మధ్య తరగతికి సొంతిల్లంటూ సీఎం బురిడీ!

మధ్య ఆదాయ వర్గాల (ఎంఐజీ) ప్రజలకు అందుబాటు ధరల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీలు గుప్పించిన సీఎం జగన్‌ చివరకు చేతులెత్తేశారు.

Published : 24 Sep 2023 05:42 IST

జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ పేరుతో ప్రజలను వంచించిన జగన్‌
అనేక ప్రాంతాల్లో పూర్తికాని భూసేకరణ
లేఅవుట్లు ప్రారంభించిన చోట పనులు నత్తనడక

మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కలను ప్రభుత్వం సాకారం చేయబోతోంది. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక లేఅవుట్‌ను అభివృద్ధి చేసి లాభాపేక్ష లేకుండా అందుబాటు ధరల్లో ప్లాట్లు కేటాయిస్తాం. లేఅవుట్లలో 50% స్థలాన్ని సామాజిక అవసరాల కోసం వినియోగిస్తాం. విశాలమైన రహదారులు, వీధి దీపాలు, తాగునీటి సరఫరా, భూగర్భ మురుగునీటి వ్యవస్థ ..ఇలా అనేక సదుపాయాలు కల్పించబోతున్నాం

 జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ వెబ్‌సైట్‌ ప్రారంభించిన సందర్భంగా 2022 జనవరి 11న సీఎం జగన్‌ ప్రకటన ఇది..


ధ్య ఆదాయ వర్గాల (ఎంఐజీ) ప్రజలకు అందుబాటు ధరల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీలు గుప్పించిన సీఎం జగన్‌ చివరకు చేతులెత్తేశారు. మాట తప్పను..మడమ తిప్పను అంటూ నమ్మబలికి మధ్య తరగతి ప్రజల ఆశలను ఆవిరి చేశారు. ఎంఐజీ లేఅవుట్లపై ముఖ్యమంత్రే స్వయంగా ప్రచారం చేయడంతో ప్రజలు నమ్మి పెద్దఎత్తున దరఖాస్తులు చేశారు. అరకొరగా ప్రారంభించిన లేఅవుట్లలోనూ రెండేళ్లయినా పనులు పూర్తి కాలేదు. అత్యధిక చోట్ల అసలు పనులే మొదలు కాలేదు. ఇంటి స్థలం విలువలో 10% నగదు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ప్రజలకు ప్లాట్లు ఇవిగో, అవిగో అంటూ చుక్కలు చూపిస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో లేఅవుట్లు ఏర్పాటు చేస్తున్నట్లు మొదట ప్రకటించిన ముఖ్యమంత్రి. ఆ తరువాత ప్రతి నియోజకవర్గంలో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇవన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఇది ప్రజలను నమ్మించి మోసం చేయడం కాదా జగన్‌..?వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో స్వగృహ ప్రాజెక్టు పేరుతో మధ్య తరగతి కుటుంబాలకు అరచేతిలో స్వర్గం చూపించినట్లు...ఇప్పుడు ఆయన కుమారుడు జగన్‌ హయాంలోనూ తిప్పలు తప్పవా..? అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ప్లాట్లు లేవు.. మిగిలినవి పాట్లే

  • కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇళ్ల స్థలాల కోసం దాదాపు 2,600 మంది ముందుకొచ్చారు. నగరానికి సమీపంలో ప్రైవేట్‌ భూముల ధరలు భారీగా ఉండటంతో లేఅవుట్‌ వేసేందుకు అధికారులు ముందడుగు వేయడం లేదు. గుడివాడలో ఇళ్ల స్థలాల కోసం 3,800 మంది దరఖాస్తులు అందించారు. దొండపాడు-వలివర్తిపాడు మధ్య భూములను అధికారులు పరిశీలించారు. ధర విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది.
  • కర్నూలు జిల్లాలో ఇళ్ల స్థలాల కోసం15,600 దరఖాస్తులొచ్చాయి. 500 ఎకరాల భూమి అవసరమని అధికారులు అంచనాకు వచ్చారు. ఏడాదైనా భూసేకరణ ప్రారంభం కాలేదు.
  • ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రజల నుంచి స్పందనే లేదు. కందుకూరులో దరఖాస్తు చేసుకున్న 292 మందిలోనూ 59 మంది మాత్రమే ప్లాట్‌ విలువలో 10 శాతం మొత్తాన్ని చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.
  • ఉమ్మడి విజయనగరం జిల్లాలో పార్వతీపురం, బొబ్బిలిలో స్థలాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులొచ్చినా...లేఅవుట్ల ఏర్పాటుకు ముందడుగు పడలేదు.
  • నెల్లూరు జిల్లా కావలిలో 1,112 ఇళ్ల స్థలాలకు వీలుగా లేఅవుట్‌ అభివృద్ధి పనులు చేపడుతున్నా వీటిలో నాణ్యత లోపిస్తోందన్న ఫిర్యాదులొస్తున్నాయి.

రాజధాని ప్రాంతంలో నిలిచిన పనులు

రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోని మంగళగిరి సమీపంలో ఉన్న నవులూరులో ఎంఐజీ లేఅవుట్ల అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. దాదాపు 81 ఎకరాల్లో 528 ప్లాట్లు మధ్య తరగతి ప్రజలకు కేటాయించాలన్నది ప్రతిపాదన. అధికారులు ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి దరఖాస్తులు రాలేదు. ప్రజలను ఆకర్షించేందుకు ప్రతిపాదిత భూముల్లో ఎప్పటికప్పుడు లేఅవుట్‌ పనులు చేయడం, మళ్లీ నిలిపివేయడం సర్వసాధారణమవుతోంది.


విశాఖలో విచిత్రమైన పరిస్థితి

విశాఖ మెట్రో ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) పరిధిలో ఇళ్ల స్థలాల కోసం  వచ్చిన దరఖాస్తులపై ఆరు చోట్ల లేఅవుట్ల పనులు ప్రారంభించారు. విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో వీటి పనులు కూడా ప్రారంభమయ్యాయి. 1,505 ప్లాట్లు వీటిలో సిద్ధం చేయాలన్నది ప్రణాళిక. మొదట ఎంతో ఆసక్తి చూపిన ప్రజలు తరువాత ప్లాట్‌ విలువలో 10% నగదు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. మొత్తం 1,008 దరఖాస్తుదారుల్లో 367 మంది మాత్రమే ఇప్పటి వరకు నగదు చెల్లించారు.


అంతా గోప్యమే..

ధ్య తరగతి కుటుంబాల కోసం ప్రభుత్వం ప్రారంభించిన జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్‌ (ఎంఐజీ లేఅవుట్లు)కి సంబంధించిన వివరాలను ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోంది. 150, 200, 240 చదరపు అడుగుల్లో ప్లాట్లు  అందుబాటు ధరల్లో ఇస్తామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఇప్పటి వరకు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులెన్ని? ప్లాట్‌ విలువలో 10% మొత్తం చెల్లించిన వారెందరు? ఇలా వచ్చిన మొత్తం ఎంత? లేఅవుట్ల ఏర్పాటుకు ఎన్ని చోట్ల భూ సేకరణ పూర్తయింది? ప్రారంభించిన లేఅవుట్ల వివరాలను అధికారులు బయటపెట్టడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని