సభ నిర్వహణకు తెదేపా ఆటంకాలు

రాష్ట్రంలో 25 అసెంబ్లీ, నాలుగు పార్లమెంటు స్థానాల్లో సీపీఎం పోటీ చేయనుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రకటించారు.అసెంబ్లీలో తెదేపా ఎమ్మెల్యేల వైఖరిని మంత్రులు ప్రశ్నించారు. శుక్రవారం మీడియా పాయింట్‌లో వారు మాట్లాడారు.

Updated : 23 Sep 2023 06:44 IST

మంత్రుల మండిపాటు

ఈనాడు, అమరావతి: అసెంబ్లీలో తెదేపా ఎమ్మెల్యేల వైఖరిని మంత్రులు ప్రశ్నించారు. శుక్రవారం మీడియా పాయింట్‌లో వారు మాట్లాడారు.


రీల్‌ హీరో బాలకృష్ణ.. రియల్‌ హీరో జగన్‌
-మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

‘అసెంబ్లీలో మీసం తిప్పిన బాలకృష్ణ రీల్‌ హీరో. ఆయన భయపెడితే భయపడిపోవడానికి ఇక్కడెవరూ లేరు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజలకు చేదోడుగా ఉన్న సీఎం జగన్‌ రియల్‌ హీరో. బాలకృష్ణకు దమ్ము ధైర్యముంటే స్కిల్‌ కుంభకోణంపై జరిగే చర్చలో ఎందుకు పాల్గొనలేదు? ఇదేం హీరోయిజం? అంటే తప్పు చేసినట్లు అంగీకరిస్తున్నట్లేనా? బాలకృష్ణను కళాకారుడని ఎవరైనా అంటే తలదించుకోవాలి.’


రచ్చ కోసమే ప్రతిపక్ష సభ్యులు సభకు వచ్చారు: మంత్రి రోజా

‘చర్చ కోసం కాకుండా రచ్చ కోసమే తెదేపా సభ్యులు అసెంబ్లీకి వచ్చారు. నైపుణ్యాభివృద్ధి స్కాంపై చర్చకు నోటీసు ఇచ్చి పాల్గొనకుండా సభ నుంచి పారిపోయారు. అన్ని అంశాలూ పరిశీలించి అవినీతి జరిగిందని నిర్ధారణకు వచ్చాకే చంద్రబాబును జైలుకు పంపారు. ఇన్నర్‌రింగ్‌ రోడ్డు, ఫైబర్‌నెట్‌, రాజధానిలో నిర్మాణాలపైనా చర్చకు సిద్ధమే. బాలకృష్ణ అసెంబ్లీలో కాకుండా, హైకోర్టు న్యాయమూర్తి ముందు విజిల్‌ వేస్తే బాగుంటుంది. అప్పుడు ఆయన లెక్కలేమిటో తేలిపోతాయి. అసెంబ్లీలో చంద్రబాబు సీటు ఎక్కి బాలకృష్ణ విజిల్‌ వేసి వెకిలి వేషాలు వేశారు.’


తెదేపా సభ్యుల తీరు గర్హనీయం: మంత్రి వేణుగోపాలకృష్ణ

‘అసెంబ్లీలో తెదేపా సభ్యుల తీరు అత్యంత గర్హనీయం. చంద్రబాబు సీటుపైకి ఎక్కి బాలకృష్ణ విజిల్‌ వేయడం సరికాదు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినందునే చంద్రబాబు జైలుకు వెళ్లారు. ఆయన తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. కుంభకోణాన్ని సీఐడీ చాలా కష్టపడి వెలికితీసింది. అప్పట్లో మంత్రిగా ఉన్న లోకేశ్‌కు కూడా ఇదే పరిస్థితి వస్తుంది.’


ఆ ధైర్యం తెదేపా నేతలకు ఉందా?: వైకాపా ఎమ్మెల్సీలు

ఈనాడు, అమరావతి: ‘స్కిల్‌ కుంభకోణంలో చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని చెప్పే ధైర్యం తెదేపా నేతలకు ఉందా? చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్లారు. అసెంబ్లీ, మండలిలో తెదేపా సభ్యులు సభాసమయాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా కొత్తగా వచ్చిన సభ్యులు మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నారు’ అని వైకాపా ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్‌, పీవీవీ సత్యనారాయణరాజు, బల్లి కల్యాణ్‌, పోతుల సునీత మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని