అణుధార్మిక బీచ్‌శాండ్‌ తవ్వకాలకు రంగం సిద్ధం

అణుధార్మికత కలిగిన బీచ్‌శాండ్‌ ఖనిజ తవ్వకాలకు రంగం సిద్ధమైంది. మూడు లీజుల్లో ఈ తవ్వకాలు చేపట్టేందుకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) సన్నాహాలు చేసుకుంది.

Published : 23 Sep 2023 06:00 IST

ఏపీఎండీసీకి వెయ్యి హెక్టార్లలో మూడు లీజులు మంజూరు

ఈనాడు, అమరావతి: అణుధార్మికత కలిగిన బీచ్‌శాండ్‌ ఖనిజ తవ్వకాలకు రంగం సిద్ధమైంది. మూడు లీజుల్లో ఈ తవ్వకాలు చేపట్టేందుకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) సన్నాహాలు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని రెండు లీజుల్లో 909.85 హెక్టార్లు, విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో 90.15 హెక్టార్లు కలిపి మొత్తం వెయ్యి హెక్టార్ల మేర మూడు బీచ్‌శాండ్‌ లీజుల్లో తవ్వకాలకు ఏపీఎండీసీకి కేంద్రం అనుమతినిచ్చింది. బీచ్‌శాండ్‌లో మోనజైట్‌, ఇల్లిమనైట్‌, రూటైల్‌, లుకోక్సెన్‌, జిర్కాన్‌, గార్నెట్‌, సిల్లిమనైట్‌ వంటి ఖనిజాలుంటాయి. ఇందులో మోనజైట్‌ అణుధార్మికత కలిగినది. దీన్ని కేంద్ర సంస్థ అయిన ఇండియన్‌ రేర్‌ఎర్త్‌ ఎలిమెంట్స్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌ఈఎల్‌) వద్ద రిజిష్టర్‌ చేసుకున్న సంస్థలకే విక్రయించాలి. మిగిలిన ఖనిజాల్లో అణుధార్మికత పరిమితి తక్కువగా ఉంటే.. ఇతరులకు విక్రయించుకోవచ్చు. విదేశాలకు ఎగుమతి చేయాలన్నా ఐఆర్‌ఈఎల్‌ సర్టిఫికేషన్‌ ఉండాలి. ఈ లీజుల్లో ఖనిజ తవ్వకాలు, నిర్వహణకు సంబంధించి ప్రాజెక్టు డెవలపర్‌ అండ్‌ ఆపరేటర్‌ (పీడీవో) ఎంపికకు ఏపీఎండీసీ టెండర్లు పిలవనుంది. టెండరు దక్కించుకునే సంస్థ.. ఆయా ఖనిజాలను శుద్ధిచేసే ప్లాంటు ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. తవ్వి తీసిన ఖనిజాన్ని ఆ ప్లాంటులో శుద్ధిచేసి వేర్వేరుగా చేశాక ఆయా ఖనిజాలను ఐఆర్‌ఈఎల్‌ నిర్ణయించే ధరలకు విక్రయించాలి. టెండరు పొందే సంస్థ ఆయా ఖనిజాలు విక్రయించే ధరలో 8శాతం ఏపీఎండీసీకి చెల్లించాల్సి ఉంటుందని టెండరు డాక్యుమెంట్లలో ప్రతిపాదించారు. దీనికంటే ఎవరు ఎక్కువ మొత్తం కోట్‌ చేస్తారో వారికి బిడ్‌ దక్కనుంది.

న్యాయ సమీక్షకు టెండరు డాక్యుమెంట్లు

శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో వెయ్యి హెక్టార్ల మేరకున్న మూడు బీచ్‌శాండ్‌ లీజుల్లో ప్రాజెక్టు డెవలపర్‌ అండ్‌ ఆపరేటర్‌ ఎంపికకు సంబంధించిన టెండర్‌ డాక్యుమెంట్లను న్యాయ సమీక్షకు పంపారు. ఈ లీజుల్లో ఖనిజ తవ్వకాల ద్వారా రూ.వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని అంచనా నేపథ్యంలో ఈ టెండరు డాక్యుమెంట్లను న్యాయ సమీక్షకు పంపినట్లు ఏపీఎండీసీ ఎండీ వీజీ వెంకటరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇవి జ్యుడీషియల్‌ ప్రివ్యూ కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. వీటికి బిడ్డర్లు, ప్రజలు ఎవరైనా తమ సలహాలను అక్టోబరు 4వ తేదీలోపు తెలియజేయవచ్చని తెలిపారు. ఈ వివరాల కోసం judge-jpp@ap.gov.in అనే వైబ్‌సైట్‌లో చూడాలని వెల్లడించారు.

17 లీజుల్లో.. మూడే మంజూరు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థల ఆధ్వర్యంలో మాత్రమే బీచ్‌శాండ్‌ తవ్వకాలు జరగాలనే నిబంధన నేపథ్యంలో రాష్ట్రంలో శ్రీకాకుళంనుంచి కృష్ణా జిల్లా వరకు సముద్ర తీరాల్లో 17 చోట్ల బీచ్‌శాండ్‌ లీజుల కోసం గతంలో ఏపీఎండీసీ కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది. వీటిలో కేంద్రం ఇప్పటివరకు మూడు లీజులను మాత్రమే మంజూరు చేసింది. బీచ్‌శాండ్‌ ఖనిజాలను ఎక్కువగా విమానాలకు వినియోగించే పెయింట్ల తయారీ, విలువైన కార్లలో బ్రేక్‌ లైనర్ల తయారీ, అత్యధిక సాంద్రత ఉన్న యంత్రాల తయారీ వంటి వాటికి వినియోగిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని