కేసు పూర్వాపరాల్లోకి వెళ్లట్లేదని న్యాయమూర్తే చెప్పారు: అచ్చెన్నాయుడు

తెదేపా అధినేత చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో.. తాను కేసు పూర్వాపరాల్లోకి వెళ్లట్లేదని న్యాయమూర్తే చెప్పారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.

Published : 23 Sep 2023 05:25 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో.. తాను కేసు పూర్వాపరాల్లోకి వెళ్లట్లేదని న్యాయమూర్తే చెప్పారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సీఐడీ విచారణ చాలావరకూ పూర్తయినందున ఈ కేసును క్వాష్‌ చేయలేమని మాత్రమే హైకోర్టు చెప్పిందన్నారు. అవినీతి జరిగిందని గానీ, జరగలేదని గానీ న్యాయస్థానం ప్రస్తావించలేదన్నారు. మంగళగిరిలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘హైకోర్టు తీర్పుపై తెదేపా న్యాయవిభాగం సమగ్రంగా విశ్లేషిస్తోంది. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. చంద్రబాబును ఇబ్బంది పెట్టడానికి, బెయిల్‌ రాకుండా జాప్యం చేయడానికే సీఐడీ కస్టడీ కోరింది. అరెస్టు చేసేటప్పుడు విచారిస్తాం, ఆధారాలు సంపాదిస్తామన్న సీఐడీ ఈ 12 రోజులు ఏం చేసింది?’’ అని ప్రశ్నించారు.

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం

చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని తెదేపా ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. గతంలో కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు సెక్షన్‌ 17ఏ వర్తిస్తుందని వాదించిన ముకుల్‌ రోహత్గీ.. ఇప్పుడు చంద్రబాబుకు వర్తించదని ఎలా వాదిస్తారని ప్రశ్నించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, మంతెన రామరాజుతో కలిసి ఆయన విలేకర్లతో శుక్రవారం మాట్లాడారు. న్యాయవ్యవస్థపై తమకు అచంచల విశ్వాసం ఉందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని