినీతికి పాల్పడ్డాయా?

‘‘చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 350కి పైగా ఇంజినీరింగ్‌ కాలేజీలు ఏర్పాటు చేసి, ఆ విద్యను సామాన్యులకూ అందుబాటులోకి తేవడం వల్లే వాటిలో చదువుకున్న తెలుగువారు ఈ రోజు ప్రపంచం నలుమూలలా మంచి స్థానాల్లో స్థిరపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్న తరుణంలో సీమెన్స్‌ సంస్థే ముందుకు వచ్చింది. చంద్రబాబు వంటి దార్శనికుడి సారథ్యంలోని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటే వారికి మంచి గుర్తింపు వస్తుందన్న ఉద్దేశంతో సీమెన్స్‌ సంస్థే వెంటపడింది. అ తర్వాతే గుజరాత్‌లో అమలు చేస్తున్న ప్రాజెక్టు పరిశీలనకు ఏపీ ప్రభుత్వం అధికారుల బృందాన్ని పంపింది’’ అని కేశవ్‌ తెలిపారు. సీమెన్స్‌ సంస్థ సౌజన్యంతో దేశంలో అమలవుతున్న నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టుల్ని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం కూడా కొనియాడారని తెలిపారు. ‘‘అమెరికాలోని దాదాపు 25 ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు సీమెన్స్‌తో కలసి 90:10 నిష్పత్తిలోనే ప్రాజెక్టులు అమలు చేస్తున్నాయి. వైకాపా ప్రభుత్వం దృష్టిలో ఆ యూనివర్శిటీలన్నీ అవినీతికి పాల్పడినట్టేనా? మన దేశంలో గుజరాత్‌ సహా ఆరు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. కేంద్ర నౌకాయాన మంత్రిత్వశాఖ 90:10 నిష్పత్తిలోనే ముంబయి, విశాఖల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి విజయవంతంగా అమలు చేస్తోంది. అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల్లోను ఆ ప్రాజెక్టు అమలు చేయడం ఉపయుక్తమని సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి షిప్పింగ్‌ శాఖ కార్యదర్శి లేఖ రాశారు. అంటే వాళ్లంతా అవినీతికి పాల్పడినట్టేనా? జగన్‌ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టుగా నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులో ఒక్క రూపాయి కూడా బయటకు పోయినట్టుగానీ, అది తిరిగి తెదేపా నేతలకు వచ్చినట్టుగానీ ఎలాంటి ఆధారాల్లేవు. జగన్‌ ప్రభుత్వం చంద్రబాబుని ముందు అరెస్ట్‌ చేసి, తర్వాత విచారిస్తామంటూ రివర్స్‌ టెండరింగ్‌లానే రివర్స్‌ ఇన్వెస్టిగేషన్‌ చేస్తోంది’’ అని కేశవ్‌ మండిపడ్డారు.

డబ్బులు ఒకేసారి ఇవ్వలేదు..!

నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ప్రాజెక్టు ప్రారంభం కాకముందే తెదేపా ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నది కూడా దుష్ప్రచారమేనని కేశవ్‌ పేర్కొన్నారు ‘‘గుజరాత్‌ ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులకు మొత్తం నిధుల్ని ఒకేసారి విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వం మాత్రం మొదట 50 శాతం ఇస్తామని, వారిచ్చిన పరికరాలు, సాఫ్ట్‌వేర్‌ మదింపు చేసిన తర్వాతే మిగతా మొత్తం విడుదల చేస్తామని షరతు పెట్టింది. మొత్తం అయిదు విడతలుగా నిధులు విడుదల చేసింది. నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ప్రాజెక్టుపై మొత్తం మూడు సార్లు మంత్రివర్గంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. దానికి అప్పటి ముఖ్యమంత్రిపై కేసులు ఎలా పెడతారు? కీలక నిర్ణయాలు తీసుకున్న, నిధులు విడుదల చేసిన అధికారుల్ని ఎందుకు తప్పుపట్టరు? అప్పట్లో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రాజెక్టుకి ఆమోదం తెలిపిన అజేయకల్లం, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా జీవోలు విడుదల చేసిన నీలం సాహ్నీ, నైపుణ్యాభివృద్ధిశాఖ కార్యదర్శిగా నిధులు విడుదల చేసిన ప్రేమచంద్రారెడ్డి, నైపుణ్య కేంద్రాల ఎంపిక, పర్యవేక్షణ కమిటీలోని అజయ్‌జైన్‌ అధికారులు జగన్‌ ప్రభుత్వంలో కీలకస్థానాల్లో ఉన్నారు. వారిని ఎందుకు విచారించడం లేదు?’’ అని ప్రశ్నించారు.

కేబినెట్‌కి ఫైల్‌ పెట్టాల్సింది ముఖ్యమంత్రా? అధికారులా?

నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం ఉందని కేశవ్‌ తెలిపారు. ఒక వేళ ఏపీఎస్‌ఎస్‌డీసీ ఏర్పాటుపై ప్రతిపాదన కేబినెట్‌కి వెళ్లకుండానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉంటే, ఆ తర్వాతైనా దాన్ని కేబినెట్‌కి పెట్టి ర్యాటిఫై చేయించాల్సిన బాధ్యత అధికారులదా? ముఖ్యమంత్రిదా? అని ఆయన ధ్వజమెత్తారు. ‘‘సీఎస్‌గానీ, సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శిగానీ మంత్రివర్గం ఆమోదం కోసం ప్రతిపాదన పెట్టాలి. ఫైల్‌ ఎందుకు పెట్టలేని ప్రేమచంద్రారెడ్డినిగానీ, కేబినెట్‌ ఆమోదం లేకుండా నిధులు ఎలా విడుదల చేశారని అజేయ కల్లంనిగానీ, కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ జీవో ఎలా ఇచ్చారని నీలం సాహ్నీనిగానీ ఎందుకు అడగడం లేదు?’’ అని ధ్వజమెత్తారు.

ఉండవల్లికి వయసు పెరిగింది..!

నైపుణ్యాభివృద్ధి కేంద్రాల అంశంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ వేయడాన్ని కొందరు సభ్యులు ప్రస్తావించగా.. ‘‘తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి ఏ మెసేజ్‌ వస్తే ఆయన అదే చేస్తారు. ఆయన కళ్లముందే గోదావరి జిల్లాల్లో అడ్డగోలుగాఇసుక తవ్వుకుపోతుంటే సీబీఐ, ఈడీతో దర్యాప్తు చేయమని అడగలేరు. మద్యం అక్రమాలపై దర్యాప్తు చేయమని అడిగే ఆలోచన కూడా ఆయనకు రాదు. కానీ ఇప్పటికే విచారణలో ఉన్న కేసుపై వ్యాజ్యం వేస్తారు. ఆయనకు కొన్ని అంశాలే కనిపిస్తాయి. అయినా వయసు అయిపోయాక కేటరాక్ట్‌ వస్తుంది కదా?’’ అని ఎద్దేవా చేశారు.

ప్రెస్‌మీట్‌లు పెద్ద వినోదం..

ఈ కేసు ఒక పక్క విచారణలో ఉండగా సీఐడీ చీఫ్‌ సంజయ్‌, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఊరూరూ తిరుగుతూ ప్రెస్‌మీట్‌లు పెట్టడం నిబంధనలకు విరుద్ధం కాదా? అని కొందరు అడిగిన ప్రశ్నకు... ‘‘పెట్టనివ్వండి. వాళ్ల ప్రెస్‌మీట్‌లకు ఇప్పుడు సీరియస్‌నెస్‌ లేదు. అవి వినోదాత్మకంగా మారాయి. వారి ప్రెస్‌మీట్‌ల వల్ల తమకు టీఆర్పీలు పెరుగుతున్నాయని టీవీ ఛానళ్ల వారంటున్నారు. దర్యాప్తులో ఉన్న కేసుకి సంబంధించి ప్రెస్‌మీట్‌లు పెట్టకూడదని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలిచ్చింది. దాన్ని ఉల్లంఘించిన అధికారులు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. దర్యాప్తు జరుగుతున్న, కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై అసెంబ్లీలో చర్చించే సంప్రదాయం కూడా లేదు’’ అని ఆయన పేర్కొన్నారు.


అది ఒత్తిడి కాదు... సీఎం ఇచ్చిన ప్రాధాన్యత!

‘‘జగన్‌ లెక్క ప్రకారం నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులో అధికారులు ఎవరూ తప్పు చేయలేదంట..! రూ.370 కోట్లు విడుదల చేయమని చంద్రబాబే ఒత్తిడి తెచ్చారట..! ప్రాజెక్టుని వేగంగా అమలు చేయమని సీఎంగా చంద్రబాబు చెప్పడం ఒత్తిడి తేవడం కాదు... అది ఆయన ప్రాధాన్యత. అందుబాటులో ఉన్న వనరుల్నిబట్టి ఏ రంగాలకు ప్రాధాన్యమివ్వాలో నిర్ణయించుకునే విచక్షణాధికారం ముఖ్యమంత్రులదే. విశాఖలోని రుషికొండపై గెస్ట్‌హౌస్‌ కట్టుకోవడం జగన్‌ ప్రాధాన్యత కావొచ్చు... రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టు చంద్రబాబు ప్రాధాన్యత కావొచ్చు..! దేనికి తొలి ప్రాధాన్యం అన్నది ముఖ్యమంత్రి, మంత్రివర్గ సహచరులు నిర్ణయిస్తారు. అప్పట్లో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టుకి నిధులు విడుదల చేసిన పీవీ రమేశ్‌ ప్రాజెక్టులో ఏ తప్పూ జరగలేదని చెబుతున్నారు. సీఎస్‌గా పనిచేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని చెప్పారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నవారిపై తప్పుడు కేసులు పెట్టి, వేధింపులకు పాల్పడకుండా చూసేందుకే అవినీతి నిరోధక చట్టంలోని 17(ఎ) క్లాజ్‌ని సవరించారు. దాని ప్రకారం చంద్రబాబుపై దర్యాప్తు చేపట్టాలన్నా కూడా గవర్నర్‌ అనుమతి కావాలి. కానీ జగన్‌ ప్రభుత్వం దానికి పూర్తి విరుద్ధంగా ఏకంగా ఆయనను అరెస్ట్‌ చేసేసి, ఆ తర్వాత దర్యాప్తు చేస్తామంటోంది’’ అని కేశవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు